వివరాలు పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాలని రాష్ట్రాలకు కేంద్రం సూచన
న్యూఢిల్లీ: వేసవి తాపం క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో, అధిక వేడి కారణంగా తలెత్తే అనారోగ్యాలు, మరణాలు, కల్పిస్తున్న వైద్య సేవలు తదితర వివరాలను ఆరోగ్య పోర్టల్‌లో ఎప్పటికప్పుడు అప్‌లోడ్ చేయాలని కేంద్ర సూచించింది. గత ఏడాది ‘హీట్‌వేవ్’ (వడగాల్పులు) దేశంలోని పలు ప్రాంతాలను వేధించిన విషయం తెలిసిందే. ఈ ఏడాది వర్షాలు తక్కువగా ఉంటాయని వాతారణ విభాగం ప్రకటించడంతో, వేడిగాల్పులు మరోసారి దేశాన్ని అతలాకుతలం చేసే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలోనే కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు లేఖలు రాసింది. వేసవి కాలానికి ముందు కొన్ని చోట్ల ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరుగుతున్నాయని, కాబట్టి ప్రజారోగ్యానికి సంబంధింతచిన అన్ని వివరాలను పోర్టల్‌లో ఉంచాలని పేర్కొంది. నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (ఎన్‌సిడిసి) వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న ‘ఉష్ణ సంబంధిత వ్యాధులపై జాతీయ కార్యాచరణ
ప్రణాళిక’పై దృష్టి సారిస్తున్నట్టు ప్రకటించింది. అవసరాలకు తగిన రీతిలో సమర్థంగా స్పందించడానికి, అన్ని రకాల సవాళ్లను ఎదుర్కోవానికి సంసిద్ధంగా ఉండాలని పేర్కొంది. అందులో భాగంగా అన్ని జిల్లాలకు మార్గదర్శక పత్రాన్ని పంపిణీ చేయాలని మంత్రిత్వ శాఖ అభ్యర్థించింది. వేడి ప్రభావం, దాని కారణంగా ఉత్పన్నమయ్యే కేసుల నిర్వహణ, రికార్డు నిర్వహణ, నిఘా మొదలైన అంశాలతో కూడిన సమాచారాన్ని బుధవారం నుంచి అన్ని రాష్ట్రాలు అప్‌డేట్ చేసుకోవాలని కోరింది. అన్ని జిల్లాల్లో వాతావరణ మార్పు, మానవ ఆరోగ్యంపై జాతీయ కార్యక్రమం (ఎన్‌పిసిసిహెచ్‌హెచ్) కింద వేడి-సంబంధిత వ్యాధులపై రోజువారీ నిఘా ఉంటుందని వివరించింది. ఆరోగ్య సమాచార వేదిక (ఐహెచ్‌ఐపి), కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్ అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు వివరాత్మక లేఖ రాశారు. అన్ని రకాలుగా ఆరోగ్య సౌకర్యాలను కల్పించాలని, ముఖ్యంగా ఉష్ణతాపం కారణంగా తెలెత్తే వ్యాధులు, సమస్యల నివారణకు కృషి చేయాలని కోరారు. ప్రజారోగ్యాన్ని పరిరక్షించడంతోపాటు, తాగునీటి లభ్యత, శీతలీకరణ ఉపకరణాల పనితీరును మెరుగుపరచుకోవాలని హితవు పలికారు. రాష్ట్ర, జిల్లా , నగర ఆరోగ్య శాఖలు వేడి-సంబంధిత ఆరోగ్య కార్యాచరణ ప్రణాళికల అమలును నిర్ధారించాలని కోరారు. రాష్ట్రంలోని ఆరోగ్య శాఖలు వైద్యాధికారులు, ఆరోగ్య సిబ్బంది, అట్టడుగు స్థాయి కార్మికులకు వడదెబ్బ, దాని ముందస్తు గుర్తింపు, నిర్వహణపై దృష్టిపెట్టాలన్నారు. అవసరమైన మందులు, ఇంట్రావీనస్ ఫ్లూయిడ్లు, ఐస్ పాక్స్, ఒఆర్‌ఎస్‌తోపాటు అవసరమైన అన్ని పరికరాలు తగిన పరిమాణంలో అందుబాటులో ఉంచుకోవాలని పేర్కొన్నారు. శీతలీకరణ ఉపకరణాల స్థిరమైన పనితీరు కోసం నిరంతరాయంగా విద్యుత్తు స్కౌకర్యాన్ని కల్పించడం, ఎక్కడ సాధ్యమైతే అక్కడ సౌర ఫలకాలను ఏర్పాటు చేయడం , శక్తి పరిరక్షణ చర్యలు, చల్లని/ఆకుపచ్చ పైకప్పు ద్వారా ఇండోర్ వేడిని తగ్గిండం వంటి చర్యలు తీసుకుంటే మంచిదని తెలిపారు.
వేసవిలో ఆరోగ్యం పట్ల అప్రమత్తం
RELATED ARTICLES