కొందరి మెదళ్లలో మూసీ మురికి కంటే విషమే ఎక్కువ
- మూసీ పరీవాహక ప్రాంత ప్రజలకు మెరుగైన జీవితం అందించాలన్నదే లక్ష్యం
- ఇది సుందరీకరణ ప్రాజెక్టు కాదు ‘మూసీ’ పునరుజ్జీవం
- నదీ సుందరీకరణకు రూ.1.50 లక్షల కోట్లు అంటూ అసత్య ప్రచారం
- ఇప్పటివరకు ప్రభుత్వం ఖర్చుచేసింది కేవలం రూ.141
- కోట్లే కొందరు సృష్టించే అపోహలు నమ్మొద్దు
- చర్చించేందుకు అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయిస్తా
- ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వెల్లడి
- మూసీ పునరుజ్జీవంపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్
ప్రజాపక్షం/హైదరాబాద్
“బందిపోటు దొంగల వలే పదేళ్లు తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకున్నవారు మూసీ పునరుజ్జీవనాన్ని అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్నారు. సుందరీకరణ అంటూ కాస్మోటిక్ కలర్ అద్దాలని చూస్తున్నారు. వాళ్ల మెదడులో మూసీ మురికి కంటే ఎక్కువ విషం నింపుకున్నారు. అధికారం కోల్పోయిన నిస్పృహతో కొందరు ఏదేదో మాట్లాడుతున్నారు” అని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నది మూసీ సుందరీకరణ ప్రాజెక్టు కాదని, ‘మూసీ నది పునరుజ్జీవన’మని, మూసీ మురికి నుంచి ప్రజలను కాపాడి వారి జీవన ప్రమాణాలను మెరుగు పరచాలనేదే ప్రభుత్వ ఆలోచన అని, మూసీ నది గర్భంలో ఎలాంటి కట్టడాలు ఉండవని, నది పక్కన ఉన్న ప్రభుత్వ స్థలాల్లో అభివృద్ధి కట్టడాలు ఉంటాయని సిఎం స్పష్టం చేశారు. మూసీ పునరుజ్జీవనం అనే గొప్ప కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి. అసూయ, ద్వేషంతో కొందరు సృష్టించే అపోహలను నమ్మవద్దని ప్రజలకు, మీడియాకు సిఎం విజ్ఞప్తి చేశారు. సచివాలయంలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిఎం రేవంత్‌రెడ్డి మూసీ పునరుజ్జీవంపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ప్రభుత్వ ఉద్దేశ్యాన్ని వివరిస్తూనే, ప్రతిపక్ష పార్టీ బిఆర్‌ఎస్ చేస్తున్న ఆరోపణలు, విమర్శలపై ఆయన తీవ్రంగా స్పందించారు. సమావేశంలో మంత్రులు డి.శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, రాష్ట్ర ప్రణాళిక సంఘం పాధ్యక్షులు డాక్టర్ జి.చిన్నారెడ్డి, ఎంపిలు, ఎంఎల్‌సిలు, వివిధ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ మూసీ సుందరీకరణ అంటూ ఇందుకు రూ.1.50 లక్షల కోట్లు ప్రభుత్వం ఖర్చు చేస్తోందటూ బిఆర్‌ఎస్ అసత్య ప్రచారం చేస్తోందని సిఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. మూసీ నది పునరుజ్జీవనానికి ఇప్పటివరకు ప్రభుత్వం ఖర్చు చేసింది కేవలం రూ.141 కోట్లు మాత్రమేనని, ఇది కూడా పూర్తి ప్రాజెక్టు రిపోర్టు డిపిఆర్‌ను సిద్దం చేసేందుకు కన్సలెంట్ సంస్థలకు చెల్లించేందుకు మాత్రమేనని సిఎం వివరించారు. మూసీ పునరుజ్జీవనానికి ఆరున్నర ఏళ్లు గడువు లక్ష్యంగా నిర్ధేశించుకున్నామని, ప్రపంచంలోనే పేరెకగన్న ఐదు కపెంనీలను మూసీ పునరుజ్జీవం కోసం వినియోగించుకుంటున్నామని, 18 నెలల్లో డిపిఆర్‌ను సిద్దంచేసి ఇస్తారని, ఆ తర్వాత ప్రాజెక్టు వ్యయం, నిధుల సేకరణ, అమలు తదితర ఆంశాలపై స్పష్టత వస్తుందని సిఎం వివరించారు. మూసీ పునరుజ్జీవనం ప్రాజెక్టుపై విమర్శలు చేస్తున్న ప్రతిపక్షాలు రెండు రోజుల పాటు శనివారం వరకు మీ సలహాలేమిటీ, ప్రభుత్వం ఇంకా ఏమీ చేయాలి? అనే విషయాలపై నిర్మాణాత్మక సూచనలు ఇవ్వాలని సిఎం కోరారు. మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టుపై ఎంఐఎం, బిజెపి, బిఆర్‌ఎస్‌ల అధ్యక్షులు, కమ్యూనిస్టు పార్టీల నేతలకు ఎలాంటి అనుమానాలు ఉన్నా లిఖితపూర్వకంగా పంపితే ప్రభుత్వం రాతపూర్వక వివరణ ఇవ్వడానికి సిద్ధంగా ఉందని సిఎం చెప్పారు. ఈ ప్రాజెక్టు గురించి చర్చకు అన్ని పార్టీల నేతలను ఆహ్వానించేందుకు ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలను కూడా ఏర్పాటు చేయిస్తానని, న్యాయ కోవిదుల సలహాలు తీసుకుని రాష్ట్ర ఎంపిలను కూడా భాగస్వామ్యం చేయిస్తానని సిఎం చెప్పారు. మూసీ పునరుజ్జీవం ద్వారా టూరిజం డెవలప్‌మెంట్ అవుతుందని, తద్వారా ఆదాయంపెరుగుతుందన్నారు. ఆదాయం పెరిగినప్పుడే ప్రభుత్వానికి సంక్షేమ పథకాలను అమలు చేసేందుకు వీలవుతుందన్నారు. మంత్రుల సబ్ కమిటీ వేసి పర్యావరణ వేత్తల సలహాలు కూడా తీసుకుంటానన్నారు. రాజకీయ నాయకులంతా ఈ కేబినెట్ సబ్ కమిటీలో తమ అభిప్రాయాలు వెల్లడించవచ్చన్నారు. మూసీ పరివాహాక ప్రాంత ప్రజలను నిరాశ్రయులను , అనాథలను చేయడం తమ ఉద్దేశ్యం అసలే కాదన్నారు. వారికి మంచి జీవితాలు ప్రసాదించడంతో పాటు పరిహారం, ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యమన్నారు. ఈ ప్రాజెక్టుపై త్వరలో మీడియా సంపాదకులతో కూడా భేటీ అవుతానని, వారి సలహాలు తీసుకుంటాన్నన్నారు. తెలంగాణ ప్రజల భవిష్యత్ ను, రాష్ట్ర, దేశ ఆర్థిక వ్యవస్థను నిర్దేశించే కార్యాచరణ ప్రభుత్వం తీసుకుందని సిఎం అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా 33 బృందాలు మూసీ పరివాహక ప్రాంతంలో పేదల సమస్యలను తెలుసుకున్నాయి. దుర్గంధంలో దుర్భర జీవితాలను గడుపుతున్న పేదల కష్టాలను తెలుసుకున్నామన్నారు. ప్రపంచంతో పోటీ పడే నగరంగా హైదరాబాద్ ను తీర్చిదిద్దుతామని, ఉపాధి కల్పనతో అక్కడి పేదలను ఆదుకోవాలనే ఆలోచన ప్రభుత్వానికి ఉందన్నారు. మూసీ పరివాహక ప్రాంత ప్రజల సమస్యలు పరిష్కరిస్తూ వారిని తరలించాలనేదే ప్రభుత్వ ఆలోచన అన్నారు. 1600 పైచిలుకు మూసీ ఇండ్లు నదీ గర్భంలో ఉన్నాయని, దసరా నేపథ్యంలో వారికి ఇండ్లు ఇచ్చి, ఖర్చులకు డబ్బులు ఇచ్చి అక్కడి నుంచి తరలించామని, బఫర్ జోన్‌లో ఉన్న 10 వేల కుటుంబాలకు కూడా పునరావాసం కల్పిస్తామని తెలిపారు. మల్లన్న సాగర్, కొండపోచమ్మ బాధితులను దుర్మార్గంగా రాత్రికి రాత్రి ఖాళీ చేయించింది, మిడ్ మానేరు ముంపు బాధితులకు ఇండ్లు ఇస్తామని మోసం చేసింది బిఆర్‌ఎస్ ప్రభుత్వం అన్నారు. కొండపోచమ్మ ప్రాజెక్టులో మునిగిన 14 గ్రామాల్లో ఏ ఒక్కరికైనా ఇండ్లు ఇచ్చారా అని సిఎం ప్రశ్నించారు. ‘ఈ నగరాన్ని అభివృద్ధి చేయడం విపక్షాలకు ఇష్టంలేదా? చరిత్ర కాలగర్భంలో మూసీని సమాధి చేయదలచుకున్నారా? మేం ఉండేది ఐదేళ్లా, పదేళ్లా అనేది ప్రజలు నిర్ణయిస్తారు. ఉప్పెనలా వరదలు వస్తే నగరమే మిగలదు.. ఇదేమైనా గజ్వేల్ ఫామ్ హౌసా, లేక ధరణి లాంటి మాయాజాలమా? ఎవరినో మోసం చేసి ఏదో చేయాలన్న ఆలోచన తమకు లేదు. మూసీ పునరుజ్జీవనం ప్రాజెక్ట్ లో తన స్వార్థం లేదు. ఆదాయాన్ని పెంచి పేదలకు పంచడమే మా ప్రభుత్వ ఆలోచన( అని రేవంత్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్ నగరంలోని అద్భుతమైన చారిత్రక కట్టడాలను కాలగర్భంలో కలిపేయాలని కొందరు కంకణం కట్టుకు తిరుగుతున్నారన్నారు. ఏ సంస్థల గురించి వాళ్లు మాట్లాడుతున్నారో అవే సంస్థలకు వాళ్లు కూడా గతంలో కాంట్రాక్టులు ఇచ్చారని, అప్పుడు లేని అభ్యంతరం మూసీ అభివృద్ధి విషయంలోనే ఎందుకు? వాళ్లు చేస్తే గొప్ప.. మేం చేస్తే తప్పా? అని సిఎం ప్రశ్నించారు.
హరీష్, కెటిఆర్, ఈటల ముగ్గురూ మూడు నెలలు మూసీ ఒడ్డున నివసించాలి
మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టుపై విమర్శలు చేస్తున్న బిఆర్‌ఎస్ నేతలు కెటిఆర్, హరీష్‌రావు, బిజెపి నేత ఈటల రాజేందర్ ముగ్గురూ మూడు నెలలు మూసీ ఒడ్డున నివసించాలని, ఇప్పుడే ఆ ముగ్గురికీ ఇండ్లు కేటాయించాలని అధికారులకు ఆదేశిస్తున్నానని, వారికి భోజన సదుపాయం కూడా ఏర్పాటు చేయాలని, మూసీ పరివాహకం అలాగే ఉండాలనుకుంటే మీరు అక్కడ ఉండి రోల్ మోడల్‌గా నిలవాలని సిఎం రేవంత్‌రెడ్డి అన్నారు. మూడు నెలలు ముగ్గురూ అక్కడ ఉండగలిగితే ప్రభుత్వం ఈ ప్రాజెక్టును విరమించుకుంటామని చెప్పారు. లేదంటే మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలకు ఏం ఇద్దామో చెప్పాలని కెసిఆర్, కెటిఆర్, కిషన్‌రెడ్డి, ఈటల రాజేక్ చెప్పాలని విజ్ఞప్తి చేశారు.
మూసీ నదికి చేసిన ద్రోహం దేశ ద్రోహం కంటే ఇది పెద్ద నేరం
‘మూసీ నదికి పాలకులు చేసిన ద్రోహాన్ని ఇలాగే కొనసాగిద్దామా? మూసీ నదికి చేసిన ద్రోహం దేశ ద్రోహం కంటే ఇది పెద్ద నేరం. హీరోషిమా, నాగసాకిలలో పడిన అణుబాంబు కంటే మూసీ ఆక్రమణ ప్రమాదకరం’ అని సిఎం రేవంత్‌రెడ్డి అన్నారు.
నేవీ రాడార్‌కు అనుమతిచ్చింది బిఆర్‌ఎస్ ప్రభుత్వమే
‘వికారాబాద్ జిల్లా పూడూరు మండలం దామగుండంలో నేవీ రాడార్ ఏర్పాటుకు అన్ని అనుమతులు ఇచ్చింది బిఆర్‌ఎస్ ప్రభుత్వమే. ఇప్పుడు వారు పనులు చేయడానికి వస్తే అది రేవంత్‌రెడ్డి ఖాతాలో వేస్తున్నారు. అయినా దేశ భద్రత కోసం దీనిని నేను స్వీకరిస్తున్నారు. అది ప్రైవేట్ కంపెనీలకు దాదాదత్తం చేసింది కాదు. దేశ భద్రతకు సంబంధించి విషయం 2900 ఎకరాల్లో కేవలం ఖాళీ ప్రదేశాలను మాత్రమే వారు వినియోగించుకుంటారు. ప్రభుత్వం పాలసీలు కొనసాగిస్తోంది’ అని సిఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ‘ఈ ప్రాజెక్టును అడ్డుకుంటానంటున్న కెటిఆర్ రోడ్డుకు అడ్డంగా పడుకుని అడ్డుకునేదుండే. రాష్ట్ర ప్రభుత్వం ఆయనను ఏమైనా అడ్డుకుందా, వారినేమైనా హౌస్ అరెస్టు చేశామా. దేశం కోసం ప్రాణాలు అర్పించే సైనికులు జీతాల కోసం పని చేస్తున్నారా. అందుకే అయితే వారికి వేరే చోట జీతాలు రావా. దేశ భక్తి లేని వాడు కసబ్ కంటే హీనుడు. ఆ విధంగా కెటిఆర్ మారుతానంటే నాకు అభ్యంతరం లేదు’ అని సిఎం రేవంత్‌రెడ్డి అన్నారు. గత ప్రభుత్వం లాగా తమ ప్రభుత్వం నిర్భందంగా ఏమి చేయ దల్చుకోలేదని సిఎం అన్నారు. వరదలు వచ్చినప్పుడు రూ.10వేలు పంచారని, దీనిలో ఎంత దోచుకున్నారో తెలియాదా, దీనిపై విచారణ చేపడుతామా ఇందుకు మాజీ మంత్రి కెటిఆర్ సిద్దమా అని సిఎం ప్రశ్నించారు.