HomeNewsBreaking Newsశిథిలావస్థకు వసతి గృహం

శిథిలావస్థకు వసతి గృహం

నిర్మల్‌ జిల్లా దిలావర్‌పూర్‌లో వర్షానికి స్విమ్మింగ్‌ఫూల్‌ను తలపిస్తున్న హాస్టల్‌
ప్రజాపక్షం/నిర్మల్‌
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విద్యా వ్యవస్థ సమూలంగా మార్పు చేస్తామని చెప్పిన నాయకులు.. అససలు పట్టించుకోవడమే మానేశారు. ‘మన ఊరు మనబడి’ కార్యక్రమం ద్వారా పాఠశాలలను అభివృద్ది చేస్తామని చెప్పిన ప్రభుత్వం విద్యావ్యవస్థను సమూలంగా నాశనం చేస్తోంది. బంగారు తెలంగాణలో విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉంటుందని, ఆశల పల్లకిలో ఉన్న ప్రజలకు అత్యాశే మిగిలింది. నిర్మల్‌ జిల్లా దిలావర్‌పూర్‌ మండల కేంద్రంలోని వెనుకబడిన తరగతుల వసతి గృహం శిథిలావస్థలో ఉంది. ఎప్పుడు కూలిపోతుందో.. ఎప్పుడు పైకప్పు ఊడిపడి తలలు పగులుతాయో అన్న భయంతో విద్యార్థులు కాలం వెళ్లదీస్తున్నారు. జిల్లా కేంద్రానికి కూసపెట్టు దూరంలో హాస్టళ్లు ఉన్నా జిల్లా అధికారులు ఇప్పటి వరకు పరిశీలించకపోవడం గమనార్హం. గత మూడు రోజులుగా కుస్తున్న వర్షాల కారణంగా విద్యార్థులకు ఎప్పుడు ఏమి జరుగుతుందోనని కాలం వెళ్లదీస్తున్నారు. హాస్టలో మండల కేంద్రం నుంచే కాకుండా జిల్లాలోని వివిధ మండలాలకు చెందిన 42 మంది విద్యార్థులు వసతి గృహంలో ఉంటూ విద్యను అభ్యసిస్తున్నారు. వసతి గృహంలో మొత్తం ఏడు గదులు ఉండగా అందులో కనీసం మౌలిక సౌకర్యాలు కూడా లేవు. వర్షం పడ్డప్పుడు తేమతో హాస్టల్‌లో భవన గోడలన్నింటికి కరెంట్‌ షాక్‌ వస్తోందని విద్యార్థులు భయంతో వణికిపోతునాన్రు. విద్యుత్‌ ప్రమాదం సంభవించే అవకాశం కూడా ఉందని తమ బాధను చెప్పుకొచ్చారు.
స్విమ్మింగ్‌ ఫూల్‌ తలపిస్తున్న హాస్టల్‌….
శనివారం కురిసిన భారీ వర్షానికి వసతి గృహం ముందు ప్రాంతం మొత్తం కూడా స్విమ్మింగ్‌ ఫూల్‌ను తలపిస్తుంది. వర్షానికి నీరు ఎక్కడికి వెళ్లకపోవడంతో లోతట్టు ప్రాంతంగా నీటితో నిండిపోయింది. నీటిని బకెట్లతో బయటకు తోస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. దీనిపైగ ఆరా తీయగా డ్రైనేజీ సమస్య ఇబ్బందిగా ఉందని, వర్షం, మురికి నీరు ఎక్కడికి వెళ్లకపోవడంతో కంపు భరించలేకపోతున్నామని, అప్పుడప్పుడు విషసర్పాలు కూడా వస్తున్నాయని తెలిపారు.
అందుబాటులో లేని వార్డెన్‌…
విద్యా సంవత్సరం ప్రారంభమైనప్పటి నుండి హాస్టల్‌ వార్డెన్‌ అప్పుడప్పుడు చుట్టపుచూపుగా వస్తున్నాడని, సమస్యలను చెప్పినప్పటికీ పట్టించుకోవడం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 42 మంది విద్యార్థులు ఉన్నప్పటికి చాలీ చాలని దుప్పట్లు, బెడ్లు లేవని వర్షం పడ్డప్పుడు చలివేయడంతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నామని విద్యార్థులు తమ గోడును మా ప్రతినిధితో వెళ్లబుచ్చుకున్నారు. ఇకనైనా అధికారులు, నాయకులు స్పందించి వసతి గృహాన్ని బాగుచేయించాలని, తమ సమస్యలను తీర్చాలని విద్యార్థులు కోరుతున్నారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments