ప్రభుత్వాన్ని నిలదీసిన హైకోర్టు
రోగాలు పట్టిపీడిస్తున్నా జనం గోడు పట్టదా?
డెంగీ, మలేరియా, చికున్‌గున్యా నివారణ చర్యలపై ఆగ్రహం
ప్రజాపక్షం / హైదరాబాద్ : డెంగీ, మలేరియా, చికున్‌గునియా వంటి విషజ్వరాలు ప్రజల్ని పట్టిపీడిస్తుంటే నివారణ చర్యలు తీసుకోకుండా అధికారులు ఏం చేస్తున్నారని హైకోర్టు నిలదీసింది. ఇప్పటికే ఒక జిల్లా జడ్జి డెంగీతో బాధపడుతూ మరణించారని, ప్రజలు కూడా రోగాలతో సతమతమవుతుంటే సర్కార్ మాత్రం తమకేమీ పట్టనట్లుగా ఉందని హైకోర్టు వ్యాఖ్యానించింది. గురువారం ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ, మెడికల్ అండ్ హెల్త్ ముఖ్య కార్యదర్శి, డైరెక్టర్, జిహెచ్‌ఎంసి కమిషనర్ స్వయంగా కోర్టుకు వచ్చి వివరణ ఇవ్వాలని ఆదేశించింది. నెల రోజుల్లోగా కట్టుదిట్టమైన చర్యలతో విషజ్వరాలను అంతం చేయాలని గతంలో ఆదేశించినా అమలు కాకపోవడానికి కారణాలు చెప్పాలని కోరింది. జనం రోగాలతో బాధపడుతుంటే సీరియస్‌గా స్పందించాల్సి వస్తుందని, ఇప్పటికే ఒక జడ్జి డెంగీ కారణంగా మరణించారని గుర్తు చేసిం ది. ఇలాగే చూస్తూ ఉంటే పరిస్థితులు చేజారిపోతే ఏం చేస్తారని, పూర్వం యూరప్‌లో ప్లేగూ వచ్చి వేలాది మంది మరణించారని, అప్పుడు ఇద్దరు పోప్‌లు కూడా చనిపోయారని, ఇలాంటి మహమ్మారికి ధనిక, పేద అనే తారతమ్యం ఉండదని పేర్కొంది. జనం చస్తుంటే ఎవ్వరూ స్పందించడం లేదని, చిచ్చు కారుచిచ్చు అయ్యేలా కాకుండా సర్కార్ చర్యలు ఉండాలని, సమస్య జఠిలం అయితే ఎవ్వరూ ఏం చేయలేని నిస్సహాయులు అవుతారని హెచ్చరించింది. డెంగీ వంటి విషజ్వరాలపై ప్రభుత్వ చర్యలు నామమాత్రంగా ఉన్నాయంటూ వైద్యురాలు కరుణ, లాయర్ రాపోలు భాస్కర్ వేరువేరుగా వేసిన పిల్స్‌ను బుధవారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్, జస్టిస్ ఎ.అభిషేక్‌రెడ్డిలతో కూడిన డివిజన్ బెంచ్ విచారించింది. డెంగీ వంటి విషజ్వరాలతో జనం చచ్చిపోతున్నారని, పట్టించుకున్న పాపానపోలేదని ఇప్పటికే ఎంతో సమయం, అనేక అవకాశాలు ఇచ్చినా ప్రభుత్వం నుంచి చర్యలు మాత్రం అంతంత మాత్రంగానే ఉంటున్నాయని వ్యాఖ్యానించింది. ఒక జడ్జి డెంగీ కారణంగా మృత్యువాత పడ్డారని, ప్రభుత్వం అవగాహన కల్పించి ఉంటే ఈ పరిస్థితులు జనానికి కూడా వచ్చేవి కావని అభిప్రాయపడింది. హైకోర్టు కళ్లు తెరవదని అనుకోవద్దని, కళ్లు మూసుకుని ఉండదని, విషజ్వరాలకు జనం చిక్కుతుంటే, మరో పక్కమృత్యువాత పడుతుంటే తాము కళ్లు తెరిచే ఉంటామని తేల్చి చెప్పింది. అనకూడదు కానీ..బ్యూరోక్రాట్స్‌లో ఎవరికైనా ఈ తరహా పరిస్థితి ఎదురైతేగానీ మార్పు రాదా అని ప్రశ్నించింది. నిర్లక్ష్యం తగదని, పరిస్థితులు చేజారితే ఏం చేయాలో తెలియని అయోమయపరిస్థితులు ఉత్పన్నం అవుతాయని హెచ్చరించింది. దోమల్ని లార్వా దశలోనే అంతం చేయాలని, ప్రభుత్వం కళ్లు తెరవకపోతే పరిణామాలు తీవ్రం అవుతాయని హెచ్చరించింది. డ్రోన్ల సాయంతో మురికివాడల్లో దోమల నివారణకు చర్యలు తీసుకోవాలని, ఫాగింగ్ బాగా చేయాలని, మీడియా ద్వారా ఎక్కువ ప్రచారం చేసి ప్రజలకు అవగాహన కల్పించాలన్న సూచనలు ఎక్కడా అమలు కాలేదని ఆగ్రహాన్నివ్యక్తం చేసింది.డెండీ నివారణకు చర్యలు తీసుకుంటున్నామని, దోమల సంఖ్య తగ్గిందని, డెంగీ రాకుండా తీసుకోవాల్సిన ప్రచారానికి కూడా పెద్ద ఎత్తున ప్రాధాన్యత ఇస్తున్నామని అడ్వకేట్ జనరల్ బిఎస్‌ప్రసాద్ చెప్పారు. ఒక తర్వాత మరో నెలకి కేసులు తగ్గకపోగా పెరగడం ఏమిటని హైకోర్టు ప్రశ్నించింది.