ఉవాల్డే (అమెరికా): సాల్వడార్ రామోస్.. 18 ఏళ్ల టీనేజర్.. ఎందుకు ఉన్మాదిగా మారాడో ఎవరికీ తెలియదు. ఇంటి దగ్గర తల్లిని తుపాకీతో కాల్చి చంపాడు. రాబ్ ఎలిమెంటరీ స్కూల్ కు వెళ్లి, ఎవరూ ఊహించని రీతిలో హఠాత్తుగా కాల్పులు జరిపాడు. ఇరవైకిపైగా ప్రాణాలు తీశాడు. దీనివల్ల రామోస్ సాధించింది ఏమిటో అతనికే తెలియాలి. కానీ, ఏ పాపం ఎరుగని చిన్నారులు ప్రాణాలు కోల్పోగా, తల్లిదండ్రులు, సన్నిహితుల వేదనలు వర్ణనాతీతం. ఆప్రాంతమంతా వారి రోదనలు, కన్నీళ్లతో నిండిపోయిం
ఈ విధంగా కాల్పులకు పాల్పడుతున్న వారిలో అత్యధిక శాతం మంది టీనేజర్లు.. లేదా పాతిక సంవత్సరాలు కూడా నిండని యువకులే. కుటుంబ నేపథ్యమో.. స్నేహితుల ప్రోత్సాహమో.. సోషల్ మీడియా ద్వారా పెంచుకున్న తాజ్యహంకారమో తెలియదుకానీ, కాల్పుల ఘటనలు మాత్రం అమెరికాలో పెచ్చరిల్లుతున్నాయి. తాజా ఘటనలో ప్రాణాలు పోగొట్టుకున్న వారి తల్లిదండ్రులతోపాటు, తమ పిల్లల ఆచూకీ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్న వారు కూడా కన్నీరుమున్నీరవుతున్నారు. ‘కాల్పుల గురించి సమాచారం అందించిన అధికారులు, ఆ ఘటనలో 8 ఏళ్ల మా మనుమడు ఉజియా గార్సియా మృతి చెందినట్టు చెప్పారు. ఒక్కసారిగా కుప్పకూలిపోయాను. ఉజియా.. చాలా హుషారైన పిల్లవాడు. వాడితో కలిసి ఫుట్‌బాల్ ఆడేవాడిని. ఇద్దరి మధ్య పోటీ ఉండేది. అంత చిన్న వయసులోనే ఎంతో ప్రతిభ చూపేవాడు. ఉజియా లేడన్న వార్తను నేను ఇంకా జీర్ణించుకోలేకపోతున్నాను’ అంటూ రోదిస్తున్న మానీ రెన్‌ఫ్రోను చూస్తే ఎవరికైనా కన్నీళ్లు ఆగవు. 44 ఏళ్ల ఇవా మిరెలెస్.. నాలుగో తరగతి ఉపాధ్యాయురాలు. ఒకవైపు ఇంటి పనులు చూసుకుంటూనే, మరోవైపు ఉత్తమ టీచర్‌గా అందరి మన్ననలు పొందింది. ‘ఇవాకు సాహసాలు చేయడం అంటే ఎంతో ఇష్టం. భర్త, పిల్లలతో సుఖంగా సాగుతున్న ఆమె జీవితం ఇంత హఠాత్తుగా, అర్ధాంతరంగా ముగుస్తుందని కలలో కూడా ఊహించలేదు. ఆమె నాకు స్నేహితురాలు మాత్రమే కాదు.. మార్గదర్శకురాలు కూడా. ఈ కాల్పుల ఘటనలో గాయపడిన వారికి రక్తదానం చేస్తాను’ అంటూ ఇవాను తలచుకొని కన్నీళ్లు పెట్టుకుంటున్నది ఆమె ప్రాణస్నేహితురాలు, ప్రముఖ కోచ్ అంబర్ బరా. కాల్పుల సమయంలో తాను పాఠశాలలోనే ఉన్నానని, ఏం జరిగిందో తెలిసేలోపే ఘోరం జరిగిపోయిందని వాపోయింది. పిల్లల్లో ఇలాంటి మానసిక స్థితికి కారణాలను కనుగొనాల్సిన అవసరం ఉందని ఆమె పేర్కొంది. ప్రభుత్వాలు ఈ దిశగా దృష్టి సారించకపోతే, భవిష్యత్తులో మరిన్ని ఘటనలను చూడాల్సి వస్తుందని ఆమె హెచ్చరించింది. ఇదే రీతిలో తమ సన్నిహితులను, పిల్లలను గుర్తుచేసుకొని విలపిస్తున్న వారిని ఓదార్చడం కూడా కష్టంగా మారింది. అధికారులు సైతం ఏం చేయాలో తెలియని స్థితిలో ఉన్నారు. ఆలోచనలు పక్కదారిపట్టిన ఓ ఉన్మాది కారణంగా చిన్నారులు ప్రాణాలు కోల్పోయారన్న వార్త మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరినీ కలచివేస్తున్నది.
వేదనలు… రోదనలు..
RELATED ARTICLES