ఉక్రెన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో ప్రధాని మోదీ
కీవ్ : ఉక్రెన్, రష్యాల మధ్య జరుగుతున్న సంఘర్షణకు పరిష్కారం వెదికేందుకు ఇరు దేశాలు చర్చలు జరపాలని భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సూచించారు. భాగస్వాములందరి మధ్య వాస్తవిక ధోరణితో చర్చలు జరపడం ద్వారా వినూత్న పరిష్కారాన్ని రూపొందించడం తక్షణ అవసరమని ఆయన పేర్కొన్నారు. అది విస్తృత ఆమోదయోగ్యత లభించేందుకు , ఈ ప్రాంతంలో శాంతి, స్థిరత్వం సాధించేందుకు వీలుగా ఉండాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు. ఉక్రెన్ పర్యటనలో భాగంగా ఆ దేశ అధ్యక్షులు వ్లదిమర్ జెలెన్స్కీతో శుక్రవారం నాడు ప్రధాని మోదీ విస్తృత స్థాయిలో చర్చలు జరిపారు. భారత విదేశాంగ మంత్రి ఎస్.జై శంకర్ చర్చల సారాంశాన్ని వెల్లడిస్తూ ఉక్రెన్లో త్వరితగతిన తిరిగి శాంతి స్థాపన జరిగేందుకు భారతదేశం అన్ని రకాలుగా సహకరించేందుకు సుముఖతను వ్యక్తం చేసినట్లు తెలిపారు. చర్చలు చాలా విపులంగా, విస్తృతంగా అన్ని రకాలుగా నిర్మాణాత్మకంగా జరిగినట్లు తెలిపారు. సైనిక పరిస్థితి, ఆహారం, ఇందన భద్రత తదితర అంశాలపై కొంత వరకు చర్చ జరిగిందని, శాంతికి అవసరమైన మార్గాలపై కూడా చర్చ జరిగిందన్నారు. భౌగోళిక శాంతి కూటమిలో భారతదేశం నిరంతరం భాగస్వామ్యం కావాలని ఉక్రెయిన్ కోరినట్లు చెప్పారు. చర్చలను ముందుకు తీసుకెళ్ళేందుకు ప్రభావవంతమైన మార్గాలపై కూడా చర్చ జరిగినట్లు చెప్పారు. సరిహద్దు సమగ్రత, దేశాల సార్వభౌమత్వ పరిరక్షణకు సంబంధించి అంతర్జాతీయ న్యాయ సూత్రాలను గౌరవించాలని ఇరు దేశాలు పునరుద్ఘాటించినట్లు వెల్లడించారు. ఇటీవల మాస్కో పర్యటనలో రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో చర్చల గురించి కూడా జెలెన్స్కీతో భేటీ సందర్భంగా వివరించినట్లు జైశంకర్ తెలిపారు. క్షేత్రస్థాయి, దౌత్య స్థాయిలో పరిస్థితుల గురించి మోదీ ఆరా తీయగా, ఆ రెండింటి గురించి జెలెన్స్కీ విడమరిచి చెప్పినట్లు విదేశాంగ మంత్రి వెల్లడించారు. మోదీ కీవ్ పర్యటన చారిత్రత్మకమైనదని జైశంకర్ అన్నారు. ఉభయ దేశ నేతల మధ్య చర్చలో అధిక భాగం ద్వైపాక్షిక సంబంధాలకు కేటాయించినట్లు జైశంకర్ తెలిపారు. వాణిజ్యం, ఆర్థిక అంశాలు, రక్షణ, ఔషధ, వ్యవసాయ, విద్యా రంగాలపై కూడా చర్చించినట్లు తెలిపారు. ఇరు దేశాల మధ్య వాణిజ్యం,ఆర్థిక సంబంధాలను పునర్నించే బాధ్యతలను మోదీ, జెలెన్స్కీలు ఇండియా ఇంటర్ గవర్నమెంటల్ కమిషన్‌కు అప్పగించారు.
నాలుగు ఒప్పందాలపై సంతకం భారత్, ఉక్రెయిన్ల మధ్య నాలుగు ఒప్పందాలు జరిగాయి. వ్యవసాయం, ఆహార పరిశ్రమ, వైద్యం, సాంస్కృతిక, మానవతా సహాయం వంటి అంశాలలో ఈ ఒప్పందాల ద్వారా సహాకరం లభించనుంది.
ఏడు గంటల పర్యటన అంతకుముందు శుక్రవారం ఉదయం కీవ్‌కు ప్రత్యేక రైలులో ప్రధాని మోదీ చేరుకోగా, ఆయనకు ఉక్రెయిన్ ఫస్ట్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ స్వాగతం పలికారు. పోలాండ్ నుంచి పది గంటల రైలు ప్రయాణం చేసి ఆయన కీవ్‌కు చేరుకున్నా రు. హయాత్ హోటల్ వద్ద మోదీకి భారతీయులు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి కీవ్ జాతీ య మ్యూజియంలో ఘర్షణల్లో మరణించిన పిల్ల ల స్మృత్యర్థం ఏర్పాటు చేసిన మల్టీ మీడియా చిత్ర ప్రదర్శనను ఆయన చూసినట్లు విదేశాంగ మం త్రిత్వ శాఖ వెల్లడించింది. ఇరుదేశాల ఘర్షణలో విషాధ మరణం పొందిన పిల్లల పట్ల ఆవేదన వ్యక్తం చేస్తూ మోదీ వారి సృత్యర్థం ఆట బొమ్మను అక్కడ ఉంచినట్లు తెలియజేసింది. ఇక్కడే మోదీకి ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లదిమర్ జెలెన్స్కీ చేతులు కలిపి, కౌగిలించుకున్నా. సుమారు ఏడుగంటల పాటు కీవ్‌లో మోడీ పర్యటన సాగింది.
భౌగోళిక సవాళ్ళకు గాంధీ మార్గమే పరిష్కారం
‘ఒయాసిస్ ఆఫ్ పీస్ పార్క్’లో ఉన్న మహాత్మాగాంధీ విగ్రహం వద్ద మోదీ నివాళులర్పించారు. ప్రస్తుత భౌగోళిక సవాళ్ళకు మహాత్మా గాంధీ చూపించిన మార్గం పరిష్కారాలను సూచిస్తుందని, సామరస్యపూర్వక సమాజ నిర్మాణం కోసం శాంతి అవసరమనే ఆయన సందేశం ఎల్లవేళలా ప్రాసంగికత కలిగి ఉంటుందని మోదీ అన్నారు. గురువారం నాడు పోలాండ్ ప్రధాన మంత్రి డొనాల్డ్ టస్క్‌తో చర్చల సందర్భంగా ఉక్రెయిన్ , పశ్చిమ ఆసియాలో ఘర్షణలు తీవ్ర ఆందోళన కలిగించే అంశాలని, చర్చలు, దౌత్య మార్గాల ద్వారానే శాంతిని పునరుద్ధరించగలమని మోదీ అన్నారు. ఏ సమస్య కూడా యుద్ధక్షేత్రంలో పరిష్కారం కాదని భారత్ బలంగా విశ్వసిస్తుందన్నారు. ఏ సంక్షోభంలోనైనా అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోవడం మానవత్వానికి పెను సవాలు అని వ్యాఖ్యానించారు. త్వరితగతిన శాంతి, స్థిరత్వ స్థాపనకు చర్చలు, దౌత్య మార్గాల విధానానికి తాము మద్దతు తెలుపుతామని, ఇందుకు భారత్, ఇతర మిత్రదేశాలు అవసరమైన మద్దతను అందించేందుకు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు.