ప్రతిపక్షాల విమర్శ
న్యూఢిల్లీ ః కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో పసలేదని, కాంతిహీనంగా వుందని ప్రతిపక్ష పార్టీలు వ్యాఖ్యానించాయి. అన్ని రంగాల గురించి ఎక్కువగా మాట్లాడినప్పటికీ, ఏ ఒక్కదానిపైనా సరిగ్గా దృష్టి కేంద్రీకరించలేదని విమర్శించాయి. ముఖ్యంగా నిరుద్యోగ సమస్య పరిష్కారానికి, ఆర్థిక మందగమనం నుంచి బయటపడేందుకు మార్గాలను ఈ బడ్జెట్ సూచించలేకపోయిందని పేర్కొన్నాయి. పన్ను రేట్లలో తగ్గింపు వేతనజీవులకు ఏ మాత్రం ఉపయోగకరంగా వుండబోదని, కొత్త శ్లాబుల పుణ్యమా అని వారు మరింత పన్ను చెల్లించాల్సివుంటుందని కాంగ్రెస్ అభిప్రాయపడింది. ఇది పక్కా ప్రైవేటీకరణ బడ్జెట్‌గా వామపక్షాలు అభివర్ణించాయి. ప్రభుత్వం తన సామాజిక బాధ్యతల నుంచి పారిపోయిందని వ్యాఖ్యానించాయి. మాజీ ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ ఈ బడ్జెట్‌పై స్పంస్తూ, బడ్జెట్ ప్రసంగం చాలా సుదీర్ఘంగా వుందని, అయినా నిష్ప్రయోజనకరంగా వుందన్నారు. ప్రోత్సాహకాలకు చెల్లుచీటి ఇచ్చిన ప్రభుత్వం పన్ను రాయితీలపై గందరగోళాన్ని సృష్టించిందని తృణమూల్ కాంగ్రెస్ వ్యాఖ్యానించింది. కాంగ్రెస్ నాయకుడు రాహుల్‌గాంధీ స్పందిస్తూ, బడ్జెట్‌కు ఎలాంటి వ్యూహం లేదని, దిశానిర్దేశం లేకుండా సాగిపోయిందని వ్యాఖ్యానించారు. దేనిమీదా పెద్దగా దృష్టిపెట్టలేదని, పైగా నిరుద్యోగం వంటి కీలక సమస్యను పూర్తిగా విస్మరించిందని విమర్శించింది. “ప్రస్తుతం యువతను నిరుద్యోగం పట్టిపీడిస్తున్నది. ఇదే ప్రధాన సమస్య. అలాగే ఆర్థిక వ్యవస్థ ఆందోళనకరంగా వుంది. ఏ అంశంపైనా కేంద్రీకృత వైఖరి లేదు. వ్యూహాత్మక ఆలోచన లేదు. ఇది ఉపాధి పొందడానికి మన యువతకు ఎలా ఉపయోగపడుతుంది?” అని రాహుల్‌గాంధీ మీడియాతో అన్నారు. ఆదాయపన్ను చెల్లింపులు సరళతరం చేయకపోగా, మరింత సంక్లిష్టతను తీసుకువచ్చిందని విమర్శించారు. ఏ ప్రభుత్వానికైనా బడ్జెట్ విషయంలో ఒక దార్శనికత వుంటుందని, కానీ మోడీ సర్కారుకు ఏదీ లేదని, బడ్జెట్ ఒక గాలిబుడగలా వుందన్నారు. ఈ బడ్జెట్ స్కోరు విషయంలో పదికి సున్నా మార్కులే ఇస్తున్నట్లు మాజీ ఆర్థిక మంత్రి ఎం.చిదంబరం ప్రకటించారు. ఆర్థిక వ్యవస్థను గాడినపెట్టే ఆలోచన మోడీ ప్రభుత్వానికి ఉన్నట్లుగా లేదని అన్నారు.
వ్యూహం లేని బడ్జెట్
RELATED ARTICLES