ముంపు ప్రభావిత ప్రాంతాల్లో చేపట్టాల్సిన కార్యక్రమాలను ప్రభుత్వానికి సూచిస్తా
వరంగల్ హనుమకొండలో లోతట్టు ప్రాంతాల్లో పర్యటించిన గవర్నర్ తమిళిసై
రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థను వెంటనే పునరుద్ధరించాలని అధికారులకు ఆదేశం
ప్రజాపక్షం/వరంగల్ ప్రతినిధి హనుమకొండ, వరంగల్ జిల్లా లో కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న ప్రాంతాలలో తెలంగాణ రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందర రాజన్ బుధవారం ముంపు ప్రాంతాలను పర్యటించి పరిశీలించారు. జవహర్ నగర్, నయీమ్ నగర్, భద్రకాళి బండ్ ఎన్టీఆర్ నగర్, ఎన్ ఎన్ నగర్ ప్రాంతాలను పర్యటించి నష్టం వివరాలను అధికారులను గవర్నర్ అడిగి
తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జవహర్ నగర్ లో రె్‌డ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో గవర్నర్ డాక్టర్ తమిళ సౌందర్య రాజన్ మాట్లాడుతూ రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలకు వరంగల్ హనుమకొండ ప్రాంతాలలో అనేక లోతట్టు ప్రాంతాలు ముంపుకు గురయ్యాయని ఈ ప్రాంతంలోని ప్రజలను ఆదుకునేందుకు వెంటనే చర్యలు చేపట్టాలని స్థానిక రె్‌డ క్రాస్ సొసైటీ అధికారులకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తెలియజేశానని ఆమె అన్నారు. ఇది చాలా దురదృష్టకరం అనేక ముంపు ప్రాంతాలలో దెబ్బతిన్న రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ వెంటనే పునరుద్ధరించుటకు తగిన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ ప్రాంతంలోని ప్రజలకు రె్‌డ క్రాస్ సొసైటీ ద్వారా సహాయ సహకారాలు అందిస్తామని ఆమె అన్నారు. అయితే భారీ వర్షాలకు ముంపుకు గురికాకుండా ఈ ప్రాంతాలలో శాశ్వత ప్రాతిపదికన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడానికి తగిన చర్యలు తీసుకునే విధంగా ప్రభుత్వానికి సూచించనున్నట్లు ఆమె అన్నారు. వరదలు వచ్చినప్పుడు లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేసే విధంగా, వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించుటకు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని ఆమె కోరారు. ప్రజలకు నిత్యవసర సరుకులు ఆహారం అందించడానికి రె్‌డ క్రాస్ సొసైటీ స్థానిక అధికారులు తగిన చర్యలు చేపట్టనున్నట్లు గవర్నర్ తెలిపారు. ముంపు ప్రాంతాలలో ప్రజలతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ముంపు ప్రాంతాలలో ఇప్పటికే కేంద్ర బృందం పరిశీలించినట్టు ఆమె తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో కమిషనర్ రిజ్వాన్ బాషా,వరంగల్ రె్‌డ క్రాస్ సొసైటీ అధ్యక్షుడు డాక్టర్ పెసరు విజయ్ చందర్ రెడ్డి,ev శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
గవర్నర్ కు ఘన స్వాగతం: తెలంగాణ రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళ సౌందర్య రాజన్ బుధవారం వరంగల్ పర్యటన సందర్భంగా ఉదయం 8:30 గంటలకు స్థానిక నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ( ఎన్‌ఐటి)కి చేరుకున్నారు, ఈ సందర్భంగా గవర్నర్ కు హనుమకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, వరంగల్ జిల్లా కలెక్టర్ ప్రవీణ్య, కమిషనర్ షేక్ రిజ్వాన్ బాషా, ఆర్డీఓలు రమేష్ కుమార్, వాసు చంద్ర గవర్నర్ కు ఘనంగా స్వాగతం పలికారు.