మంత్రివర్గ ఏర్పాటు తేదీలపై కొనసాగుతున్న సస్పెన్స్
టిఆర్‌ఎస్ నేతలకూ తెలియని వైనం
ప్రజాపక్షం/హైదరాబాద్: రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ తేదీపై సస్పెన్స్ కొనసాగుతోంది. సిఎం కెసిఆర్ రెండవసారి డిసెంబర్ 13వ తేదీన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి, తనతో పాటు ఎంఎల్‌సి మహమూద్ అలీ ని మాత్రమే కేబినెట్‌లోకి తీసుకున్నారు. ఇప్పటి కీ 57 రోజులు గడిచినా మంత్రివర్గ విస్తరణ జాడే లేదు. నాటి నుండి మంత్రివర్గ విస్తరణకు సంబంధించిన తేదీలపై మీడియాలో పలు ఊహాగానాలు వచ్చినా, వాస్తవ రూపం దాల్చలేదు. మరోవైపు మాజీ మంత్రులు, టిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎలకు సైతం మంత్రివర్గ విస్తరణపై ఎలాంటి సమాచారం లేదు. అధికార పార్టీలో ఎవరిని కదిలించినా తమకేమి తెలియదంటున్నారు. తాజా గా ఈ నెల 8 లేదా 10వ తేదీలలో మంత్రి వర్గ విస్తరణ జరుగుతుందని ప్రచారం సాగుతున్నప్పటికీ అధికారికంగా ఎలాంటి సమాచారం లేదు. వాస్తవానికి పంచాయతీ ఎన్నికలకు ముందే మంత్రివర్గ విస్తరణ జరుగుతుందని అందరు భావించారు. ఎన్నికలు రావడంతో అవి పూర్తవగానే ఫలితాల ఆధారంగా మంత్రివర్గంలో బెర్త్‌లు ఉంటాయనుకున్నారు. పంచాయతీ ఎన్నికల ఫలితాలు వచ్చి వారం గడిచినా మంత్రివర్గ విస్తరణపై అధినేత అంతరంగం తెలియక టిఆర్‌ఎస్‌లో ఆశావాహులు గుంభనంగా ఉంటున్నారు. అయితే, పూర్తి స్థాయి స్థాయిలో క్యాబినెట్ మాత్రం ఉండదని అందరూ భావిస్తున్నారు. రాజ్యాంగ నిబంధన ప్రకారం శాసనసభ్యుల సంఖ్యలో 15 శాతం మందికి మాత్రమే మంత్రివర్గంలో అవకాశం ఉంటుంది. దాని ప్రకారం మన రాష్ట్ర క్యాబినెట్‌లో 18 మందికి ఆమాత్య యోగానికి అవకాశం ఉన్నది. ఇప్పటికే సిఎం, హోం మంత్రి పోగా మంత్రివర్గంలో 16ఖాళీలు ఉన్నాయి. విస్తరణలో కూడా కొన్ని ఖాళీలు ఉంచి, పార్లమెంటు ఎన్నికల తరువాత భర్తీ చేసే అవకాశం ఉన్నది. ఇక మంత్రి వర్గ కూర్పు విషయంలో కూడా రకరకాల ఊహాగానాలు సాగుతున్నాయి. అయితే మాజీ మంత్రుల్లో సగానికి పైగా అవకాశం ఉండదని తెలుస్తోంది. చాలా మంది కొత్తవారికి ఈసారి చోటు దక్కనుంది. మంత్రివర్గంలో స్థానం ఖాయమని భావిస్తున్న వారిలో ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎస్.నిరంజన్‌రెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్, వి.శ్రీనివాస్‌గౌడ్, పద్మా దేవేందర్‌రెడ్డి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.
చివరి వారంలో శాసనసభ : ఈ నెల చివరి వారంలో శాసనసభ సమావేశాలు నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. ఈ సమావేశంలో ఓటాన్ అకౌంట్‌ను ప్రవేశపడతారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వ మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టడంతో,రాష్ట్ర ప్రభుత్వం కూడా ఓటాన్ అకౌంట్‌పై కసరత్తు ప్రారంభించింది. ఇప్పటికే సిఎం కెసిఆర్ పలుమార్లు ఆర్థిక శాఖ, వివిధ శాఖల ఉన్నతాధికారులతో బడ్జెట్‌పై సమావేశం ఏర్పాటు చేసి పలు సూచనలు చేశారు. ఈసారి శాసనసభసమావేశాలువారంరోజుల పాటు ఉండేఅవకాశముంది.