కోల్‌కతా : కొవిడ్ కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా మారగా, నిరుద్యోగ సమస్య తీవ్ర రూపం దాల్చింది. ప్రస్తుత పరిస్థితికి అద్దం పడుతున్న సంఘటన ఇది. కోల్‌కతాలోని ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో ఆరు ల్యాబ్ అసిస్టెంట్ ఖాళీలకు నోటిఫికేషన్ జారీకాగా, దరఖాస్తులు వెల్లువెత్తాయి. మార్చురీలో శవాలను మోసే ఈ ఉద్యోగానికి ఇంజనీర్లు, పోస్టు గ్రాడ్యుయేట్లు కూడా దరఖాస్తు చేసుకోవడం విశేషం. సుమారు 8,000 మంది దరఖాస్తు చేసుకోగా, వీరిలో సుమారు 100 మంది ఇంజనీర్లు, 500 మంది పోస్టు గ్రాడ్యుయేట్లు ఉన్నట్టు అధికారులు తెలిపారు. వాస్తవానికి ఈ పోస్టులకు కనీస విద్యార్హత ఎనిమిదో తరగతి. 18 నుంచి 40 సంవత్సరాల మధ్య వయసుగల వారు దరఖాస్తు చేసుకోవచ్చని నోటిఫికేషన్‌లో పేర్కొగా, స్పందన ఎవరూ ఊహించని విధంగా వచ్చింది. మొత్తం మీద 84 మంది మహిళలుసహా మొత్తం 784 మందిని ఆగస్టు ఒకటో తేదీన జరిగే రాత పరీక్షకు అధికారులు ఎంపిక చేశారు.