భద్రాచలం వద్ద తగ్గుతున్న నీటి మట్టం
ఊపిరి పీల్చుకున్న ప్రజలు, ప్రభుత్వం
ఇంకా 200 గ్రామాలు జలదిగ్బంధంలోనే
ప్రజాపక్షం/భద్రాచలం ఎట్టకేలకు భద్రాచలం వద్ద గోదావరి తగ్గుముఖం పడుతోంది. ప్రళయ తాండవం చేసిన గోదావరి నది నెమ్మదిగా తగ్గుతుండటంతో అటు ప్రజలతోపాటు ఇటు ప్రభుత్వ యంత్రాంగం ఊపిరి పీల్చుకుంటోంది. ఒకానొకదశలో 75 నుండి 80 అడుగుల వరకు వచ్చే అవకాశం ఉందంటూ వార్తలు గుప్పమనడంతో 1986 నాటి పరిస్థితి కళ్ళు ముందు మెదిలి భయానికి గురయ్యారు. మహారాష్ట్రతో పాటు ఎగువన వర్షాలు లేకపోవడంతో ఆయా ప్రాజెక్టుల్లో వరద పరిస్థితి సాధారణ స్థితికి చేరుకుంటోంది. దీంతో వరద ప్రవాహం నదిలోనికి రాకపోవడం భద్రాచలం శనివారం రాత్రి 66 అడుగుల దిగువకు చేరుకుంది. శనివారం తెల్లవారు జామున 4 గంంటకు 71.30 అడుగుల వరకూ భయానకంగా పెరుగుతూ వచ్చిన గోదావరి ఉదయం 5 గంటలకు 71.20 అడుగులకు తగ్గింది. 7 గంలకు 71 అడుగులు, మధ్యాహ్నం 1 గంటకు 70 అడుగుల దిగువకు చేరింది. సాయంత్రం 4 గంటలకు 69 అడుగులు, 7 గంటలకు 68 అడుగులు, 9 గంటలకు 67 అడుగులు, అర్థరాత్రి 12 గంటలకు 66 అడుగులకు తగ్గింది. ఎగువన ఎలాంటి వరద లేకపోవడంతో క్రమేపి దగ్గనున్నట్లు అధికారులు ప్రకటించారు. అయితే నదీ తీర ప్రాంత గ్రామాల్లో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. వందల గ్రామాల్లో విద్యుత్తు స్తంభాలు దెబ్బతిన్నాయి. దుమ్ముగూడెం, చర్ల మండలాలకు ఈ సమస్య తీవ్రస్థాయిలో తలెత్తడంతో సమాచార వ్యవస్థలన్నీ స్తంభించిపోయాయి. సుమారు 200 గ్రామాలకు మండల కేంద్రాలతో సంబంధాలు తెగిపోయాయి. ప్రజా, రవాణా, సమాచార వ్యవస్థలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. ముంపు ప్రాంతాల్లో పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. కాగా, గోదావరి వరద తగ్గుముఖం పడుతుండటంతో అధికార యంత్రాంగంతో పాటు ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. బుధవారం రాత్రి నుండి పెగుతూ వచ్చిన గోదావరి మూడో ప్రమాధహెచ్చరిక ఆయిన 53 అడుగులను దాటింది. అక్కడి నుండి భారీగా పెరిగింది. దీంతో అప్రమత్తమైన అధికారులు లోతట్టు ప్రాంతాలను ఖాళీ చేయించారు.
గోదారికి ఇది అతిపెద్ద రెండో వరద
1986 సంవత్సరం తర్వాత అంతటి భయానక వాతావరణాన్ని 2020 జులై 16 నాటి వరదలు సృష్టించాయి. జులై మాసంలో ఇంత పెద్దఎత్తున వరద రావడం ఇదే తొలిసారి. కాగా 1986 తర్వాత అతిపెద్ద వరద గోదావరికి 2022లోనే వచ్చింది. 1986లో ఆగస్టు 16న 75.6 అడుగులు రాగా, 2022 జులై 16న 71.30 అడుగుల వచ్చింది. అదే విధంగా 1990 ఆగస్టు 28న 70.8 అడుగులు వచ్చింది. వరద తగ్గుముఖం పట్టినప్పటికీ పునరావాస కేంద్రాల్లో నుండి ఎవ్వరూ కదలవద్దని మంత్రి తెలిపారు. శనివారం ఉదయం గోదారితల్లి శాంతించినందుకు గోదావరికి ప్రత్యేక పూజలు చేశారు.
కాళేశ్వరం వద్ద భారీగా తగ్గిన వరద
కాళేశ్వరం : వరద ఉదృతితో ఉగ్రరూపం దాల్చిన గోదావరి భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం వద్ద భారీగా తగ్గుముఖం పట్టింది. పుష్కరఘాట్ తీర ప్రాంతం నుండి తీరం ప్రధాన రహదారికి ఆర కిలోమీటర్ మేర వరద ముంపు కొనసాగించిన గోదావరి శనివారం పుష్కర ఘాట్ స్నాన ఘట్టాలకు చేరుకుని ప్రవహిస్తోంది. పుష్కరఘాట్ తీరం వద్ద గోదావరి 12,550 నీటి మట్టానికి చేరుకుని ప్రవహిస్తోంది. అదే విధంగా తెలంగాణ, మహారాష్ట్ర ప్రాంతాల్లో వర్షాలు తెరపివ్వడంతో మేడిగడ్డ, లక్ష్మి అన్నారం సరస్వతి బ్యారేజీలకు వరద ఉదృతి భారీగా తగ్గింది. మేడిగడ్డ లక్ష్మి బ్యారేజీలోకి ఎగువ నుండి 11,65,040లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుండగా సమాన స్థాయిలో బ్యారేజీ పూర్తిస్థాయి 85గేట్ల ద్వారా వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. అన్నారం సరస్వతి బ్యారేజీలోకి 11,29,033లక్షల క్యూసెక్కుల నీరు చేరుతుండడంతో అంతే స్థాయిలో పూర్తిస్థాయి 66గేట్ల ద్వారా వరద నీటిని దిగువకు తరలిస్తున్నారు.
శాంతించిన గోదారి
RELATED ARTICLES