మూసీని అడ్డంపెట్టుకుని ఎంతకాలం బతుకుతారు
కెటిఆర్, హరీశ్‌రావు, సబిత, కెవిపి ఫాంహౌస్‌లను కూల్చేయొద్దా ? పేదలను అడ్డంపెట్టుకుని ధర్నాలు చేస్తున్నారు : మీ భరతం పడతాం మూసీనది ప్రక్షాళనపై అఖిలపక్షానికి సిద్ధం బిఆర్‌ఎస్ నేతలు దోచుకున్న సొమ్ములో రూ.500 కోట్లు ‘మూసీ’ పేదలకు పంచాలి పార్టీ మారినా ఈటలకు పాతవాసన పోలేదు ప్రధాని మాత్రం సబర్మతిని శుభ్రం చేసుకోవచ్చా? ఫ్యామిలీ డిజిటల్ కార్డుల ప్రారంభోత్సవంలో సిఎం రేవంత్‌రెడ్డి ధ్వజం
ప్రజాపక్షం/హైదరాబాద్
ప్రధాని నరేంద్రమోదీ సబర్మతి రివర్‌ను శుభ్రం చేసుకోవచ్చు. మనం మాత్రం మూసీని శుభ్రం చేసుకోవద్దా? అంటూ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. కెటిఆర్, హరీశ్‌రావు, సబితా ఇంద్రారెడ్డి, కెవిపి రామచంద్రరావులకు చెందిన ఫాంహౌస్‌లను కూల్చేయవద్దా అని నిలదీశారు. ‘ఒకే రాష్ట్రం – ఒకే కార్డు’ పేరిట పైలట్ ప్రాజెక్టు సికింద్రాబాద్‌లో గురువారం జరిగిన కుటుంబ డిజిటల్ కార్డుల కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. దీనికి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, గ్రేటర్ హైదరాబాద్ నగర జిహెచ్‌ఎంసి మేయర్ విజయలక్ష్మి, జిహెచ్‌ఎంసి కమిషనర్ ఆమ్రపాలి కాట, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి హాజరయ్యారు. బలిసినోళ్ల డ్రైనేజీ మొత్తం ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్‌లలో కలుస్తోందని, ఆ నీటిని ఇప్పుడు హైదరాబాద్ నగర ప్రజలు తాగాలా? అని ప్రశ్నించారు. వారి ఫామ్ హౌస్‌లను కూల్చుతామనే పేదలను అడ్డుపెట్టుకొని ధర్నాలు చేస్తున్నారని ఆరోపించారు. మూసీని అడ్డం పెట్టుకొని ఎంతకాలం బతుకుతారు, మీ భరతం పట్టడం ఖాయమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించారు. కూల్చివేతలపై వెనక్కి తగ్గబోమని, ఇలాగే కొనసాగిస్తామని సిఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అధికారం కోల్పోయాక బిఆర్‌ఎస్ నేతలు విచక్షణ లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. తాము అధికారంలోకి వచ్చిన 90 రోజుల్లోనే 30 వేలమందికి ఉద్యోగాలు ఇచ్చామని, డిసెంబర్‌లోపు మరో 30 వేలమందికి ఇస్తామన్నారు. హైదరాబాద్‌లోని ట్రాఫిక్, వరద సమస్యను పరిష్కరించేందుకు తాము చర్యలు చేపడుతుంటే బావ, బావమరిది తమపై బురదజల్లుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కిరాయి మనుషులతో వారు చేసే హడావుడిని ప్రజలు గమనిస్తున్నారన్నారు. పదేళ్లు బిఆర్‌ఎస్ నేతలు దోచుకున్న సొమ్ము వాళ్ల పార్టీ ఖాతాలో రూ.1500 కోట్లు మూలుగుతున్నాయని విమర్శించారు. అందులోంచి రూ.500 కోట్లు మూసీ ప్రాంత పేదలకు పంచి పెట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బిఆర్‌ఎస్‌ను డిమాండ్ చేశారు. అధికారంలోకి రాకముందు చెప్పులు కూడా లేని వారికి, ఇప్పుడు వారి పార్టీ ఖాతాలోకి మాత్రం రూ.1,500 కోట్లు వచ్చాయని విమర్శించారు. ఈటల రాజేందర్ ఎంపిగా గెలిచావు కదా, మేం మూసీ అభివృద్ధి చేసుకోవద్దా?, ప్రధాని నరేంద్ర మోదీ సబర్మతిని శుభ్రం చేసుకోవచ్ఛా అని ప్రశ్నించారు. చిన్న పాటి వర్షంతో మునిగిపోతున్న నగరాన్ని సంరక్షించేందుకు నడుం బిగించామన్నారు. మూసీ మురికి, దోమలతో అక్కడి ప్రజలు జీవచ్ఛవంలా ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడి ఎంపి ఈటల రాజేందర్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దగ్గర నుంచి ఏం తీసుకువస్తారో చెప్పాలని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు. కెటిఆర్, హరీశ్ రావులు మాట్లాడిన జిరాక్స్ కాపీ తీసుకుని ఈటల మాట్లాడుతున్నారని విమర్శించారు. పార్టీ మారినా ఈటలకు పాత వాసనలు పోలేదని విమర్శించారు. మూసీ పరివాహక ప్రాంతాల పేదలకు ఇళ్లు తీసుకురావడానికి మోదీ దగ్గరకు వెళ్దాం రండి, నాకు రావడానికి ఎలాంటి భేషజాలు లేవు, బిఆర్‌ఎస్, బిజెపి నాయకులు రావాలన్నారు. నగరంలో చెరువులు, ఆక్రమణల లెక్క తీద్దాం రండి, వందలాది గొలుసుకట్టు చెరువులు ఆక్రమణకు గురయ్యాయని అన్నారు. దీంతో వరదలు వచ్చి లక్షలాది కుటుంబాలు ఆగమవుతున్నాయన్నారు.
మూసీపై అఖిలపక్ష సమావేశానికి సిద్ధం..
బిజెపి, బిఆర్‌ఎస్ నేతలకు సూచనలు చేస్తున్నామని, తాగునీరు అందించే చెరువుల్లో ఫాంహౌస్‌లు కటుకున్నారన్నారు. కెటిఆర్, హరీశ్ రావు సెక్రటేరియట్‌కు రావాలన్నారు. మూసీపై అఖిలపక్ష సమావేశానికి సిద్ధమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఈ ప్రభుత్వం పేదల కన్నీళ్లు చూడదలచుకోలేదని సిఎం రేవంత్ స్పష్టం చేశారు. మూసీ నిర్వాసితులకు ఎలా ఆదుకోవాలో సూచనలు ఇవ్వాలని కోరారు. హైదరాబాద్ నగరంలో చెరువులు, నాలాలు అక్రమణలు ఎవరు నిర్మించారో తేల్చుకుందామన్నారు. అఖిలపక్షం సమావేశం ఏర్పాటు చేస్తామని, ప్రత్యామ్నాయం ఏం చేయాలో చెప్పాలన్నారు. ప్రభుత్వం వినడానికి సిద్ధంగా ఉందని అన్నారు. ఈటల రాజేందర్ మీ నేతృత్వంలోనే నిధుల కోసం మోదీ వద్దకు వెళ్దామన్నారు. కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ కూడా రావాలన్నారు. కేంద్రం నుంచి రూ.25 వేల కోట్లు ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు.
హైడ్రాపై అసెంబ్లీలో ఎందుకు చర్చించలేదు..
హైడ్రాపై అసెంబ్లీలో చర్చించామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఆనాడు హైడ్రాపై సూచనలు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. మూసీ పరీవాహక ప్రాంత పేదలకు 15 వేల ఇళ్ల కేటాయింపునకు ఆదేశాలు ఇచ్చామన్నారు. మూసీ మురుగులో బతుకుతున్న పేదలకు ఇళ్లు, రూ.25 వేలు ఇచ్చి వారి ఆత్మగౌరవాన్ని పెంచుతున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. జవహర్ నగర్‌లో 1000 ఎకరాలు ఉంది, రండి పేదలకు పంచి ఇందిరమ్మ ఇళ్లు కట్టిద్దామన్నారు. డబుల్‌బెడ్‌రూమ్ ఇళ్ల కంటే ప్రత్యామ్నాయం ఏముందని ప్రశ్నించారు. కెటిఆర్, హరీశ్ రావు, సబిత కుమారుల ఫామ్‌హౌస్‌లు కూల్చాలా? వద్దా? చెప్పండని ప్రశ్నించారు. ఫామ్‌హౌస్‌లు కూల్చుతారనే పేదలను అడ్డుపెట్టుకుని ధర్నాలు, దీక్షలు చేస్తున్నారని మండిపడ్డారు. నల్లచెరువులో, మూసీనది ఒడ్డున ప్లాట్లు చేసి అమ్మింది బిఆర్‌ఎస్ పార్టీ నాయకులు కాదా అని ప్రశ్నించారు. 20 ఏళ్లు ప్రజల్లో తిరిగినవాన్ని తనకు పేద ప్రజల కష్టాలు తెలియదా? మూసీని అడ్డు పెట్టుకుని ఎంతకాలం తప్పించుకుంటారని ప్రశ్నించారు. బిఆర్‌ఎస్ నేతల ఫాంహౌస్‌లను కాపాడుకోవడానికే పేదల ముసుగు అడ్డం పెట్టుకుంటున్నారని ఆరోపించారు. మూసీని అడ్డం పెట్టుకుని ఎంతకాలం బతుకుతారన్నారు. హైదరాబాద్‌లో మీ భరతం పడతామని సిఎం రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో హెచ్చరించారు.
మూసీతో మింగుతున్న నల్లగొండ ప్రజలు..
మూసీతో నల్లగొండ ప్రజలు విషాన్ని మింగుతున్నారని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు. కెసిఆర్ ప్రభుత్వం పదేళ్లలో చేసింది తప్పులు, అప్పులే, వీటితో తెలంగాణ నిండా మునిగిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఆ తప్పులు, అప్పులను సరిదిద్దుతూ ముందుకు వెళ్తున్నామని అన్నారు. పదేళ్లు అధికారంలో ఉన్నవారు కంటోన్మెంట్ సమస్యలను ఎందుకు పరిష్కరించలేదని ప్రశ్నించారు. తాము అధికారంలోకి వచ్చాక కేంద్రానికి భూ బదలాయింపు ద్వారా కంటోన్మెంట్ ప్రజలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. కల్వకుంట్ల కుటుంబం అధికారంతో పాటు విచక్షణ కొల్పోయిందని ఎద్దేవా చేశారు. పదేళ్లు నిరుద్యోగుల ఉసురు పోసుకున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు.