పార్లమెంట్ సమావేశాలకు కేంద్రమంత్రులు డుమ్మా
మంత్రుల గైర్హాజరుపై అసహనం వ్యక్తం చేసిన ప్రధాని మోడీ
న్యూఢిల్లీ : పార్లమెంట్ సమావేశాల సందర్భంగా సభకు హాజరుకాని బిజెపి ఎంపిలను ప్రధాని నరేంద్రమోడీ తరుచూ హెచ్చరిస్తు న్న విషయం తెలిసిందే. అయితే ఈసారి ఒక అడుగు ముందుకేసి ఇరు సభల్లోనూ విధులకు గైర్హాజరవుతున్న కేంద్రమంత్రులపై ఆగ్ర హం వ్యక్తం చేశారు. సభలకు హాజరుకాని మంత్రుల సమాచారా న్ని తనకు ఇవ్వాలని మోడీ పార్టీ నాయకత్వాన్ని ఆదేశించినట్లు బిజెపి వర్గాలు పేర్కొన్నాయి. మంగళవారం బిజెపి పార్లమెంటరీ సమావేశం జరిగింది. సమావేశంలో పాల్గొన్న మోడీ సభకు హాజరుకాని కేంద్రమంత్రుల గురించి ఆరా తీశారు. ప్రభుత్వ చట్టబద్ధ ఎజెండా ఆమోదానికి అవసరమైతే ప్రస్తుతం నడుస్తున్న పార్లమెంట్ సమావేశాలను పొడిగించవచ్చని కూడా బిజెపి పార్లమెంటరీ సమావేశంలో మోడీ చెప్పినట్లు వర్గాలు పేర్కొన్నాయి. అయితే షెడ్యూల్ ప్రకారం ఈనెల 26 వరకు పార్లమెంట్ సమావేశాలు జరగనున్నాయని, ఇప్పటికైతే సమావేశాల పొడిగింపు ప్రభుత్వ ఎజెండాలో లేదని తెలిపాయి. కాగా, ప్రభుత్వ ప్రతినిధులుగా మంత్రులు సభల్లో ఉన్నప్పటికీ వారి విధులను కూడా నిర్వర్తించాలని మోడీ ఆదేశాంచారు. అయితే పార్లమెంట్ సమావేశాల సందర్భంగా ఎంపిలు సభకు గైర్హాజరవడంపై గతంలో కూడా మోడీ అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా, బిజెపి పార్లమెంటరీ సమావేశం అనంతరం పార్లమెంటరీ వ్యవహారాలశాఖమంత్రి ప్రహ్లాద్ జోషి మీడియాతో మాట్లాడారు. తమతమ నియోజకవర్గాల అభివృద్ధి కోసం ఎంపిలు కీలక పాత్ర పోషించాలని మోడీ ఆదేశించారన్నారు. నీటీ సమస్య అనేది ప్రజల దృష్టిలో పెద్ద సమస్య అని, దీనిపై దృష్టి సారించి పరిష్కార మార్గాలను కనుక్కోవాలని ఎంపిలకు సూచించారన్నారు. రాజకీయాలను పక్కనపెట్టి తమ తమ నియోజకవర్గాలలో పర్యటిస్తూ నీటి సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించాలని హితబోధ చేసినట్లు ప్రహ్లాద్ చెప్పారు. ఎంపిలు మానవతా దృక్పథంతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని, వెనుకబడిన జిల్లాల్లో అభివృద్ధి పనులు కొనసాగించేలా చూడాలని ప్రధాని చెప్పారన్నారు. సాధారణ ప్రజలకు ఉపయోగపడే పనులపై ఎంపిలు దృష్టిపెట్టాలన్నారు. టిబి పూర్తిస్థాయిలో నివారణకు దృష్టి సారించాలని ప్రధాని పేర్కొన్నట్లు ప్రహ్లాద్ వెల్లడించారు. 2025 నాటికి దేశంలో టిబి లేకుండా చేయాలని, ప్రజా ఉద్యమంగా చేపట్టిన జల సంరక్షణ ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని, బిజెపి సభ్యత్వ నమోదు గతేడాది కంటే 10 శాతం పెరగాలనేది లక్ష్యంగా పెట్టుకోవాలని సూచించారు.
వీళ్ల్లూ మంత్రులేనా?
RELATED ARTICLES