HomeNewsTop Newsవీడని మత్తు

వీడని మత్తు

పట్టుబడుతున్నది ఇంత – అసలు దొరకనిది ఎంత?
తీరు మారుతున్న గంజాయి విక్రయాలు
ద్రవ రూప, సిగరెట్లు, చాక్లెట్లుగా అమ్మకాలు
మత్తుకు బానిస అవుతున్న యువత
ప్రజాపక్షం/ ఖమ్మం
ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకున్నా ప్రస్తుత సమాజాన్ని మత్తు బలహీనత పట్టి పీడిస్తున్నది. ఒకప్పుడు మద్యం అలవాటునే ప్రమాదకరంగా భావించిన సమాజం ఇప్పుడు గంజాయి రవా ణా, అమ్మకాలకు సంబంధించి ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఈ మత్తు అమ్మకాల గురించి గతంలో పెద్ద పెద్ద నగరాల్లో మాత్రమే జరుగుతుండేది లేదంటే కొంత మంది సన్యాసులు ఈ గంజాయిని సేవించే వారు. అటువంటిది రాను రాను 40ఏళ్ల లోపు యువత మత్తుకు బానిస అవుతుంది. కోకైన్‌, ఇతర మత్తు పదార్థాల కంటే ఇప్పుడు గంజాయి సాగు, రవాణా, విక్రయాలు తీవ్ర రూపం దాల్చాయి. ఒకప్పుడు ఎండు గంజాయిని పీల్చి ఒక రకమైన మత్తుకు గురయ్యేవారు.ఇప్పుడు ఎండు గంజాయి స్థానంలో గంజాయి చాక్లెట్లు, సిగరెట్లు కూడా వచ్చాయి. ఖమ్మంలో ఒక ముఠా పట్టుబడితే దాదాపు రూ. 20 లక్షల గంజాయి చాక్లెట్లు వారి వద్ద లభ్యమయ్యాయంటే పరిస్థితి ఏవిధంగా ఉందో అవగతమవుతుంది. నాలుగేళ్ల నుంచి తెలంగాణలోకి ఆంధ్రా నుంచి విపరీతంగా గంజాయి సిగరెట్ల రవాణా జరుగుతుంది. ఇప్పటికే యువత బానిసై సిగరెట్లు దొరకని నాడు విలవిలలాడిపోతున్నారు. తల్లాడ మండలంలో ఓ యువకుడు మత్తుకు బానిసై ఆ తర్వాత సిగరెట్లు దొరకక, కొనే స్థోమత లేక ఉరి పెట్టుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇదే పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల చోటు చేసుకోవడం దయనీయం.
డబ్బుల కోసం రవాణా : గంజాయి వ్యాపారులు ఎప్పుడు పోలీసులకు చిక్కరు. ఉత్పత్తి దారులది సైతం ఇదే పరిస్థితి. ఎప్పుడు, ఎక్కడ కనపడరు, బయటకు రారు, ఏ కేసులలోనూ వీరు చిక్కుకోరు. ఛత్తీస్‌గఢ్‌, ఆంధ్రా, ఒడిశా సరిహద్దుల్లో పండించిన గంజాయిని కేజీల చొప్పున వారు విక్రయిస్తారు. అక్కడ కేజీ గంజాయి రూ. 1500 ఉంటే హైదరాబాద్‌లో ఉంటే రూ.10వేల పైమాటే. కాకపోతే రవాణా కష్టం. అందు కోసం అధిక మొత్తం డబ్బును ఎర చూపి యువతను గంజాయి రవాణాలోకి దింపుతున్నారు. ప్రత్యేక వాహనాలతో పాటు బస్సులు, మోటార్‌ సైకిళ్లు, ఇతరత్రా పద్దతుల్లో గంజాయి రవాణా చేస్తూ పట్టుబడి జైళ్ల పాలవుతున్నారు. ఇంజనీరింగ్‌ పూర్తి చేసి హైదరాబాద్‌లో ఓ సాప్ట్‌వేర్‌ కంపెనీలో పని చేస్తున్న యువకుడు డబ్బులకు ఆశపడి గంజాయి రవాణాకు అంగీకరించాడు. ఒకట్రెండు సార్లు సురక్షితంగా గంజాయిని చేర్చడం అధిక మొత్తంలో డబ్బులు రావడంతో ఉద్యోగం కంటే ఇది బాగుందన్న ఆలోచన ఆ యువకుని మదిలో మెదిలింది. అంతే అతి ఆశ చివరకు కష్టాల పాలు చేసింది. ఇప్పుడు జైలులో మగ్గుతూ భవిష్యత్తును నాశనం చేసుకున్నాడు. ఇది ఒక్క యువకునికి సంబంధించింది కాదు అనేక మంది యువకులు డబ్బు ఆశకు విలువైన జీవితాలను కోల్పోతున్నారు. కొంత మంది జైలు జీవితాలను, దయనీయ స్థితిని చూసినా ఇంకా ఆ వృత్తిలోకి వెళ్తుండడం శోచనీయం.
కఠిన చర్యల దిశగా ప్రభుత్వం :
గంజాయి రవాణా, విక్రయాలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్దమైంది. వరుస దాడులు, నిఘా పెంచడంతో పలువురు పట్టుబడుతున్నారు. కానీ ఎక్సైజ్‌, పోలీసులకు దొరికే గంజాయి కంటే కొన్ని వందల రేట్లు గల గంజాయి గమ్యస్థానాలకు రహస్యంగా చేరుతుందన్న భావన సర్వత్రా వ్యక్తమవుతుంది. ఒక 10 కేజీల గంజాయి దొరికిందంటే దాదాపు 200 నుంచి 300 కేజీల గంజాయి గమ్య స్థానాలకు చేరుతుందనే భావన వ్యక్తమవుతుంది. గంజాయిని పండించే ప్రాంతాలు ఇతర రాష్ట్రాల్లో ఉండడం, రాష్ట్ర సరిహద్దుల వద్ద సరైన నిఘా లేకపోవడం గంజాయి విస్తృత రవాణాకు కారణమవుతుంది.
విఫలమవుతున్న ఎక్సైజ్‌ శాఖ :
గంజాయి అక్రమ రవాణాను అరికట్టడంలో ఎక్సైజ్‌ శాఖ పూర్తిగా విఫలమైంది. పోలీసుల నిఘాలో పట్టుబడుతున్నదే కానీ ఎక్సైజ్‌ శాఖ దాడుల్లో పట్టుబడుతున్న గంజాయి అతి స్వల్పం. ఉమ్మడి ఖమ్మంజిల్లా ఛత్తీస్‌గఢ్‌, ఆంధ్రా రాష్ట్రాలకు తెలంగాణ ముఖ ద్వారంగా ఉంది. ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌లోని ఏజెన్సీ ప్రాంతాల నుంచి గంజాయి హైదరాబాద్‌, బెంగళూరు, ఢిల్లీ, ముంబాయ్‌ నగరాలకు ఉమ్మడి ఖమ్మంజిల్లాల నుంచే వెళ్లాల్సి ఉంది. ఉమ్మడి ఖమ్మంజిల్లా ఎక్సైజ్‌ అధికారుల ఉదాసీన వైఖరి కారణంగా యధేచ్చగా గంజాయి తరలిపోతుందన్న ఆరోపణలు వినవస్తున్నాయి. ఉమ్మడి ఖమ్మంజిల్లా సరిహద్దుల వద్ద సరైన నిఘా ఏర్పాటు చేసి కట్టడి చేయగలిగితే కొంత మేర రాష్ట్రంలోకి గంజాయి రాకను అరికట్టవచ్చునని ప్రజలు భావిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఉమ్మడి ఖమ్మంజిల్లా ఎక్సైజ్‌ శాఖను ప్రక్షాళన చేయాలని ప్రజలు కోరుతున్నారు. మత్తుకు యువతను దూరం చేసేందుకు గ్రామ గ్రామాన ప్రభుత్వం ఆధ్వర్యంలో అవగాహన సదస్సులు, సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వమే ఒక ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని చేపట్టాలని కోరుతున్నారు. ముఖ్యంగా 40 ఏళ్ల లోపు యువతకు, విద్యార్థులకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించడం తక్షణ అవసరంగా ప్రభుత్వం గుర్తించాల్సి ఉంది.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments