ప్రైవేటు ఆసుపత్రులు, క్లినిక్‌ల ధనార్జనపై నిఘా
ప్రజాపక్షం / హైదరాబాద్ : రాష్ట్రంలోని ప్రైవేట్ ఆసుపత్రులు, క్లినిక్‌లు, డయాగ్నోస్టిక్ కేంద్రాలను పర్యవేక్షించి కఠినమైన నిబంధనలు తీసుకురావాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ప్రైవేటు ఆసుపత్రులు ఫీజు ల రూపేణా, వైద్య పరీక్షల రూపేణా అందిన కాడికి దండుకుంటున్నాయి. కార్పొరేట్ ఆసుపత్రు ల విషయమైతే వేరే చెప్పనక్కర లేదు. రోగులకు అవసరం ఉన్నా, లేక పోయినా లేని పోని టెస్టులన్నీ రాసేసి ఆ పరీక్షలను చేయించడం, ఆ తర్వాత కన్సల్టేషన్ కింద మరోసారి ఫీజు వసూలు చేసుకోవడం అలవాటైంది. గర్భంలో ఉన్నది ఆడ బిడ్డా, మగ బిడ్డా అని నిర్ధారించుకునేందుకు ఇప్పటికీ లైంగిక నిర్ధారణ పరీక్షలు జరుగుతున్న ఉదంతాలు ఉన్నాయి. వీట న్నింటిని గమనంలోకి తీసుకున్న ప్రభుత్వం కార్పొరేట్ ఆసుపత్రుల ధనార్జనపై నిఘా పెట్టనుంది. ఇందులో భాగంగా ఆరోగ్య శాఖ అధికారులు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఎ) ప్రతినిధులతో పాటు ప్రైవేట్ కార్పొరేట్ ఆస్పత్రులు, క్లినిక్‌లు, డయాగ్నోస్టిక్ కేంద్రాల సభ్యులతో ఇటీవల ఒక ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించి ఇందుకు సంబంధించిన విధి విధానాల రూపకల్పనకు కసరత్తు చేసింది. ముఖ్యంగా రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టాన్ని అమలు చేయడానికి, అలాగే ప్రైవేట్ ఆస్పత్రులు, క్లినిక్‌లు, రోగనిర్ధారణ కేంద్రాలను రోజూ పర్యవేక్షించేలా చూడడానికి కొత్త నిబంధనలు తెస్తున్నట్లు చెబుతోంది. ప్రస్తుతం అమలులో ఉన్న పాత చట్టాలు, నిబంధనలను సమూలంగా ప్రక్షాళన చేయనున్నారు. నిజానికి రెండేళ్ల క్రితం రాష్ట్రంలో ప్రభుత్వం ‘కేంద్ర క్లినికల్ స్థాపన చట్టాన్ని అందుబాటులోకి తెచ్చారు. అయితే ఈ చట్టాన్ని అమలు చేయాల్సిన వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ఉదాసీనంగా వ్యవహరించారన్న ఆరోపణలు ఉన్నాయి. దీంతో ప్రైవేటు, కార్పొరేట్ ఆస్పత్రులు, క్లినిక్‌లు, రోగనిర్ధారణ కేంద్రాలది ఇష్టారాజ్యంగా మారింది. డయాగ్నొస్టిక్ సెంటర్లలో రిపోర్టులు ఇవ్వడానికి సరైన శిక్షణ పొందిన సిబ్బంది, లేదా నిపుణులు కూడా లేరని, వైద్య నిపుణులకు బదులుగా సాంకేతిక సిబ్బంది మాత్రమే తుది విశ్లేషణ నివేదికలపై సంతకం చేస్తున్న ఘటనలు ఉన్నాయని గుర్తించారు.