ప్రజాపక్షం/న్యూఢిల్లీ భారత్, చైనా దేశాల మధ్య ప్రతిష్టంభన కొనసాగడం పట్ల సిపిఐ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ప్రాంతంలో శాంతి నెలకొనడానికి ఇరువర్గాలు తక్షణమే తమ బలగాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసింది. చర్చలే శాంతిమార్గమని సూచించింది. ఈ మేరకు సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా మంగళవారంనాడొక ప్రకటన విడుదల చేశారు. ఇరుదేశాల సరిహద్దుల్లో ఉద్రిక్తత కొనసాగడం, ముగ్గురు జవాన్లు మృతి కారణమయ్యేలా గల్వన్ లోయలో ఘర్షణలు జరగడం ఆందోళనకరమైన విషయమని పేర్కొన్నారు. అమరజవాన్లకు సెల్యూట్ చేశారు. లడఖ్, సిక్కిం ప్రాంతాల్లో వాస్తవాధీనరేఖ (ఎల్‌ఎసి) వెంబడి దశల వారీగా సైన్యాల ఉపసంహరణ, ఉద్రిక్తతల సడలింపుల కోసం సైనిక, దౌత్య స్థాయిలో చర్చలు కొనసాగుతున్న సమయంలో ఈ ఘర్షణలు జరగడం విచారకరమన్నారు. ఇరుదేశాల మధ్య గతంలో కుదిరిన ఒప్పందాలు, చట్రపరిధిలో చర్చలు జరపడం ద్వారానే ప్రస్తుత ప్రతిష్టంభన సమస్యకు పరిష్కారం లభిస్తుందన్నది సిపిఐ అభిప్రాయమని రాజా స్పష్టంచేశారు. సాధ్యమైనంత త్వరగా భారత్, చైనా సరిహద్దు సమస్యకు పరస్పర ఆమోదయోగ్యకరమైన పరిష్కారాన్ని సాధించడమే కీలక ప్రయోజనకరమైన అంశంగా మనసులో పెట్టుకొని ఇరువర్గాలు కృషి చేయాలని కోరారు. ఆసియాలోనే అతిపెద్ద దేశాలైన భారత్, చైనాల మధ్య ఎలాంటి సైనిక ఘర్షణలైనా, అది ఇరుదేశాల పరస్పర సహకారం, స్నేహంపై తీవ్ర ప్రభావం చూపడమే కాకుండా ఆసియా పసిఫిక్ ప్రాంతంలో శాంతి సుస్థిరతలను దెబ్బతీయగలదని అభిప్రాయపడ్డారు. సరిహద్దు వెంబడి శాంతి, భద్రత కల్పించేందుకు, ఉద్రిక్త పరిస్థితులను సడలించేందుకు తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఇరుదేశాల ప్రభుత్వాలకు సిపిఐ విజ్ఞప్తి చేస్తున్నదని రాజా ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
శాంతిమార్గం చర్చలే : సిపిఐ
RELATED ARTICLES