6 సిక్స్‌లతో స్టోయినిస్ విధ్వంసం..
పెర్త్: టీ20 ప్రపంచకప్ 2022లో ఆతిథ్య ఆస్ట్రేలియా ఎట్టకేలకు విజయాన్ని నమోదు చేసింది. న్యూజిలాండ్‌తో ఎదురైన ఘోర పరాజయం నుంచి ఫించ్ సేన త్వరగానే తేరుకుంది. శ్రీలంకతో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా రాణించి 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 157 పరుగులు చేసింది. పాతుమ్ నిస్సంక(45 బంతుల్లో 2 ఫోర్లతో 40), చరిత్ అసలంక(25 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 38 నాటౌట్), ధనంజయ డిసిల్వా(23 బంతుల్లో 3 ఫోర్లతో 26) రాణించారు. ఆసీస్ బౌలర్లలో జోష్ హజెల్ వుడ్ ప్యాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, అష్టన్ అగర్, గ్లేన్ మ్యాక్స్‌వెల్ తలో వికెట్ తీసారు. లక్ష్యచేధనకు దిగిన ఆసీస్.. 16.2 ఓవర్లలో 3 వికెట్లకు 158 పరుగులు చేసి గెలుపొందింది. మార్కస్ స్టోయినీస్(18 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్స్‌లతో 59 నాటౌట్) ఫాస్టెస్ట్ ఫిఫ్టీతో విజయంలో కీలక పాత్ర పోషించాడు. గ్లేన్ మ్యాక్స్‌వెల్(12 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 23) మెరుపులు మెరిపించగా… ఆరోన్ ఫించ్(42 బంతుల్లో సిక్స్‌తో 31 నాటౌట్) జిడ్డు బ్యాటింగ్‌తో విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు. పరుగు లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా ఏడు ఓవర్ల వరకు దారుణంగా ఆడింది. లంక పేసర్లను ఎదుర్కోవడంలో ఆరోన్ ఫించ్ ఇబ్బంది పడగా.. మరోవైపు ఒత్తిడికి గురైన డేవిడ్ వార్నర్(11) క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత వచ్చిన మిచెల్ మార్ష్ సైతం ఇబ్బంది పడటంతో ఆస్ట్రేలియా తొలి 7 ఓవర్లలో వికెట్ నష్టానికి 38 పరుగులు మాత్రమే చేసింది. హసరంగా బౌలింగ్‌లో మిచెల్ మార్ష్ ఎదురు దాడికి చేయడంతో ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ ఊపందుకుంది. అతను ఔటైనా.. మ్యాక్స్‌వెల్ వచ్చి విధ్వంసం సృష్టించాడు. వేసిన 10వ ఓవర్‌లో మ్యాక్సీ రెండు సిక్స్‌లతో పాటు ఫోర్ కొట్టి 19 పరుగులు పిండుకున్నాడు. ఆ తర్వాత కుమార లాహిరు బౌలింగ్‌లో గాయపడ్డ అతను.. భారీ షాట్ ఆడే ప్రయత్నంలో క్యాచ్ ఔటయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన స్టోయినిస్ విధ్వంసం సృష్టించాడు. భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలోనే 17 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసి టీ20 ప్రపంచకప్‌లో వేగవంతమైన అర్థశతకం బాదాడు.