ఆదాయానికి మించిన కేసులో సిబిఐ కోర్టును కోరిన జగన్
సిఎం అయిన తరువాత మొదటి సారిగా కోర్టుకు హాజరు
విచారణ 17కు వాయిదా
ప్రజాపక్షం/హైదరాబాద్: : ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఎపి సిఎం జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం నాంపల్లిలోని సిబిఐ కోర్టుకు హాజరయ్యారు. ఈ కేసులో ఆయనతో పాటు ఎంపి విజయసాయిరెడ్డి, మాజీ మంత్రి ధర్మాన ప్రసాద్‌రావు కూడా కోర్టుకు హాజరయ్యారు. సిఎం హోదాలో జగన్ సిబిఐ కోర్టుకు రావడం ఇదే తొలిసారి. అయితే ఇడి కేసులో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరగా కోర్టు తోసిపుచ్చింది. తనకు ఈ కేసులోంచి వ్యక్తిగత హాజరు మినహాయించాలని, తన తరఫున న్యాయవాది హాజరవుతారని గతంలో హైకోర్టులో వేసిన జగన్ పిటిషన్ కొట్టివేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తన తరఫున సహ నిందితుడు హాజరవుతారని జగన్ మరోసారి కోరిన అభ్యర్థనను కోర్టు తోసిపుచ్చింది. ఇక జగన్ ఆస్తుల కేసులో 11 డిశ్చార్జ్ పిటిషన్లను అన్నీ కలిపి ఒకేసారి విచారించాలని జగన్ తరఫు న్యాయవాది నిరంజన్‌రెడ్డి పేర్కొనగా మరోవైపు సిబిఐ తరఫున సురేందర్‌రెడ్డి వాదనలు వినిపించారు. ఇలా మొత్తం రెండు గంటల పాటు కోర్టులో వాదనలు జరిగాయి. ఇరువాదనలు విన్న అనంతరం తదుపరి విచారణను కోర్టు ఈ నెల 17కు వాయిదా వేసింది. ఆస్తుల కేసులో సిఎం అయిన తరువాత మొదటి సారిగా సిబిఐ కోర్టుకు జగన్ హాజరవుతుండడంతో కోర్టు వద్ద కట్టుద్టిటమైన బందోబస్తును ఏర్పాటు చేశారు. జగన్ ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయంలో దిగి అక్కడి నుంచి కోర్టుకు కారులో వచ్చారు. విచారణ అనంతరం తిరిగి ఆయన ప్రత్యేక విమానంలో ఎపికి వెళ్లారు.సిబిఐ కోర్టు వద్ద వైఎస్‌ఆర్‌సిపి క్యాకర్తలు జగన్‌కు అనుకూలంగా నినాదాలు చేయడం విశేషం.