HomeNewsBreaking Newsవైద్య శాఖలో త్వరలోనే ఖాళీ పోస్టులు భర్తీ

వైద్య శాఖలో త్వరలోనే ఖాళీ పోస్టులు భర్తీ

మెరుగైన వైద్యంలో మూడవ స్థానంలో రాష్ట్రం
మంత్రి హరీశ్‌రావు వెల్లడి
ప్రజాపక్షం/హైదరాబాద్‌/అంబర్‌పేట్‌ వైద్య శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను త్వరలోనే భర్తీ చేస్తామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి టి.హరీశ్‌రావు తెలిపారు. దవాఖానల్లో మందుల కొరత ఉండొద్దన్నారు. హైదరాబాద్‌లోని ఫీవర్‌ ఆసుపత్రిలో రూ. 10.91 కోట్లతో నిర్మించనున్న కొత్త ఒపిడి బ్లాక్‌కు శనివారం మంత్రి హరీశ్‌రావు శంకుస్థాపన చేశారు. అనంతరం 13 హార్సే వెహికల్స్‌, 3 అంబులెన్స్‌లను జెండా ఊపి ప్రారంభించారు. కార్యక్రమానికి ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్‌, టిఎస్‌ఎంఎస్‌ఐడి చైర్మన్‌ ఎర్రోల్ల శ్రీనివాస్‌, డిఎంఇ రమేష్‌ రెడ్డి, ఐపిఎం డైరెక్టర్‌ ఫీవర్‌ ఆస్పత్రి ఇన్‌చార్జ్‌ శంకర్‌, డ్రగ్స్‌ కంట్రోల్‌ అడ్మినిస్ట్రేషన్‌ డైరెక్టర్‌ ప్రీతిమీన తదితరులు హాజరయ్యారు. మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ దేశంలో మంచి వైద్యం అందుతున్న రాష్ట్రాలలో తెలంగాణ రాష్ట్రం మూడవ స్థానంలో ఉన్నదని కేంద్రం చెప్పిందన్నారు. ఫీవర్‌ ఆసుపత్రికి ఘనమైన చరిత్ర ఉన్నదని, 1915లో క్వారంటైన్‌ సెంటర్‌గా మొదలై, కాలక్రమేణా అది కొరంటి ఆసుపత్రిగా పేరుగాంచిందని గుర్తు చేశారు. అంటువ్యాధులు రాగానే ముందుగా ఫీవర్‌ హాస్పిటల్‌ గుర్తుకొస్తుందన్నారు. ఒపికి రోజుకూ సగటున 500 సీజనల్‌ వ్యాధుల సమయంలో వెయ్యి వరకు రోగులు వస్తున్నారని, అందుకే కొత్త ఒపి బ్లాక్‌ను నిర్మించుకున్నామన్నారు. ఫీవర్‌ హాస్పిటల్‌లో మార్చురీ అభివృద్ధికి రూ 60 లక్షలు, డయాలసిస్‌ విభాగానికి రూ.50 లక్షలు మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు. మార్చురీలను అభివృద్ధి చేస్తున్నామని, 61 ఆసుపత్రుల్లో మార్చురీల ఆధునికీకరణకు ప్రభుత్వం రూ.32.54 కోట్లు విడుదల చేసిందన్నారు. దేశంలోనే మంచి మార్చురీలను అధ్యయనం చేసి, రూ. 9 కోట్లతో ఉస్మానియా ఆస్పత్రిని అభివృద్ధి చేస్తున్నామన్నారు. గాంధీ, ఉస్మానియా, కోరంటి ఆస్పత్రులపైన లోడ్‌ పెరిగిందని, అందుకే సిఎం కెసిఆర్‌ నగరం నలువైపులా నాలుగు సూపర్‌ స్పెషాలిటీ హాస్పటల్స్‌ నిర్మిస్తున్నా రన్నారు. సమైఖ్య రాష్ట్రంలో కొత్త దవాఖానలు ఇవ్వలేదని, గతంలో ఆరోగ్యశ్రీ కింద ఒక కుటుంబానికి రూ. 2 లక్షలు మాత్రమే వచ్చేదని, దీనిని సిఎం కెసిఆర్‌ రూ 5 లక్షలకు పెంచారన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు దూసరి లావణ్య శ్రీనివాస్‌ గౌడ్‌,అమృత,ఇ.విజయ్‌కుమార్‌ గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments