నాణ్యతలో రాజీపడొద్దు : టెంపుల్‌సిటీగా యాదాద్రి
ఆలయ నిర్మాణ పనులను పరిశీలించిన కెసిఆర్
ఏరియల్ సర్వేలోనూ ‘టెంపుల్ వ్యూ’ను వీక్షించిన సిఎం
ప్రజాపక్షం / హైదరాబాద్: యాదాద్రి దేవాలయం పునర్నిర్మాణ పనులన్నింటినీ సమాంతరంగా చేయాలని, వందల ఏళ్ల పాటు నిలిచిపోయే శాశ్వత నిర్మాణం కాబట్టి ఎలాంటి తొందరపాటు లేకుండా పను లు చేయాలని, నాణ్యత విషయంలో రాజీపడవద్దని రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సంబంధిత అధికారులను ఆదేశించారు. తెలంగాణలోని యాదాద్రి దివ్యక్షేత్రంగా రూపుదిద్దుకుంటోందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. రెండు గుట్టలను కవర్ చేస్తూ ఔటర్ రింగు రోడ్డు నిర్మిస్తామని, నిధులు వెంటనే మంజూరు చేస్తామని సిఎం సందర్భంగా ప్రకటించారు. సిఎం కెసిఆర్ ఆదివారం టెంపుల్ సిటీగా అభివృద్ధి పరుస్తున్న యాదాద్రిని సందర్శించారు. ప్రధాన దేవాలయ పునర్నిర్మాణ పనులను పరిశీలించారు. నిర్మాణంలో ఉన్న ప్రధాన ఆలయం, మంటపం, గర్భగుడి, బా హ్య ప్రాకారాలు, అంతర ప్రాకారాలు, మాడవీధులు, రథశాల, వ్రత మంటపం, ధ్వజస్తంభం, ప్రసాదం కౌంటర్లు, శివాలయం పనులను పరిశీలించారు. అధికారులకు, శిల్పులకు తగు సూ చనలు చేశారు. ప్రధాన ఆలయమున్న ప్రాం తంలోని 173 ఎకరాల్లో జరుగుతున్న పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ విలేకరులతో మాట్లాడుతూ ఆలయ నిర్మాణ పనులు శర వేగంగా జరుగుతున్నాయని, చినజీయర్ స్వామి సలహాలతో, ఆగమశాస్త్రం ప్రకారం ఆలయ నిర్మాణ పనులు జరుగుతున్నాయని, ఏడంతస్తుల గోపురం కూడా శిల్పాలతోనే కట్టామని చెప్పారు. కృష్ణ శిలలతో చెక్కిన శిల్పాలు అందంగా, అబ్బురపరిచే విధంగా ఉన్నాయని అన్నారు. మొత్తం వెయ్యి ఎకరాల్లో టెంపుల్ సిటీ నిర్మాణం జరుగుతోందని, ఉత్తర భాగంలో ఆలయం కింది వైపు నుంచి స్థల సేకరణ జరుగుతోందని, ఇందుకోసం రూ.70 కోట్లు విడుదల చేస్తున్నట్టు సిఎం చెప్పారు. సుమారు 250 ఎకరాల్లో 350 క్వార్టర్లు నిర్మిస్తామని, ఇందుకోసం 45 మంది దాతలు ముందుకొచ్చారని వెల్లడించారు. 50 ఎకరాల్లో ప్రవచన మంటపం నిర్మిస్తామని, గంథమల్ల, బస్వాపూర్ ప్రాజెక్టులు నిర్మిస్తున్నట్టు తెలిపారు. యాదాద్రి ఆలయ ప్రారంభోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తామని, 133 దేశాల నుంచి వైష్ణవ ఆరాధకులు వస్తారని, 1008 హోమగుండాలతో ఈ ప్రారంభోత్సవం జరుగుతుందని, యాదాద్రి ప్రపంచంలోనే యూనిక్ టెంపుల్ కానుందని సిఎం వివరించారు. అష్టాదశ పీఠాల్లో అలంపూర్ లోని జోగులాంబ ఆలయం ఒకటని, గత పాలకులు ఈ శక్తి పీఠాన్ని పట్టించుకోలేదని సిఎం అన్నారు. తొలుత సిఎం కెసిఆర్ ఉదయం బేగంపేట నుంచి హెలిక్యాప్టర్ ద్వారా బయలుదేరి యాదాద్రి చేరుకున్నారు. యాదాద్రి చుట్టూ తిరిగి ఏరియల్ సర్వే నిర్వహించారు. ప్రధాన ఆలయమున్న గుట్టపైనా, టెంపుల్ సిటీగా అభివృద్ధి చేస్తున్న గుట్టపైనా, ప్రెసిడెన్షియల్ సూట్ నిర్మిస్తున్న గుట్టపైనా జరుగుతున్న నిర్మాణాలను హెలికాప్టర్ ద్వారా పరిశీలించారు. తర్వాత బాలాలయంలో శ్రీ లక్ష్మి నర్సింహస్వామని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకుడు లక్ష్మి నర్సింహచార్యులు ఆధ్వర్యంలో వేద పండితులు ముఖ్యమంత్రికి ఆశీర్వాద వచనం చేశారు. ముఖ్యమంత్రి వెంట మాజీ మంత్రి జి.జగదీశ్ రెడ్డి, ఎంపిలు జె.సంతోష్ కుమార్, బూర నర్సయ్య గౌడ్, బడుగుల లింగయ్య యాదవ్, ఎంఎల్‌ఎలు గొంగిడి సునిత, పైళ్ల శేఖర్ రెడ్డి, గ్యాదరి కిశోర్, మర్రి జనార్థన్ రెడ్డి, కంచర్ల భూపాల్ రెడ్డి, ఎంఎల్‌సిలు క్రిష్ణారెడ్డి, కర్నె ప్రభాకర్, మాజీ మంత్రి ఎ.ఉమా మాధవరెడ్డి, స్పెషల్ ఆఫీసర్ జి.కిషన్ రావు, కలెక్టర్ అనితా రామచంద్రన్, రాచకొండ సిపి మహేశ్ భగవత్, ఆలయ ఈవో గీత తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.