HomeNewsBreaking Newsశ్రీలంకపై భారత్‌ ఘన విజయం

శ్రీలంకపై భారత్‌ ఘన విజయం

నాలుగు వికెట్ల తేడాతో గెలిచిన టీమిండియా.. సిరీస్‌ కైవసం
శ్రీలంకతో జరిగిన రెండో వన్డేలో భారత్‌ ఘన విజయం సాధించింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇండియా మొదటి రెండు మ్యాచ్‌లు గెలిచి, మరో మ్యాచ్‌ మిగిలి ఉండగానే సిరీస్‌ కైవసం చేసుకుంది. కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్‌ వేదికగా, గురువారం శ్రీలంక-ఇండియా మధ్య రెండో వన్డే జరిగింది. తొలుత టాస్‌ గెలిచిన శ్రీలంక బ్యాటింగ్‌ ఎంచుకుంది. మొదట నిలకడగానే బ్యాటింగ్‌ ప్రారంభించిన శ్రీలంక 29 పరుగుల వద్ద తొలి వికెట్‌ కోల్పోయింది. 20 పరుగులు చేసిన అవిష్క ఫెర్నాండో మహ్మద్‌ సిరాజ్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు. తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన కుశల్‌ మెండిస్‌తో కలిసి నువానిడు ఫెర్నాండో స్కోరు బోర్డును ముందుకు నడిపించారు. అనంతరం 102 పరుగుల వద్ద కుశల్‌ మెండిస్‌ (34) ఔటయ్యాడు. తర్వాత ధనుంజయ డిసిల్వా డకౌట్‌ అయ్యాడు. అప్పటికే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న నువానిడు ఫెర్నాండో 50 పరుగులకే ఔటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లలో ఎవరూ మెరుగైన ప్రదర్శన చేయలేదు. దునిల్‌ వెల్లలాగే 32 పరుగులు, వానిందు హసరంగా 21 పరుగులు, చరిత్‌ అసలంక 15 పరుగులు మాత్రమే చేశారు. దీంతో 39.4 ఓవర్లకే 215 పరుగులు చేసిన శ్రీలంక ఆలౌటైంది. భారత బౌలర్లలో మహ్మద్‌ సిరాజ్‌ 3 వికెట్లు, కుల్దీప్‌ యాదవ్‌ 3 వికెట్లు, ఉమ్రాన్‌ మాలిక్‌ 2 వికెట్లు, అక్షర్‌ పటేల్‌ ఒక వికెట్‌ తీశారు. అనంతరం 216 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 33 పరుగుల వద్ద తొలి వికెట్‌ కోల్పోయింది. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ 21 బంతుల్లో 17 పరుగులే చేసి ఔటయ్యాడు. అనంతరం మరో ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌ 21 పరుగులు చేసి ఔటయ్యాడు. తర్వాత వచ్చిన విరాట్‌ కోహ్లీ 9 బంతులు ఎదుర్కొని 4 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. తర్వాత శ్రేయస్‌ అయ్యర్‌ 28 పరుగులు చేసి ఔటయ్యాడు. చాలా రోజుల తర్వాత కేఎల్‌ రాహుల్‌ నిలకడగా ఆడుతూ భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. 103 బంతుల్లో రాహుల్‌ 64 పరుగులు చేసి, నాటౌట్‌గా నిలిచాడు. తర్వాత హార్ధిక్‌ పాండ్యా కూడా నిలకడగా ఆడుతూ 36 పరుగులు చేసి ఔటయ్యాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన అక్షర్‌ పటేల్‌ 21 బంతుల్లో 21 పరుగులు చేసి ఔటయ్యాడు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన కుల్దీప్‌ యాదవ్‌ 10 బంతుల్లో 10 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. దీంతో 43.2 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయిన టీమిండియా 219 పరుగులు చేసి విజయం సాధించింది.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments