HomeNewsBreaking Newsవేడుకలకు గుమికూడొద్దు..

వేడుకలకు గుమికూడొద్దు..

ఆంక్షలు విధించాలని రాష్ట్రానికి హైకోర్టు ఆదేశం

ప్రజాపక్షం/హైదరాబాద్‌ : పలు దేశాలను గడగడలాడిస్తున్న ఒమిక్రాన్‌ వైరస్‌ వ్యాప్తిని ఆదిలోనే అడ్డుకునేందుకు ప్రభు త్వం అంక్షలు విధించేలా ఉత్తర్వులను రెండు లేదా మూడు రోజుల్లో జారీ చేయాలని హైకోర్టు ఆదేశించింది. గత నెల 21న కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలను అమలు చేయాలని ఉత్తర్వులిచ్చింది. కోవిడ్‌ ఒమిక్రాన్‌ వైరస్‌ వ్యాప్తి కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పింది. క్రిస్‌మస్‌,న్యూఇయర్‌,సంక్రాంతి వంటి పండుగలకు జనం గుమిగూడకుండా ఉత్తర్వులను వెలువరించాలని రాష్ట్రానికి ఆదేశాలిచ్చింది. రెండు మూడు రోజుల్లో ఉత్తర్వులు ఇచ్చి జనాన్ని అప్రమత్తం చేయాలని చెప్పింది. గత సంవత్సరం కరోనాపై దాఖలైన పలు పిల్స్‌ను గురువారం చీఫ్‌ జస్టిస్‌ సతీష్‌చంద్రశర్మ, జస్టిస్‌ తుకారాంజీల డివిజన్‌ బెంచ్‌ విచారణ జరిపింది. పిటిషనర్ల లాయర్లు వాదిస్తూ, క్రిస్‌మస్‌, కొత్త సంవత్సరం, సంక్రాంతి పండుగలు రాబోతున్నాయని, జనం వేడుకల్లో పాల్గొనేందుకు పెద్ద ఎత్తున గుమిగూడితే వైరస్‌ వ్యాప్తి వల్ల ప్రతికూల పరిణామాలు తీవ్రంగా ఉంటాయని చెప్పారు. ఇప్పడు జనం చాలా మంది మాస్క్‌లు పెట్టుకోవడం లేదని, వైరస్‌ వ్యాప్తి అయితే ప్రమాదఘంటికలు మోగే అవకాశాలు ఉంటాయని చెప్పారు. ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోతే పలు దేశాల్లో నెలకొన్న పరిస్థితులు ఏర్పడే అవకాశాలు ఉండవచ్చునని ఆందోళన వ్యక్తం చేశారు. న్యాయవాదుల ఆందోళనను అర్ధం చేసుకోదగ్గదని, ఆంక్షలను విధించకపోతే పరిణామాలు చేజారిపోయే అవకాశాలు ఉంటాయని హైకోర్టు వాఖ్యానించింది. ఇతర రాష్ట్రాల నుంచి దేశవిదేశాల నుంచి వచ్చే వాళ్లకు స్క్రీనింగ్‌ పరీక్షలు నిర్వహించాలని చెప్పింది. రైల్వే, బస్సు స్టేషన్లల్లో పరీక్షలు చేయాలని చెప్పింది. దిల్లీ, మహారాష్ట్ర తరహాలో ఆంక్షలు అమలు చేయాల్సిన అవసరం ఉందని చెప్పింది. ఒమిక్రాన్‌ వైరస్‌ వ్యాప్తి కారణంగా పరిస్థితులను అధ్యయనం చేసి రాష్ట్రాలను అప్రమత్తం చేసేందుకు కేంద్ర సర్కార్‌ టీమ్స్‌ ఏర్పాటు చేసిందని గుర్తు చేసింది. ఈ టీమ్స్‌ ఇచ్చే సలహాలు, సూచనలను ప్రభుత్వం అమలు చేయాలని ఆదేశించింది. సమగ్ర వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని రాష్ట్రాన్ని ఆదేశించింది. విచారణను జనవరి 4న జరుపుతామని ప్రకటించింది.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments