అభినందన్‌కు మాతృభూమి జేజేలు
న్యూఢిల్లీ: భారత్ గగనతల పోరాటంలో బు ధవారం అధునాతన ఎఫ్16ను కూల్చిన క్రమంలో తన విమానాన్ని కోల్పోయి పాకిస్థాన్ చేతిలో బందీ అయిన భారత వైమానిక పైలెట్ వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్‌ను పాకిస్థాన్ శుక్రవారం రాత్రి 9 గంటలకు వాఘా సరిహద్దు వద్ద భారత వైమానిక దళాధికారులకు అప్పగించింది. వీరయోధునికి ఘనస్వాగతం పలికేందుకు మధ్యాహ్నం నుంచి అక్కడికి చేరిన వేలాది భారతీయులు చేరుకున్నారు. కానీ పాకిస్థాన్ అభినందన్‌ను వదిలే సమయాన్ని రెండు మార్చి చాలా మందిని నిరుత్సాహపరిచింది. బందీ అయిన ఆయన మూడు రోజు ల్లో విడుదల కావడం అరుదైన విషయం. అంతర్జాతీయ ఒత్తిడితో పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ విడుదల ప్రకటన చేశారని భావిస్తున్నప్పటికీ ఈ శాంతి ‘సుహృద్భావ చర్య’ రెండు పొరుగు దేశాల మధ్య ఉద్రిక్తతల సడలింపుకు దోహదం చేస్తుందని ప్రపంచ దేశాలు భావిస్తున్నాయి. భారత, పాకిస్థాన్‌లను వేరు చేసే అట్టారి బార్డర్‌లో వందలాది మీడియా సిబ్బంది అభినందన్ స్వదేశాగమన కవరేజికి మధ్యాహ్నం నుంచే వేచి చూశారు. చాలా మంది ప్రజలు ఆయనకు ఘనస్వాగతం పలికేందుకు డోలుబాజాలతో ఉత్సాహంగా నిరీక్షించారు. చాలా మంది టివిలకు అతుక్కుపోయి ఏమవుతుంది అన్న ఆతురుతతో ఎదురుచూశారు. టివి యాంకర్లు నిరంతరం వ్యాఖ్యానంతో అభినందన్ స్వదేశాగమనం కార్యక్రమాన్ని కొనసాగించారు. ఆయన ఎప్పుడు ఎలా విడుదల కానున్నారన సమాచారం కోసం జర్నలిస్టులు వేచి కూర్చున్నారు. అయితే ప్రభుత్వం కూడా ఎలాంటి ప్రకటనలు చేయకుండా కామ్‌గా ఉండిపోయింది. రోజంతా దేశవ్యాప్తంగా ప్రజ ల్లో ఓ దేశభక్తి మూడ్ చోటుచేసుకుంది. చాలా మంది త్రివర్ణ పతాకాన్ని పట్టుకుని రెపరెపలాడించారు. అహ్మదాబాద్‌లో గర్బ నృత్యం, బెంగళూరులో డ్యాన్సు లు, పంజాబ్‌లో దేశభక్తి గీతాలతో ప్రజలు ఉత్సాహన్ని చూపుతూ వచ్చారు. పూరీలో ఓ శిల్పి సైకత చిత్రాన్ని అభినందన్‌తో చిత్రీకరించారు. అట్టారీ-వాఘా బార్డర్ చెక్‌పోస్ట్ వద్దనైతే ఓ సంబర వాతావరణమే కనిపించింది. అభినందన్ ఓసారైనా చూడాలన్న ఉత్సా హం చాలామందిలో కనిపించింది. 20వేలకు పైగా ప్రజలు సమావేశం కావడంతో భద్రత దృష్ట్యా భారతీయ సైనికాధికారులు బార్డర్ చెక్‌పోస్ట్ వద్ద రోజువారీ రిట్రీట్ సెర్మనీ(కవాతు)ను కూడా రద్దు చేసేశారు.