కాంట్రాక్ట్ , ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల అగచాట్లు
జీతాలు లేకుండా నాలుగు నెలలుగా వెట్టి చాకిరీ
ప్రభుత్వశాఖల్లోనే ఇలా ఉంటే ఎలా అంటున్న ఉద్యోగులు
ప్రజాపక్షం/హైదరాబాద్: రాష్ట్ర ఖజానా పూర్తిగా ఖాళీ అయ్యిందా? చివరికి ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితికి చేరిందా? ప్రభుత్వ ఉద్యోగులకు అతి కష్టం మీద జీతాలు చెల్లిస్తున్న ప్రభుత్వం కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు మాత్రం జీతాలు నెల ల తరబడి ఇవ్వకుండా పట్టించుకోవడం లేదా? అంటే ఔననే సమాధానం వినిపిస్తోంది. సుమారుగా 40 వేల మంది కాంట్రాక్ట్ , ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు చెల్లించకపోవడంతో వారు నానా ఇబ్బందులు పడుతున్నారు. గత 20 ఏళ్ల నుండి రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో అరకొర వేతనాలతోనే పని చేస్తున్న వీరు నెలంతా కష్టపడి పని చేస్తున్నా జీతాలు మాత్రం పొందడం లేదు. దీంతో వీరి ఆర్థిక పరిస్థితి మరింత దిగజారీ అప్పుల పాలవుతున్నారు. ఇళ్ల అద్దె, పిల్లల చదువులు ఇలా కుటుంబభారం తలుచుకుంటేనే బాధ వర్ణనాతీతంగా ఉందని ఆయా ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ విధానం ద్వారా ఏజెన్సీల నుండి సచివాలయం, ప్రభుత్వ ఆసుపత్రులు, అలాగే ఇతర వివిధ ప్రభు త్వ శాఖలలో వీరు నియమితులయ్యారు. ఒక్కో ఉద్యోగి రూ. 10 వేల నుండి 22 వేల వరకు జీతాలపై వీరు నియమితులయ్యారు. ప్రభుత్వ ఉద్యోగస్తుల మాదిరిగానే వీరికి భవిష్యనిధి (పిఎఫ్), కార్మిక రాజ్యభీమా సంస్థ (ఇఎస్‌ఐ) వంటి సౌకర్యాలు కల్గ చేసిన ప్రభుత్వం ఉద్యోగ భద్రతలో మాత్రం ఏమాత్రం గ్యారంటీ ఇవ్వక పోగా వేతనాలను సకాలంలో చెల్లించడం లేదంటున్నారు. ప్రభు త్వం నుండి ఏజెన్సీ కంపెనీలు, గుత్తెదార్లకు బిల్లు లు రాక పోవడంతో ఈ ఉద్యోగులకు వేతన చెల్లింపులను నిలిపివేసినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ కార్యాలయాల్లోనూ, ఆసుపత్రులలోనూ ఈ ఉద్యోగుల పరిస్థితి చాలా దారుణంగా ఉందని పలువురు ఆరోపిస్తున్నారు. ఆసుపత్రులలో సాంకేతిక సిబ్బంది, ఆపరేషన్ థియోటర్లలో పని చేసే కీలక ఉద్యోగులు అందరూ ఔట్ సోర్సింగ్ విధానంలో పని చేస్తున్న వారే ఎక్కువగా ఉన్నారు. ఉస్మానియా, గాంధీ ఆసుపత్రులతో పాటు నిమ్స్ ఆసుపత్రిలోనూ వీరు వందల సంఖ్యలో విధులు నిర్వహిస్తున్నారు. మూడు షిఫ్ట్‌లలో ఉదయం, మధ్యాహ్నం, నైట్ డ్యూటీల్లో వీరు పని చేస్తున్నారు. వీరికి చెల్లిస్తున్న వేతనాలు 20 వేల లోపు మాత్రమే కాగా, వారు చేస్తున్న పని మాత్రంచాలా ఎక్కువగానే ఉంటోంది. ఆపరేషన్ థియోటర్లలో నిర్వహించే ఆపరేషన్స్, అత్యవసర చికిత్స విభాగం ( ఐసియూ) విభాగాల్లో పని అధికంగానే ఉంటోందని ఆయా ఉద్యోగులు వాపోతున్నారు. సర్టిఫైడ్ సిబ్బంది ద్వారా చేసిన పరీక్షల రిపోర్టులను వైద్యులకు, లేదా పేషంట్స్ తరఫు బంధువులకు సకాలంలో చేరవేస్తుంటారు. ఆయా ఆసుపత్రుల్లో పని చేస్తున్న వారు స్థానికంగా ఉన్న వారు కొందరైతే, సుదూర ప్రాంతాల నుండి హైదరాబాద్‌కు వచ్చి పని చేస్తున్నవారు మరి కొందరు ఉన్నారు. కుటుంబాలు ఒక చోట, తాము ఇంకో చోట ఉండి కూడా విధులను నిర్వహిస్తున్నామని చెబుతున్నారు. మున్సిపాలిటీలు, ఆర్థిక పరిపుష్టి కల్గిన నగర పాలక సంస్థల్లో ఆయా ఉద్యోగులకు జీతాలను ఒకింత సకాలంలో చెల్లిస్తుండగా తాము ప్రభుత్వ శాఖల్లో పని చేస్తున్నా జీతాలు మాత్రంరావడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.