పని దినాలు కాదు.. పని గంటలు ముఖ్యం : ప్రభుత్వం
20 రోజులు నిర్వహించాలి : విపక్షం
ఈ సారి ఆదివారం కూడా సమావేశం
ప్రజాపక్షం/హైదరాబాద్
శాసనసభ వానాకాల సమావేశాలను మూడు రోజుల పాటు నిర్వహించాలని శాసనసభ నిర్వహణ సలహా కమిటీ (బిఎసి) నిర్ణయించింది. అసెంబ్లీ తొలిరోజు వాయిదా పడిన అనంతరం సమావేశాల నిర్వహణపై స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన ఆయన ఛాంబర్‌లో శుక్రవారం బిఏసి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సమావేశాల నిర్వహణతోపాటు పలు అంశాలపై చర్చించారు. సమావేశంలో డిప్యూటీ స్పీకర్ టి.పద్మారావు, ప్రభుత్వం తరఫున మంత్రులు హరీశ్ రావు, ప్రశాంత్ రెడ్డి, కాంగ్రెస్ శాసనసభా పక్ష నాయకులు మల్లు భట్టి విక్రమార్క, ఎంఐఎం తరఫున అక్బరుద్దీన్ ఒవైసీ పాల్గొన్నారు. కాగా మూడు రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం వైపు నుండి ప్రతిపాదించినట్లు సమాచారం. ఈ సందర్భంగా 20 రోజులు సమావేశాలు నిర్వహించాలని కాంగ్రెస్ పక్షం డిమాండ్ చేసింది. అందుకు ప్రభుత్వం అంగీకరించలేదు. అయితే పని దినాలు కాదు, పని గంటలను చూడాలని మంత్రి హరీశ్ రావు అన్నట్లు తెలిసింది. అవసరమైతే పొడిగించుకుందామని చెప్పినట్లు సమాచారం. అయితే మూడు రోజులు మాత్రమే నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. శుక్రవారం భారీ వర్షాలు, వరదలు, ప్రభుత్వ చర్యలపై చర్చించనున్నారు. శనివారం బిల్లులపై, ఆదివారం సమావేశాలు
ముగించనున్నారు. మొత్తం పది బిల్లులను ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు తెలిసింది. శాసనమండలి సైతం మూడు రోజుల పాటే నిర్వహించే అవకాశం ఉన్నది. కాగా, శాసనమండలిలో ప్రభుత్వ, జెడ్‌పి, మండల పరిషత్, గిరిజన సంక్షేమ పాఠశాల మనుగడ , కస్తూర్భా గాంధీ బాలికా విద్యాలయాలు, ఇతర వద్యా సంస్థలు, వివిధ శాఖలలో పని చేస్తున్న కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ఉపాధ్యాయులు తదితరులకు కనీస వేతనాల చెల్లింపుపై చర్చించాలని కోరుతూ మండలి చైర్మన్‌కు ఉపాధ్యాయ ఎంఎల్‌సి అలుగుబెల్లి నర్సింహారెడ్డి లేఖ సమర్పించారు. పని దినాలు కాదు.. పని గంటలు పెంచాలిః భట్టిశాసనసభ సమావేశాల్లో నిర్వహణ పని గంటలు పెంచడం కాదని, పని దినాలు పెంచాలని సిఎల్‌పి నేత మల్లు భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. బిఆర్‌ఎస్ ప్రభుత్వానికి ధైర్యం ఉంటే శాసనసభ సమావేశాలు 20 రోజుల పాటు నిర్వహించాలని అన్నారు. బిఎసి అనంతరం ఆయన సిఎల్‌పి కార్యాలయంలో జర్నలిస్టులతో చిట్ చాట్ చేశారు. దేశంలో అతి తక్కువగా శాసనసభ సమావేశాల పని దినాలు జరిగేది తెలంగాణ లోనే అని అన్నారు. వరదలు, భూములు, సింగరేణి, ధరణి, ఎస్‌సి, ఎస్‌టి సబ్ ప్లాన్ పై చర్చ చేయాలని బిఎసిలో డిమాండ్ చేసినట్లు తెలిపారు. రాజ్యాంగం లో ఆరు నెలలకు సభ పెట్టాలనే నిబంధన ఉన్నందునే సభ పెట్టారని, లేదంటే సభ పెట్టే వారే కాదని ఆరోపించారు. సిఎం తో మాట్లాడి పని దినాలు 20 రోజులకు పెంచాలని స్పీకర్ ని కోరామన్నారు.
శాసనసభ సమావేశాలు3 రోజులే!
RELATED ARTICLES