పురోగతిలో రూ.834 కోట్ల వ్యయంతో ప్రాజెక్ట్‌లు
సామాజిక దూరం పాటిస్తూ పనులు
పనుల్లో ఎక్కువ యంత్రాలు తక్కువ మంది కార్మికులు
హైదరాబాద్ : కరోనా వైరస్ నిర్మూలించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్ అమలు చేస్తున్న అవకాశాన్ని మహానగర పాలక సంస్థ(జిహెచ్‌ఎంసి) స్వద్వీనియోగం చేసుకోవాలని నిర్ణయించింది. లాక్‌డౌన్ కారణంగా నగరంలో రహదారులపై ట్రాఫిక్ లేకపోవడంతో భారీ ప్రాజెక్ట్ పనులకు పోలీసుల అనుమతులు లేకుండా పనులు జరిపేందుకు మార్గం సుగమమైంది. జంక్షన్ రహిత రహదారులను తీర్చిదిద్దడానికి చేపట్టిన వ్యూహాత్మక రహదారుల అభివృద్ది కార్యక్రమం(ఎస్‌ఆర్‌డిపి) ద్వారా రూ.2399 కోట్ల వ్యయంతో ఫ్లైఓవర్లు, ఎలివేటెడ్ కారిడార్లు, రోడ్ అండర్ బ్రిడ్జిలు, కేబుల్ బ్రిడ్జి నిర్మాణ పనులను బల్దియా అధికారులు వేగం పెంచారు. జిహెచ్‌ఎంసి ఇంజనీరింగ్(ప్రాజెక్ట్) విభాగం చేపట్టిన ఈ పనులలో దాదాపు రూ.1500 కోట్ల విలువైన వివిధ రకాల ప్యాకేజీ పనులు ఇప్పటి వరకు పూర్తయ్యాయి. వేగంగా పూర్తిచేసేందుకు బిల్లుల చెల్లింపులలో జాప్యాన్ని, నిధుల కొరతను అదిగమించేందుకు ఎస్.బి.ఐ బాండ్స్ ద్వారా రూ.2,500 కోట్లను జిహెచ్‌ఎంసి సేకరించిన విషయం తెల్సిందే. బాండ్స్ నుండి రూ.500 కోట్లు, జిహెచ్‌ఎంసి నిధుల నుండి రూ.370 కోట్ల బిల్లులను ఇప్పటి వరకు అధికారులు చెల్లించారు. మరో రూ.200 కోట్ల విలువైన బిల్లులను చెల్లించేందుకు సిద్దం చేశామని అధికారులు తెలిపారు. ప్రస్తుతం నెలకొన్న లాక్‌డౌన్ నేపథ్యంలో కార్మికులు, చుట్టుప్రక్కల నివసిస్తున్న ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఉండని ప్రాంతాల్లో రూ.834 కోట్ల విలువైన 11 ఎస్.ఆర్.డి.పి పనులను పూర్తిచేసేందుకు నిర్మాణ సంస్థలతో కలిసి జిహెచ్‌ఎంసి అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. నిర్దేశించిన కాలంలోపు ఈ పనులను పూర్తిచేసేందుకు ఇదే సరైన సమయమని అధికారులు భావిస్తున్నారు. ట్రాఫిక్ నియంత్రణ, మళ్లింపు సమస్య లేనందున నిరాటంకంగా రేయింబవళ్లు పనులు కొనసాగిస్తున్నారు. అయితే కోవిడ్-19 వ్యాప్తి నిరోదించేందుకు ప్రభుత్వం సూచించిన అన్ని ముందు జాగ్రత్తలను పని ప్రదేశంలో అమలు చేస్తున్నామని అధికారులు అంటున్నారు. ఎక్కువగా యంత్రాలను ఉపయోగించి, తక్కువ మంది కార్మికులతో సామాజి దూరాన్ని పాటిస్తూ పనులు చేయిస్తున్నామని అధికారులు చెప్పారు. కార్మికుల భద్రతకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇంజనీరింగ్ విభాగం చీఫ్ ఇంజనీర్‌తో పాటు ఎస్.ఇ.లు, ఇ.ఇలు, డి.ఇలు, సైట్ ఇంజనీర్లు నిర్మాణా పనులను పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుత కరోనా వైరస్ ప్రభలుతున్న క్లిష్టమైన పరిస్థితుల ద్వారా వచ్చిన అవకాశాన్ని సద్వీనియోగం చేసుకునేందుకు జిహెచ్‌ఎంసి తీసుకున్న చొరవతో నిర్మాణ సంస్థలు పనులు పూర్తి చేసేందుకు అవసరమైన యంత్రాలను, కార్మికులను పని ప్రదేశాల్లో వినియోగిస్తున్నారు. అయితే అన్ని పనులను నిలిపివేయాలని విధానపరమైన నిర్ణయం తీసుకున్న ఎల్ అండ్ టి సంస్థతో పాటు, వివిధ ప్యాకేజీల ద్వారా చైనాతో అనుబంధం కలిగిన సంస్థలు చేపట్టిన ఎలక్ట్రికల్ పనులు మాత్రం పూర్తిగా నిలిచిపోయాయి.
లాక్‌డౌన్ పరిస్థితుల్లో ఏర్పడిన సానుకూలతతో ముమ్మరంగా జరుగుతున్న ఎస్.ఆర్.డి.పి పనులు
క్ర.సంఖ్య ప్రదేశం/జరుగుతున్న పని పేరు మొత్తం పని విలువ లక్షల్లో 2020 జూన్ లోపు పూర్తి చేయాల్సిన పని విలువ లక్షల్లో ఇప్పటి వరకు జరిగిన పని విలువ
1 ఎల్.బి.నగర్ జంక్షన్ ఒకవైపు ఫ్లై ఓవర్ & ఒక అండర్ పాస్ 7685 4288 3801
2 నాగోల్ జంక్షన్ ఆరులేన్‌లు ఫ్లై ఓవర్ 6256 1455 1405
3 కామినేని జంక్షన్ మూడు లేన్‌ల ఫ్లై ఓవర్ 6320 4827 4086
4 బైరమాల్ గూడ జంక్షన్ మూడు లేన్‌ల ఫ్లై ఓవర్ 12555 3368 2635
5 ఓవైసీ ఆసుపత్రి జంక్షన్ మూడు లేన్‌ల ఫ్లై ఓవర్ 5151.56 3090.936 1675.13
6 బహదూర్ పుర జంక్షన్ ఆరులేన్‌ల ఫ్లై ఓవర్ 4014.42 562.02 292.42
7 బయో డైవర్సిటీ జంక్షన్ మూడులేన్‌ల ఫ్లై ఓవర్ 6841.60 6841.60 6455.88
8 రోడ్ నెం.45లో నాలుగులేన్‌ల ఎలివేటెడ్ కారిడార్ 8487.82 8200 7205.75
9 ఓ.యు కాలనీ షేక్‌పేట్ ఆరులేన్‌ల ఫ్లై ఓవర్ 22878 10100 7733.19
10 హైటెక్ సిటి ఎంఎంటిఎస్ ఆర్‌యుబి ఆరులేన్‌ల రైల్వే అండర్ బ్రిడ్జి 2761.30 520 323.00
11 పంజాగుట్ట శ్మశాన వాటిక స్టీల్ బ్రిడ్జి 493.87 400 35.5
మొత్తం రూ. 83444.57 43652.556 35647.87
రూ.834 కోట్ల 44లక్షలతో చేపట్టిన ఈ 11 ఎస్.ఆర్.డి.పి పనులలో ఇప్పటి వరకు రూ.356 కోట్ల 47 లక్షల విలువైన పనులు పూర్తి అయ్యాయి. 2020 జూన్ నెలాఖరులోపు రూ.436 కోట్ల 52 లక్షల విలువైన పనులను పూర్తిచేయాలని ప్రభుత్వం లక్ష్యం నిర్దేశించింది. తదనుగుణంగా లాక్‌డౌన్ ద్వారా ఏర్పడిన వెసులుబాటును నిర్మాణ సంస్థలు స్వద్వీనియోగం చేసుకుంటున్నాయి.