అవసరం లేకున్నా ఆపరేషన్లు
జలగల్లా రోగుల రక్తాన్ని పీల్చేస్తున్న ఆసుపత్రులు
ఆర్‌ఎంపిలను పెంచి పోషిస్తున్న కొందరు వైద్యులు
కార్పొరేట్ ముసుగులో అసాంఘిక కార్యకలాపాలు
ప్రజాపక్షం/ ఖమ్మం: పేద, మధ్యతరగతి ప్రజలకు అనారోగ్యం వచ్చిందంటే ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితులు దాపురించాయి. ప్రభుత్వం వైద్యంపై ఏటా కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నా ఫలితం మాత్రం ఉండడం లేదు. వైద్యుడుంటే మందులు లేని, మందులుంటే వైద్యుడు లేని రెండు ఉంటే కనీస వసతులు లేని ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్లేందుకు ప్రజలు జంకుతున్నారు. ప్రాణాలు పోతాయేమోనని ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. ఇదే అదునుగా ఆసుపత్రుల యాజమానులు దోపిడీకి పాల్పడుతున్నారు. సామాన్య జ్వ రం సోకిందంటే 10 రకాల పరీక్షలు రాస్తున్నారు. దీనికి పలు కారణాలు ఉన్నాయి. ప్రతి ల్యాబ్ నుంచి వైద్యునికి కమిషన్ రూపంలో పెద్ద మొత్తంలో ముడుతుంది. అదే సొంత ల్యాబ్ ఉంటే ఇక మరింత లాభం. కేవలం డబ్బుల కోసమే ఇన్ని పరీక్షలు చేయిస్తున్నారని నిజాయితీతో వ్యవహరించే సీనియర్ వైద్యులే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక అవసరం లేకున్నా ఐసియులో రోగిని ఉంచుతున్నారు. ముక్కు పిండి మరీ రోజువారీగా వేల రూపాయలు వసూలు చేస్తున్నారు. అవసరం లేకున్నా ఆపరేషన్లు చేస్తున్నారు. అవసరం లేని ఆపరేషన్లతో ప్రాణాలు పొగొట్టుకున్న రోగులు అనేక మంది ఉన్నారు. బంధువులు ఆందోళన చేస్తే మధ్యవర్తుల ద్వారా తులమో ఫలమో ఇచ్చి సమస్యను పరిష్కరించుకుంటున్నారు. ఏడాది క్రితం ఖమ్మంలోనూ ఓ విద్యార్థికి ఠాగూర్ సినిమా తరహా వైద్యం అం దించారు. చివరకు మృతదేహం ఉబ్బిపోవడంతో కుటుంబ సభ్యులు గమనించి ఆందోళనకు దిగి ఆసుపత్రిని సైతం ధ్వంసం చేశారు. ఇది వెలుగు చూసిన ఓ ఘటన. వీటన్నింటి నడుమ ఇప్పుడు వైద్య వ్యాపారం అత్యంత లాభదాయకంగా మారింది. అనేక మంది వ్యాపారవేత్తల చూపు ఆసుపత్రుల వైపు నిర్వహణ వైపు మళ్లింది. అర్హత ఉన్నా లేకున్నా ఒకరిద్దరి వైద్యుల పేర్లు పెట్టి ఆసుపత్రులు నిర్వహిస్తున్నారు. ఈ విషయం ప్రభుత్వ వైద్యాధికారుల పరిశీలనలో అనేక సార్లు బయటపడినా మిన్నకున్నారే తప్ప సరైన రీతిలో చర్యలు తీసుకోలేదు. ఒక పేరుతో ఉన్న ఆసుపత్రిని మూసివేస్తే మరో పేరుతో అదే నిర్వహకుడు మరో వైద్యుని పేరు పెట్టి ఆసుపత్రులు నిర్వహిస్తున్నారు. ల్యాబ్‌ల నిర్వహణది అదే పరిస్థితి. ఇక అనుమతులు లేని ఆసుపత్రులు కోకోల్లాలు. అనుమతి లేని ఆసుపత్రులు పెద్ద పెద్ద హోర్డింగ్‌లు పెట్టి ప్రచారాలు చేస్తున్నా అధికార యంత్రాంగం కిమ్మనడం లేదు. ఒక ఆసుపత్రిలో వైద్యం మరో ఆసుపత్రిలో బిల్లు ఇస్తున్నా పట్టించుకున్న నాధుడే లేడు. ఎముకల వైద్యుడినంటూ ఆసుపత్రి ప్రారంభించి జనరల్ ఆపరేషన్లు చేస్తున్నా ప్రశ్నించే వారే కరువయ్యారు. ఇది ఒక ఖమ్మానికో మరో నగరానికో పరిమితం కాలేదు. రాష్ట్రవ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. నిజాయితీతో వైద్యం అందించి జబ్బుకు తగిన మందులు రాసే అనేక మంది నిజాయితీ గల వైద్యులు కలిగిన ఆసుపత్రులు వెలవెలబోతుండగా మాయ మాటలతో వింత వైద్యాలతో నడుస్తున్న ఆసుపత్రులు రోగులతో కిటకిటలాడుతున్నాయి.