న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ అసెంబ్లీలో విశ్వాస పరీక్ష మూజువాణి ఓటుతో నెగ్గారు. ఢిల్లీ అసెంబ్లీలో మొత్తం 70 మంది సభ్యులు ఉండగా, ఆప్ ఎంఎల్‌ఎలు 62 మంది. మిగతా ఎనిమిది మంది బిజెపి సభ్యులు. ఒకొక్కరికీ 20 కోట్ల రూపాయలు చొప్పున చెల్లించి, 40 మంది ఎంఎల్‌ఎలను ‘కొనుగోలు’ చేసేందుకు కేంద్రం కుట్రలు పన్నుతున్నదని కేజ్రీవాల్ ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను కేసులతో ఉక్కిరిబిక్కిరి చేస్తూ, ఆయననను పలురకాలుగా ప్రలోభపెట్టే ప్రయత్నం చేసిందని కూడా కేజ్రీవాల్ విమర్శించారు. మహారాష్ట్రలో శివసేన పార్టీని నిలువునా చీల్చి, తద్వారా అధికారంలో భాగస్వామ్యం సంపాదించిన బిజెపి, ఢిల్లీలోనూ అదే వ్యూహాన్ని అమలు చేయాలని కోరుకుందికానీ ఆ ప్రయత్నాలు ఫలించలేదని వ్యాఖ్యానించిన కేజ్రీవాల్, తనను తాను నిరూపించుకోవడానికి విశ్వాస పరీక్షకు వెళ్లారు. ఆగస్టు 29న విశ్వాస తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టారు. గురువారం అసెంబ్లీలో విశ్వాస పరీక్ష నెగ్గిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఢిల్లీలో ఒక్క ఆప్ ఎంఎల్‌ఎను కూడా బిజెపి కొనుగోలు చేయలేకపోయిందని వ్యాఖ్యానించారు. ‘మాకు 62 మంది సభ్యులు ఉన్నారు. వారిలో ఇద్దరు విదేశాలకు వెళ్లగా, ఇద్దరు జైల్లో ఉన్నారు. ఒక సభ్యుడు స్పీకర్‌గా బాధ్యతలు నిర్వరిస్తున్నారు. మితగా వారంతా ప్రభుత్వానికి మద్దతుగా నిలిచారు. మహారాష్ట్ర వ్యూహాన్ని ఢిల్లీలో అమలు చేద్దామనుకున్న బిజెపియత్నా లు ఫలించలేదు’ అన్నారు. ‘ఆపరేషన్ కమలం ఢిల్లీ’ కాస్తా ‘ఆపరేషన్ కీచడ్’గా మారిందని వ్యాఖ్యానించారు. లిక్కర్ పాలసీలో ఏవైనా అవకతవకలు జరిగినా లేక భారీగా కుంభకోణం జరిగినా మనీష్ సిసోడియా ఇంట్లో జరిపిన సోదాల్లో సాక్ష్యాధారాలు బయటపడేవి అన్నా రు. కానీ, సిబిఐ దాడుల్లో ఏ ఒక్క సాక్ష్యం లభించలేదని ఆయన గుర్తుచేశారు. ఆప్‌ను విభజించడానికి, ప్రభుత్వాన్ని విచ్ఛిన్నం చేయడానికి బిజెపి ఎన్ని ప్రయత్నాలు చేసినా అవి ఫలించబోవని ఆయన స్పష్టం చేశారు. మనీష్ సిసోడియాపై సిబిఐ దాడుల అనంతరం, ప్రధాని నరేంద్ర మోడీ సొంత రాష్ట్రపైన గుజరాత్‌లో తమ పార్టీ బలం పెరిగిందని కేజ్రీవాల్ అన్నారు. నాలుగు శాతం వరకూ ఓటర్లు ఇప్పుడు తమ పార్టీకి మద్దతు తెలుపుతున్నారని అన్నారు. గుజరాత్ అసెంబ్లీకి జరగబోయే ఎన్నికల్లో తమ పార్టీకే విజయం లభిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు
విశ్వాసపరీక్షలో కేజ్రీవాల్ సక్సెస్
RELATED ARTICLES