సుహృద్భావ వాతావరణంలో భారత్-చైనా పదో విడత చర్చలు
న్యూఢిల్లీ : తూర్పు లఢఖ్‌లో తీసుకోవాల్సిన తదుపరి చర్యలపై భారత్ శనివారం నాడు పదోవిడత సైనికస్థాయి చర్చలు జరిపాయి. ప్రధానంగా తూర్పు లఢఖ్‌లోని గోగ్రా, దెప్సాంగ్ వంటి ఎక్కువ కేంద్రీకరణ ఉండే ప్రాంతాల్లో సైన్యం ఉపసంహరణ ప్రక్రియను మరింత ముందుకు తీసుకువెళ్ళేందుకే ఈ సైనికస్థాయి చర్చలు జరిపినట్లు అధికారవర్గాలు తెలియజేశాయి. ఇరుదేశాల మధ్య ఒప్పందంలో భాగంగా, పాంగాంగ్ సరస్సు ప్రాంతంలోని ఉత్తర దక్షిణ తీరాల నుండి భారత్-చైనా సైన్యాలు సేనలను, ఆయుధాలను, ఆయుధ సామాగ్రిని ఉపసంహరించే కార్యక్రమా న్ని పూర్తి చేసిన రెండు రోజుల తర్వాత ఈ చర్చ లు జరిగాయి. వాస్తవాధీనరేఖ వద్ద చైనా సరిహద్దులవైపు మోల్డో వద్ద శనివారం ఉదయం పది గంటలకు ఈ చర్చలు ప్రారంభమయ్యాయి. ఈ చర్చలు ఇంకా కొనసాగుతున్నాయని వర్గాలు తెలియజేశాయి. ఇరు దేశాల సైన్యాలు ఎక్కువగా దృష్టి కేంద్రీకరించిన మిగిలిన గోగ్రా, దెప్సాంగ్ ప్రాంతాల్లో మిగిలిన చోట్ల నుండి కూడా సైన్యాల ను ఖాళీ చేసే ప్రక్రియను శరవేగంగా పూర్తి చే యాలని భారత్ పట్టుబడుతుందని అధికార వర్గా లు తెలిపాయి. గడచిన తొమ్మిది నెలలుగా వాస్తవాధీన రేఖ వెంబడిన ఉద్రిక్తతలవల్ల అగ్రశ్రేణి సైనిక బలగాలు రంగంలోకి దిగి సరిహద్దుల్లో మకాం వేశాయి. పాంగాంగ్ సరస్సు ఉత్తర – దక్షిణ తీరాల నుండి భారత్-చైనా రెండు దేశాలూ సైన్యాలను వెనక్కి మళ్లించాలనే ఒప్పందానికి వచ్చినట్లు ఫిబ్రవరి 11వ తేదీన రక్షణశాఖామంత్రి రాజ్‌నాథ్‌సింగ్ పార్లమెంటులో ప్రకటించారు. దశలవారీగా, శాంతిని ముందుకు తీసుకువెళ్ళేందుకు దళాలను వెనక్కు మళ్ళిస్తాయని ఆయన పేర్కొన్నారు. ఈ ఒప్పందం ప్రకారం, పాంగాంగ్ సరస్సు ఉత్తరతీరంలోని ఫింగర్ -8 తూర్పు ప్రాంతం నుండి చైనా తన సేనలను వెనక్కి మళ్లించాలి. అదేసమయంలో భారత్ బలగాలు సరసు దక్షిణ తీరంలోని ఫింగర్ -3 స్థావరం సమీపంలో ఉన్న ధన్ సింగ్ థాపా పోస్ట్ లో ఉన్న శాశ్వత కేంద్రానికి చేరుకోవాలి. ఈ అం గీకారం ప్రకారం, ఇరు దేశాల బలగాలు తమ తమ స్థావరాలవైపు వెనక్కి మళ్ళాయని వర్గాలు తెలియజేశాయి. ఫ్రిబవరి 10వ తేదీన ఇరు దేశాల సైన్యాల ఉపసంహరణ కార్యక్రమం ప్రారంభమైంది. కాగా శనివారంనాడు ప్రారంభమైన పదో విడత సైనిక చర్చలకు భారత్ తరపున లెఫ్టినెంట్ జనరల్ పిజికె.మీనన్ సారథ్యం వహిస్తున్నారు. లేహ్ స్థావరంలోని 14వ దళానికి ఆయన కమాండర్‌గా వ్యవహరిస్తున్నారు. చైనా తరపున మేజర్ జనరల్ లియు లిన్ చర్చలకు సారథ్యం వహిస్తున్నారు. ఈయన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ దక్షిణ గ్జిన్ జియాంగ్ సైనికజిల్లా కమాండర్‌గా పనిచేస్తున్నారు.