నిరుద్యోగులకు దక్కని ఊరట
న్యూఢిల్లీ: ఎక్కడైనా వ్యాపారాలు లేదా పరిశ్రమలు భారీగా పెరిగితే, ఉద్యోగితా శాతం కూడా పెరుగుతుంది. తగ్గితే.. తదనుగుణంగా తగ్గుతుంది. ఆర్థిక శాస్త్రం చెప్పిన.. ఇప్పటి వరకూ నిరూపితమైన సత్యం ఇది. కానీ, మన దేశంలో ఇందుకు భిన్నమైన వాతావరణం నెలకొంది. గత ఏడాది పారిశ్రామికవేత్తల సంఖ్య గణనీయంగా పెరిగింది. అదే దామాషాలో పెరగాల్సిన ఉద్యోగాల్లో మాత్రం క్షీణత నమోదైంది. నిరుద్యోగ యువత భారీగా నష్టపోయింది. అశోక యూనివర్శిటీకి చెందిన సెంటర్ ఫర్ ఎకనామిక్ డేటా అండ్ అనాలిసిస్ (సిఇడిఎ), సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సిఎంఐఇ) తాజా నివేదికను అనుసరించి 2018 జనవరితో పోలిస్తే 2022 అక్టోబర్ చివరి నాటికి దేశంలో వాణిజ్య, పారిశ్రామికవేత్తలు 1.3 కోట్ల మంది పెరగ్గా, 1.4 కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోయారు. వీరిలో సుమారు 45 లక్షల మంది పురుషులుకాగా, 96 లక్షల మంది మహిళలు. బాధితుల్లో 15 నుంచి 39 సంవత్సరాలలోపు వారే ఎక్కువ. ఈ వయసుగల వారిలో 20 శాతం తక్కువ ఉద్యోగిత నమోదుకాగా, ఉద్యోగాలు సంపాదించిన 40 నుంచి 59 సంవత్సరాల మధ్య వయసుగల వారి సంఖ్య అదనంగా 2.5 కోట్లు పెరిగింది. కొవిడ్ మహమ్మారి విచరుకుపడిన తర్వాత దారుణంగా దెబ్బతిన్న ఉద్యోగితా శాతం, తిరిగి కోలుకోలేదు. కొవిడ్ భయాందోళనలు తగ్గినప్పటికీ, ఉద్యోగావకాశాలు తిరిగి పూర్వ స్థాయికి చేరుకోలేదు. గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితి కొంత మెరుగ్గానే ఉంది. గత మూడు సంవత్సరాల కాలంలో ఉద్యోగాలు భారీగా తగ్గిన దాఖలాలు లేవు. అయితే, పట్టణ ప్రాంతాల్లో ఉద్యోగాలు తగ్గాయి. గ్రామీణ ప్రాంతాల్లో సుమారు 1.5 కోట్ల మందితో పోలిస్తే పట్టణ ప్రాంతాల్లో పెరిగిన ఉద్యోగుల సంఖ్య కేవలం 4 లక్షలుగా ఉంది. కొవిడ్ ప్రారంభ నెలల్లో తీవ్రంగా దెబ్బతిన్న ఉపాధి, ఇంకా మహమ్మారికి ముందు స్థాయికి తిరిగి రాకపోవడమే ప్రధాన సమస్య. మొదటి లాక్‌డౌన్ నుండి వ్యవసాయ రంగం ఎక్కువ మందికి ఉపాధిని కల్పిస్తున్నప్పటికీ, గత సంవత్సరంలో ఆ పెరుగుదల కూడా మందగించింది. 2019- ఆర్థిక సంవత్సరం నుంచి 2020 ఆర్థిక సంవత్సరం వరకూ వ్యవసాయ ఉపాధిలో 4 శాతం పెరుగుదల ఉంది, అయితే 2021 ఆర్థిక సంవత్సరంలో అది 2.6 శాతానికి తగ్గింది. 2022 జూన్ మాసం నాటికి గ్రామీణ ఉపాధిలో తగ్గుదల స్పష్టంగా కనిపించింది. తయారీ, సేవా రంగాలలో తగ్గుదల కారణంగానే గ్రామీణ ఉపాధి తగ్గుదల నమోదైనట్టు కనిపిస్తోంది, అయితే వ్యవసాయంలో ఉపాధి 50 లక్షలకుపైగా పెరిగింది. మొత్తంమీద, రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగంలో ఉపాధి స్థాయి 2022లో పుంజుకుంది. కొవిడ్ ముందు స్థానానికి చేరినట్టు కనిపిస్తున్నది. అయితే, తయారీ రంగంలో ఉపాధి పునరుద్ధరణ మందగొడిగా, పాక్షికంగా మాత్రమే మాత్రమే నమోదవుతున్నది. 2018, 2019 సంవత్సరాలలో ఈ రెండు రంగాల్లోని సగటు ఉపాధితో పోలిస్తే, అక్టోబర్ 2022 నాటికి దాదాపు 60 లక్షల మంది తగ్గారు. దేశంలోనే అత్యధిక మందికి ఉద్యోగావకాశాలు కల్పిస్తున్న సేవల రంగం ఇప్పుడు దాదాపు 1.47 కోట్ల మందికి ఉపాధి కల్పిస్తోంది. మహమ్మారి సమయంలో ఈ రంగంలో ఉద్యోగాలు తగ్గాయి. కాగా, టోకు మరియు రిటైల్ వాణిజ్య రంగం విశేషమైన విస్తరణను చూసింది. మహమ్మారి సంవత్సరాల్లో కూడా ఈ రంగం నిలదొక్కుకోవడం విశేషం. 2018తో 5.9 కోట్ల మంది ఈ రంగాల్లో ఉపాధి పొందగా, ఇప్పుడు వీరి సంఖ్య 7 కోట్లను అధిగమించింది. మొత్తం మీద, స్థూలంగా చూస్తే వివిధ రంగాల వారీగా చూస్తే, విస్తరణ కనిపిస్తున్నదేగానీ ఉద్యోగావకాశాలు మాత్రం ఆ స్థాయిలో లేవు. పారిశ్రామికవేత్తలతోపాటు పరిశ్రమలు కూడా పెరిగితే, ఉద్యోగాలు అదే దామాషాలో ఎందుకు పెరగలేదన్నది బిలియన్ డాలర్ల ప్రశ్న. శ్రమ దోపిడీ నిరాటంకంగా కొనసాగుతున్నదనడానికి ఇదో నిదర్శనం.
వ్యాపారాలు పెరిగి.. ఉద్యోగాలు తరిగి
RELATED ARTICLES