తెలంగాణ మీదుగా రవాణా
ముంబయి, ఢిల్ల్లీ, హైదరాబాద్, బెంగళూరుకు ఎగుమతి
క్వింటాళ్ల చొప్పున పట్టుబడుతున్న వైనం
ప్రజాపక్షం/ ఖమ్మం బ్యూరో: ఒడిశా, ఛత్తీస్‌గఢ్ దండకారణ్యంలో గంజాయి వ్యాపారులు వేల ఎకరాల్లో గంజా యి సాగు చేశారు. ధనార్జనే ధ్యేయంగా వ్యవహరిస్తున్న గంజాయి మాఫియా ఢిల్లీ, ముంబయి, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు మొదలైన మెట్రోపాలిటిన్ నగరాలతో పాటు ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నారు. దండకారుణ్యం నుంచి తెలంగాణ రాష్ట్రం, ముఖ్యంగా ఖమ్మం, వరంగల్లు జిల్లాల మీదుగా రవాణా చేస్తున్నారు. గత నెలరోజుల కాలంలో వందల క్వింటాళ్ల గంజాయి పట్టుబడిందంటే పరిస్థితి ఏవిధంగా ఉందో అవగతమవుతుంది. యువత లక్ష్యంగా గంజాయి వ్యాపారం జోరుగా సాగుతున్నట్లు సమాచారం. మెట్రో పాలిటిన్ నగరాలు, ప్రధాన విద్యాసంస్థల కేంద్రాలు, పారిశ్రామిక ప్రాంతాల్లోని విద్యార్థులు, వ్యాపారులు, కార్మికులను మత్తుకు బానిసలను చేసేవిధంగా గంజాయి వ్యాపారం సాగుతుంది. ఒడిశా, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్ రాష్ట్రాల్లోని దండకారుణ్యంలో కొందరు ముఠాలుగా ఏర్పడి వేల ఎకరాల్లో గంజాయిని సాగు చేస్తున్నారు. దట్టమైన అడవులు చుట్టూ ఉండడంతో పోలీసులు ఆ వైపు కన్నెత్తి చూడకపోయినా గంజాయి సాగు విషయం మాత్రం అందరికీ తెలిసిన విషయమే. దండకారుణ్యంలో పండించిన గంజాయిని బస్సులు, రైళ్లు, ఇతర ప్రత్యేక వాహనాల్లో తరలిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని వైజాగ్, శ్రీకాకుళం, విజయనగరం, విజయవాడల నుంచి రైళ్ల ద్వారా తెలంగాణలోని ఉమ్మడి ఖమ్మం, వరంగల్లు జిల్లాల మీదుగా రోడ్డు మార్గం ద్వారా తరలిస్తున్నారు. గంజాయి వ్యాపారం వేలు, లక్షలు కాదు కోట్ల రూపాయల ఆదాయాన్ని తెచ్చిపెడుతుంది. ప్రధాన నగరాలకు సరఫరా చేయడం మొదలు గంజాయి వాడకం దారుల వద్దకు చేర్చేవరకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు. పోలీసులకు ఎటువంటి అనుమానం రానివిధంగా అతి ఖరీదైన వాహనాల్లో సరఫరా చేస్తున్నారు.