కరోనా కట్టడికి ఈ విధానమే మేలని ఐసిఎంఆర్ వెల్లడి
న్యూఢిల్లీ : పొరపాటున ఫస్ట్ డోస్‌గా ఒక టీకా, రెండో డోస్‌గా మరో టీకా ఇచ్చిన సంఘటనలపై పలు సందర్భాల్లో సంచలనం రేగింది. పొరపాటుపై తీవ్ర విమర్శలు కూడా చెలరేగాయి. కానీ, ఇప్పుడు అదే మంచి విధానమని నిపుణులు అంటున్నారు. కొవిషీల్డ్, కొవాగ్జిన్‌లో ఫస్ట్ డోస్ కింద ఒక టీకాను ఇస్తే, రెండో డోస్ కింద మరో టీకాను ఇవ్వడం వల్ల అద్భుత ఫలితాలను పొందవచ్చని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) వెల్లడించిది. తన తాజా అధ్యయనంలో ఈ విషయం స్పష్టమైనట్టు తాజా ప్రకటనలో పేర్కొంది. ప్రస్తుతం భారత్‌లో కొవిషీల్డ్, కొవాగ్జిన్‌తోపాటు, స్పుత్నిక్ వ్యాక్సిన్ కూడా మార్కె ట్లో ఉన్నాయి. సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండి యా (ఎస్‌ఐఐ) నుంచి కొవిషీల్డ్, భారత్ బయోటెక్ నుంచి కొవాగ్జిన్ ఉత్పత్తి అవుతున్నాయి. ఒక వ్యక్తికి మొదటి, రెండో డోసుల్లో వేరువేరుగా ఈ రెండు వ్యాక్సిన్లను ఇవ్వడం మంచిదని, వైరస్‌ను ఎదుర్కొనే రోగ నిరోధక శక్తి పెరుగుతుందని తమ అధ్యయనంలో రుజువైనట్టు ఐసిఎంఆర్ ప్రకటించింది. ఈ విధంగా ఒక వ్యాక్సిన్‌ను ఒక డోసు, మరో వ్యాక్సిన్‌ను రెండో డోసుగా తీసుకుంటే కరోనా మహమ్మారిని సమర్థంగా ఎదుర్కొనే అవకాశం ఉంటుందని తెలిపింది. ఉత్తర ప్రదేశ్‌లో సుమారు రెం డు నెలల క్రితం ఒకే వ్యక్తికి కొవిషీల్డ్, కొవాగ్జిన్‌లను వేర్వేరు డోసుల్లో ఇవ్వడం అప్పట్లో సంచలనం రేపింది. అయితే, సరదు వ్యక్తిపై చేసిన పరిశోధనలు ఈ రెండు వ్యాక్సిన్లను వేర్వేరు డోసుల కింద ఇస్తే ఫలితాలు మెరుగ్గా ఉంటాయనే విషయాన్ని స్పష్టం చేసింది. రెండు వేర్వేరు వ్యాక్సిన్లను తీసుకోవడం వల్ల ఎలాంటి ప్రమాదం లేదని తెలిపింది. అంతేగాక, రోగ నిరోధక శక్తి పెరుగుతుందని ఐసిఎంఆర్ తన ప్రకటనలో పేర్కొంది. ఇలావుంటే, టీకాల కొరత వేధిస్తున్న తరుణంలో, ఈ విధంగా ఒక్కో వ్యాక్సిన్‌ను ఒక్కో డోస్‌గా వాడితే, సమస్యకు కొంత వరకు పరిష్కారం లభిస్తుందన్న వాదన కూడా వినిపిస్తున్నది. కొవిషీల్డ్, కొవాగ్జిన్ టీకాలను మిశ్రమ విధానంలో వాడడం వల్ల కలిగే ప్రయోజనాల గురించా అధ్యయయనం చేయాల్సిన అవసరం ఉందని కేంద్ర ప్రభుత్వ పర్యవేక్షణలోని నిపుణులు కమిటీ కూడా ఇది వరకే సూచించింది. ఐసిఎంఆర్ దీనిపై అధ్యయనాన్ని పూర్తిచేయగా, మరింత లోతుగా అధ్యయనాలు కొనసాగుతున్నాయి. ఇలావుంటే, వ్యాక్సిన్ల మిశ్రమ వినియోగంపై ఇప్పడిప్పుడే నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్‌ఒ) హితవు పలికింది. మొత్తం మీద రెండు రకాల టీకాలను ఒకే వ్యక్తికి ఇవ్వచ్చన్న ప్రతిపాదన ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
వేర్వేరు టీకాలతో అద్భుత ఫలితాలు
RELATED ARTICLES