వ్యవసాయ రంగంపై కరోనా తీవ్ర ప్రభావం
వ్యవసాయోత్పత్తుల విక్రయాలకు అడ్డంకులు
మండిపడుతున్న మాస్క్‌ల ధరలు.. దొరకని శానిటైజర్లు, లోషన్లు
ప్రజాపక్షం/ ఖమ్మం బ్యూరో: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా ప్రభావం రాష్ట్రంలో వ్యవసాయ రంగం మీద తీవ్ర ప్రభావం చూపే పరిస్థితులు కన్పిస్తున్నాయి. వైరస్ తీవ్రత పెరిగే కొద్ది ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు రైతులకు ఇబ్బందికర పరిస్థితులు తెచ్చిపెట్టనున్నాయని ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే ప్రభుత్వ నిబంధనల కారణంగా వ్యవసాయ ఉత్పత్తులను విక్రయించే పరిస్థితి కన్పించడం లేదు. వ్యవసాయ మార్కెట్లు బంద్ ప్రకటిస్తే ఏమిటన్నది రైతాంగానికి అంతు చిక్కడం లేదు. ఇప్పటికే యాసంగి ధాన్యం కొనే పరిస్థితి లేదు. గతంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో విక్రయించుకునే వారు ఇప్పుడు అధికార యం త్రాంగం పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయకపోవడంతో ధాన్యం రైతులు ఇబ్బందులు పడుతుండగా మొక్కజొన్న రైతులది దయనీయ పరిస్థితి. ఈ ఏడాది మొక్కజొన్న సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. ఖరీఫ్‌లో సకాలంలో వర్షాలు పడకపోవడం, ప్రాజెక్టులలోకి నీరు రాకపోవడంతో రబీలో రైతులు మొక్కజొన్న సాగుపై దృష్టిపెట్టారు. ప్రాజెక్టులు అన్ని నిండుకోవడం, సమృద్దిగా భూగర్భ జలం ఉండడంతో రైతులు మొక్కజొన్న సాగు చేశారు. ఇప్పుడు చేతికొచ్చిన మొక్కజొన్నలను కొనుగోలు చేసే పరిస్థితి లేదు. గతేడాది క్వింటా రూ.2వేల పైచిలుకు పలుకగా ఈ ఏడాది రూ.1,000లకు అడుగుతుండడం శోచనీయం. గతంలో మొక్కజొన్నలను మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు చేసేవారు. ఇప్పుడు మార్క్‌ఫెడ్ రంగంలోకి వచ్చే పరిస్థితి లేదు. ప్రభుత్వం మార్క్‌ఫెడ్‌కు డబ్బులు కేటాయిస్తే తప్ప మార్క్‌ఫెడ్ కొనుగోలు కేంద్రాలను తెరిచి రైతుల వద్ద మొక్కజొన్నలను కొనుగోలు చేసే పరిస్థితి లేదు. రాష్ట్ర ప్రభుత్వం మొక్కజొన్నల కొనుగోలుకు సంబంధించి తక్షణం మార్క్‌ఫెడ్‌కు ఆదేశాలు జారీ చేయాలని రైతాంగం కోరుతుంది. కరోనాకు సామాన్యులు సైతం భయపడుతుండడం, గుంపులుగా పొగుపడద్దన్న ప్రభుత్వ ఆదేశాలు రైతాంగానికి ఇబ్బందికరంగా మారాయి. వ్యవసాయ ఉత్పత్తులు పొలాల్లోనే మిగిలిపోవడం, మిర్చి కోతకు కూలీలు దొరకకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఇక పట్టణాల్లో పనిచేసే దినసరి కూలీల పరిస్థితి దయనీయంగా మారింది.