ఎక్సైజ్, పౌర సరఫరాలపై తీవ్ర ఆరోపణలు
ఏమి జరిగినా మా పని మాదేనంటున్న అధికారుల తీరు
ప్రజాపక్షం/ ఖమ్మం ప్రజల నుంచి ఆరోపణలు వచ్చినప్పుడు ఆ ఆరోపణలపై క్షేత్రస్థాయిలో విచారణ జరపడం ప్రతి శాఖలోనూ జరుగుతుంది. ఈ ఆరోపణలకు సం బంధించి వాస్తవాలను గుర్తించి తగు చర్యలు తీసుకోవడం సహజమే. కానీ రెండు ప్రధానశాఖలకు సంబంధించి అధికారుల తీరు మరక మంచిదే అన్నట్టుంది. ఖమ్మంజిల్లా నుంచి కోట్లాది రూపాయల విలువైన రేషన్ బియ్యం రాష్ట్ర సరిహద్దులు దాటి తరలిపోవడమే కాకుండా రైసు మిల్లుల ద్వారా రీసైక్లింగ్ జరుగుతుంది. కోట్ల రూపాయల విలువైన బియ్యం పట్టుబడుతున్నాయి. ఆ శాఖాధికారులు ఇందుకు సంబంధించి నోరు మెదపరు. ఇదే పద్ధతిని ఎక్సైజ్ శాఖ అనుసరిస్తున్నది. మద్యం షాపుల నిర్వహణ, అధిక ధరలు, ఆంధ్రా కు తరలింపు తదితర విషయాలపై ఏనాడూ దృష్టి సారించరు. మరక మంచిదే అన్నట్లు ఏ ప్రాంతం నుంచి విమర్శ వస్తే లేదా ఆరోపణలు వస్తే ఆ ప్రాంతానికి వెళ్లి సొమ్ము చేసుకోవడం అలవాటుగా మారిందన్న ఆరోపణలు వినవస్తున్నాయి. వివరాల్లోకి వెళితే.. ఖమ్మంజిల్లా నుంచి ప్రతి ఏడాది కోట్లాది రూపాయల విలువైన రేషన్ బియ్యం తరలిపోతున్నాయి. ఇందు కోసం ఒక పెద్ద నెట్‌వర్క్ నడుస్తుంది. రేషన్ డీలర్లు రేషన్ కార్డులు ఉన్న వారి వద్ద నుంచి బియ్యం సేకరణ క్షేత్రస్థాయిలో ప్రారంభమవుతుంది. కిలో ఏడు రూపాయల నుంచి తొమ్మిది రూపాయల వరకు కొనుగోలు చేసి వాటిని మండల కేంద్రంలో ఉన్న రహస్య అడ్డాకు తరలిస్తారు. అలా మండలాల నుంచి సేకరించిన బియ్యాన్ని అవలీలగా రాష్ట్ర సరిహద్దులు దాటించి తదనంతరం దేశ సరిహద్దు లు దాటిస్తూ ఆఫ్రికా ఖండాలకు ఎగుమతి చేస్తున్నారు. గ్రామస్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయి వ్యాపారం వరకు అనేక మంది ప్రమేయం ఉం టుంది. ఈ నెట్‌వర్క్ విషయం మొత్తం పౌర సరఫరాల శాఖాధికారులకు తెలిసినా ఎక్కడా రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకోవడం కానీ, ఎప్పుడన్న ఎవరైనా సమాచారం ఇస్తే పట్టుబడిన బియ్యానికి సంబంధించి విచారణ జరపడం, సంబంధిత డీలర్లు ఇతరులపై చర్యలు తీసుకున్న సందర్భం లేదు. ఆ బియ్యాన్ని రైసుమిల్లులో మర ఆడించి కొంత మంది మిల్లర్లు సన్న బియ్యంగా విక్రయిస్తూ ప్రజలను మోసం చేస్తుండగా మరికొందరు ప్రభుత్వానికి తిరిగి సరఫరా చేస్తున్నారు. ఇంత వరకు జిల్లాలో ఏ రైసుమిల్లులపైన జిల్లాలోని సివిల్ సప్లయ్ అధికారులు దాడులు చేసిన ఘటనలు లేవు. చేష్టలూడిగి వ్యవహరిస్తున్న ఈ శాఖ పరిస్థితి ఇలా ఉంటే…. ఇక ఎక్సైజ్ శాఖది మరి ఘోరం. నిబంధనలకు తూట్లు పొడుస్తూ ఇష్టానుసారంగా మద్యం వ్యాపారం నిర్వహిస్తున్న ఆ శాఖ స్పందించదు. అసలు కంటే కొసరెక్కువ అన్నట్లు మద్యం దుకాణాల్లో కంటే అధిక ధరలకు బెల్ట్ షాపుల ద్వారా మద్యాన్ని ఎక్కువగా విక్రయిస్తున్నారు. ఎంఆర్‌పి కంటే రూ. 20 నుంచి రూ. 30 అదనంగా వసూలు చేస్తున్నారు. మద్యం దుకాణ యజమానులే గ్రామ గ్రామాన బెల్ట్ షాపులకు సరఫరా చేస్తున్నారు. మద్యం సిండికేట్లు మద్యం ప్రియులను దోచుకుంటున్న ఎక్సైజ్ శాఖాధికారుల్లో కనీస చలనం లేదు. ఇదే సమయంలో మద్యం దుకాణాల నుండి ఆంధ్రాకు మద్యం తరలిపోతున్నా చర్యలు తీసుకోవడం లేదన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. సిండికేట్ల రూపంలో అధికారులపై ఒత్తిడి ఉందని అందుకే అధికార యంత్రాంగం మద్యం వ్యాపారానికి సంబంధించి ఏమి జరుగుతున్నా మౌనమే సమాధానంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినవస్తున్నాయి. మద్యం సిండికేట్‌లో బందీలుగా చిక్కిన అధికార యంత్రాంగంపై ఉన్నతాధికారులు తగు చర్యలు తీసకోకపోతే ఒక పక్క ప్రభుత్వ ఆదాయానికి గండి, మరో పక్క మద్యం ప్రియుల దోపిడీ ఆగదన్న భావన వ్యక్తమవుతుంది. ఇప్పటికైనా జిల్లా అధికారులు ఆ దిశగా ఆలోచన చేయాలని ప్రజలు కోరుతున్నారు.
మరక మంచిదే :
ఎక్సైజ్, పౌర సరఫరాల శాఖపై ఆరోపణలను ఆశాఖలో పనిచేస్తున్న సిబ్బంది స్వాగతిస్తున్నారు. సహజంగా శాఖపై విమర్శలు వచ్చినప్పుడు ఆ శాఖాధికారులు, సిబ్బందిలో కొంత ఆందోళన వ్యక్తమవుతుంది. కానీ ఈ శాఖల్లో ఒక ఆరోపణ రాగానే ఆ ఆరోపణకు కారకులైన వ్యక్తులను శోదించి సొమ్ము చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు. ఈ రెండు శాఖలపైన ఇవే ఆరోపణలు రావడం గమనార్హం. అందుకే ఆరోపణలు వస్తే బాగుండు సొమ్ము అవుతుందన్న ఆలోచన వీరిలో నెలకొంది. అందుకే అంటారేమో మరక మంచిదని. ప్రజలు , ప్రభుత్వ ఆదాయం ఏమైనా ఆరోపణలు, చట్ట వ్యతిరేక పనులు మాత్రం వీరికి సొమ్ము చేసి పెడుతున్నాయి.
శాఖల్లో చలనమేదీ?
RELATED ARTICLES