ఇంకా ముందుకెళ్తున్న కమ్యూనిస్టు ఉద్యమం
మార్కిజం, లెనినిజం అజరామరం
లెనిన్ వర్ధంతి సభలో కూనంనేని
ప్రజాపక్షం / హైదరాబాద్ మార్క్సిజం, లెనినిజం అజరామరమని, ప్రపంచ పెట్టుబడిదారీ వ్యవస్థకు ప్రత్యామ్నాయం సోషలిజం మాత్రమేనని సిపిఐ రాష్ర్ట కార్యదర్శి కూనంనేని సాంబశివరావు స్పష్టం చేశారు. శనివారం లెనిన్ 98వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి హైదరాబాద్ మగ్దూంభవన్‌లో సిపిఐ జాతీయ కార్యదర్శి వర్గ సభ్యులు సయ్యద్ అజీజ్ పాషా, రాష్ర్ట కార్యదర్శి కూనంనేని సాంబశివరావు పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సాంబశివరావు మాట్లాడుతూ లెనిన్ చనిపోయే ముందు భారత దేశంలో కమ్యూనిస్టు పార్టీ ఏర్పడిందని, ఆయన
ఉండగానే కొన్ని బృందాలుగా తాష్కెంట్‌లో, ఇతర ప్రాంతాలలో కమ్యూనిస్టు పార్టీ పనిచేసిందన్నారు. ప్రపంచంలో కమ్యూనిజం అజరామరమని నేటికీ రుజువు అవుతోందని అన్నారు. భారత దేశంలో చీలికల వలన కమ్యూనిస్టు ఉద్యమం వెనుకబడిన మాట వాస్తవమేనని, కానీ ఇప్పటికీ సజీవంగా ఉందని, ఇంకా ముందుకెళ్తుందని పేర్కొన్నారు. ప్రపంచంలో పెట్టుబడిదారీ విధానానికి ప్రత్యామ్నాయం సోషలిజమని, సోషలిజం వెలుతురులో ప్రపంచంలో అనేక హక్కులను సాధించామన్నారు. ప్రజల గొంతుకగా కమ్యూనిస్టు పార్టీ ఆయా దేశాలలో నిర్మించడం జరిగిందన్నారు. లాటిన్ అమెరికా ఖండంలో కమ్యూనిస్టులు , సోషలిస్టులు అధికారంలోకి వస్తున్నారని , పక్కనున్న నేపాల్, ఐరోపాలో డెన్మార్క్ దేశాలలో అధికారంలోకి వచ్చారని, రష్యా అమెరికా లాంటి దేశాలలో కమ్యూనిస్ట్ పార్టీల ఓటింగ్ పెరుగుతోందన్నారు . కమ్యూనిజం వైపు దేశ ప్రజలు చూస్తున్నారని, దేశంలోని ప్రజలు కమ్యూనిస్టుల ఏకీకరణ కోరుతున్నారన్నారు. ఆ వైపుగా ప్రయత్నాలు జరుగుతున్నాయని కూనంనేని అన్నారు. మార్క్సిజాన్ని అభివద్ధి చేయడంలో లెనిన్ కషి చేశాడని, అందుకనే మార్క్సిజం లెనినిజం అంటున్నామని, ఈ సిద్ధాంతం అజరామమని సాంబశివరావు అన్నారు. లెనిన్ ఆశించిన సిద్ధాంతాన్ని ప్రజల ముందుకు తీసుకెళ్లి పార్టీని బలోపేతం చేద్దామని వారున్నారు. సిపిఐ జాతీయ కార్యదర్శి వర్గ సభ్యులు సయ్యద్ అజీజ్ పాషా మాట్లాడుతూ ప్రపంచంలో పెద్ద మార్పులో లెనిన్ పాత్ర ఉన్నదని అన్నారు. కార్ల్ మార్క్స్ , ఎంగెల్స్ సిద్ధాంతాన్ని ఆచరణలో విజయవంతంగా చూపించడంలో లెనిన్ పాత్ర గొప్పది అన్నారు. పేద ప్రజల మనోభావాలను సరిగ్గా అర్ధం చేసుకొని, వారికీ అర్ధం అయ్యే భాషలో మాట్లాడితే మనకు దగ్గరవుతారని లెనిన్ చెప్పారని, అది ఎల్లప్పుడూ ఆచరణీయమని పేర్కొన్నారు. ప్రజల యొక్క బాధలను తెలుసుకొని ప్రజల మధ్యన ఉండాలని, ఏది అసాధ్యం కాదని లెనిన్ చెప్పారన్నారు. లెనిన్ రచనలు, ఆయన చేసిన విప్లవాలను తెలుసుకొని ఉద్యమిస్తే కమ్యూనిస్టులకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ర్ట కార్యదర్శి వర్గ సభ్యులు ఎన్ బాల మల్లేష్, వి ఎస్ బోస్, ఏఐవైఎఫ్ జాతీయ ప్రధాన కార్యదర్శి తిరుమలై, ఏఐవైఎఫ్, ఏఐఎస్‌ఎఫ్ రాష్ర్ట అధ్యక్షులు సయ్యద్ వల్లివుల్లా ఖాద్రి, మణికంఠ రెడ్డి, సిపిఐ నాయకులు ప్రేమ పావని, ఛాయాదేవి తదితరులు పాల్గొన్నారు.
వెనుకబడినా సజీవమే
RELATED ARTICLES