కుర్చీల్లోనే రెవెన్యూ అధికారుల కునుకు పాట్లు
కబ్జాకు గురైందని తాపీగా పంచాయతీ పాలకవర్గం ఫిర్యాదు
ప్రజాపక్షం/హత్నూర :
శ్మశాన వాటిక కబ్జా కోరల్లో చిక్కుకుంది. ఆక్రమణకు ఏదీ అనర్హం కాదన్నట్లుగా కొందరు ఏకంగా వల్లకాడునే కబ్జా చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం కాసాల గ్రామ 12వ వార్డు సమీపంలో సర్వే నెంబర్ 336 లో గల 2 ఎకరాల ప్రభుత్వ భూమిని చాలా ఏళ్ళ కింద అసైన్‌మెంట్ ద్వారా ఒక ఎకరం భూమిని (బిఎస్‌ఎన్‌ఎల్) టెలిఫోన్ భవనానికి, మరో ఎకరాన్ని శ్మశాన వాటిక కోసం కేటాయించారు. అయితే ప్రస్తుతం ఆ ప్రాంతానికి బాగా డిమాండ్ పెరగడంతో కోట్లల్లో ధర పలుకుతోంది. దీంతో కొందరి అక్రమార్కుల కన్ను దానిపై పడింది. వారికున్న అంగబలం, అర్థబలానికి తోడుగా పాలకుల అండదండలు, అధికారుల సహకారం పుష్కలంగా ఉండటంతో యధేచ్ఛగా కబ్జాకు దిగుతున్నారు. అధికారులు, పాలకుల అండతో రెవెన్యూ అధికారుల కనుసన్నల్లోనే తప్పుడు పత్రాలను సృష్టించి ఆక్రమణదారులు కబ్జాకు పూనుకున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. స్మశాన వాటిక కబ్జా కోరల్లో చిక్కుకున్న విషయం సర్వత్రా చర్చనీయాంశమైంది.దీంతో శ్మశాన వాటిక కబ్జాకు గురవుతున్నదని కాసాల పంచాయతీ పాలకవర్గం బుధవారం స్థానిక తహసీల్దార్ పద్మావతికి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసేంతవరకు రెవెన్యూ అధికారులకు కబ్జా విషయం తెలియదంటే వారు ఎంత సమర్ధవంతంగా విధులు నిర్వహిస్తున్నారో అర్ధమవుతున్నది. రెవెన్యూ అధికారుల అసమర్థత వల్లే ప్రభుత్వ భూములకు రక్షణ లేకుండా పోయిందని గ్రామ ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇప్పటికైనా సంబంధిత రెవెన్యూ అధికారులు కళ్ళు తెరిచి ప్రభుత్వ భూముల ఆక్రమణలను ఆపాలని బాధిత గ్రామస్తులు డిమాండ్ చేశారు.
శ్మశానమూ కబ్జా
RELATED ARTICLES