ఐదోసారి ప్రపంచకప్ ముద్దాడిన ఆస్ట్రేలియా మహిళల జట్టు
ఫైనల్ పోరులో భారత్‌పై 85 పరుగుల భారీ విజయం
హిలీ భాటింగ్ ధాటికి తేలిపోయిన భారత బౌలర్లు
బ్యాటింగ్‌లోనూ వరుసకట్టిన టీమిండియా
ఐసిసి టి20 వరల్డ్‌కప్
ఆస్ట్రేలియా అమ్మాయిలా .. మజాకా..! లీగ్ దశలో తమతో సహా అన్ని జట్లు అప్పనంగా విజయానందిస్తే.. కీలక సమరంలో మాత్రం అద్భుత ప్రదర్శనతో టీమిండియాను నేలకు దించారు.! సమ ఉజ్జీల సమరంగా సాగుతుందనుకున్న మ్యాచ్‌ను.. తమ బ్యాటింగ్, బౌలింగ్‌తో ఏకపక్షంగా మార్చేసి హర్మన్‌సేనను కుదేల్ చేశారు. భారత ఫీల్డింగ్ వైఫల్యాలను అందిపుచ్చుకున్న అలీసా హెలీ( 39 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్సర్లతో 75), బెత్ మూనీ(54 బంతుల్లో 10 ఫోర్లు 78 నాటౌట్) అద్భుత బ్యాటింగ్‌తో భారత బౌలింగ్‌ను చీల్చి చెండాడగా.. ప్రత్యర్థి ఒత్తిడిని క్యాష్ చేసుకున్న.. బౌలర్లు మేగన్ స్కట్(4/18), జొనాస్సెన్ (3/20) భారత బ్యాట్స్‌మన్ పతనాన్ని శాసించారు. వెరసీ.. తుది మెట్టుపై భారత్‌కు మరోపరాజయం ఎదురువ్వగా.. ఆస్ట్రేలియా ఐదోసారి ప్రపంచకప్‌ను ముద్దాడింది.
మెల్‌బోర్న్: బ్యాటింగ్ ఘోరం.. బౌలింగ్ నాసిరకం.. ఫీల్డింగ్ ప్లేస్‌మెంట్స్ మరింత అధ్వానం.. లైనప్‌లో నిలకడ లేదు. అమ్మాయిల్లో నిలబడాలనే తపన లేదు.. ఇలా ప్రతీ వ్యూహంలో మిస్‌ఫైర్ అయిన భారత మహిళలు.. ప్రపంచకప్ తుది మెట్టుపై ఘోరంగా తడబడ్డారు. అదే సమయంలో కసి, పట్టుదల, ఓపిక, అనుభం చూపెట్టిన ఆస్ట్రేలియా.. ప్రతీ అవకాశాన్ని అందిపుచ్చుకొని 85 పరుగుల తేడాతో గెలుపొంది ఐదోసారి విశ్వవిజేతగా నిలిచింది. ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 184 పరుగులు చేయగా.. అనంతరం లక్ష్య చేధనకు దిగిన భారత్ 19.1 ఓవర్లలో 99 పరుగులకే ఆలౌటైంది. భారత బ్యాటర్లలో దీప్తీ శర్మ(33), వేద కృష్ణమూర్తి (19) టాప్ స్కోరర్లు కావడం గమనార్హం. ప్రధాన బ్యాటర్లు షెఫాలీ (2), మంధాన(11), రోడ్రిగ్స్(0), హర్మన్(4) ఘోరంగా విఫలమయ్యారు. ఆసీస్ బౌలర్లలో మేగన్ స్కట్ నాలుగు వికెట్లతో టీమిండియా పతనాన్ని శాసించగా.. జోనాసన్ మూడు వికెట్లు తీసింది. విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగిన అలిసా హెలీకి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కగా.. బెత్ మూనీకి ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ దక్కింది.
ఆదిలోనే షాక్..
185 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టుకు ఆదిలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. లీగ్ మ్యాచ్‌ల్లో చెలరేగిన షెఫాలీ వర్మ.. కీలక సమరంలో మాత్రం చేతులెత్తేసింది. కేవలం మూడు బంతులే ఆడి రెండు పరుగులే చేసి తొలి వికెట్‌గా వెనుదిరిగింది. దీంతో క్రీజులోకి వచ్చిన తానియా బాటియా.. బంతి తలకు బలంగా తాకడంతో రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగింది. ఆ మరుసటి ఓవర్లలోనే జెమీమా రోడ్రిగ్స్(0) ఔటైంది. తర్వాత వరుస ఫోర్లతో జోరు కనబర్చిన మంధాన.. జొనస్సెన్ బౌలింగ్‌లో డీప్ స్క్వేర్ దిశగా భారీ షాట్‌కు ప్రయత్నించి క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగింది. అనంతరం హర్మన్ ప్రీత్ కౌర్(4) కూడా భారీ షాట్‌కు ప్రయత్నించి బౌండరీ లైన్ వద్ద క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ బాట పట్టింది.
దీప్తీ, వేద పోరాడినా..
30 పరుగులకే నాలుగు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న భారత్‌ను వేదకృష్ణమూర్తి, దీప్తి శర్మ నిధానంగా ఆడి గట్టెక్కించే ప్రయత్నం చేశారు. కానీ డిలిస్సా కిమ్మిన్స్ వేదను క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చింది. మిడాఫ్‌లో జొనస్సెన్ అద్భుత క్యాచ్ అందుకోవడంతో వేద పోరాటం ముగిసింది. దీంతో భారత్ 58 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. దీంతో గాయపడ్డ తానియా బాటియా స్థానంలో కంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా రిచా ఘోష్ బ్యాటింగ్‌కు దిగింది. అప్పటికే భారత్ ఆశలు ఆవిరయ్యాయి. కేవలం పరువు కోసం పాకులాడటం తప్ప చేయాల్సిందేం లేదు. కాగా, దీప్తీ, రిచా కొంతసేపు వికెట్ పడకుండా అడ్డుకున్నప్పటికీ.. నికోలా క్యారీ దెబ్బతీసింది. దీప్తీని క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చి తన విజయం ఆలస్యం కాకుండా చూసుకుంది. దీప్తీ ఔటైన వెంటనే భారత బ్యాటింగ్ ఆర్డర్ పేకమేడల్లా కుప్పకూలింది. రిచా ఘోష్(18), శిఖా పాండే(2), రాధా యాదవ్(1), పూనమ్ యాదవ్(1) వరుసగా పెవిలియన్ క్యూకట్టగా.. రాజేశ్వరి గైక్వాడ్ (1) నాటౌట్‌గా నిలిచింది.
అలీస్సా హీలీ సరికొత్త రికార్డు
మహిళల టీట్వంటీ ప్రపంచకప్‌లో భాగంగా ఆసీస్‌కు చెందిన ఓపెనింగ్ బ్యాటర్ అలిస్సా హీలీ ఓ సరికొత్త రికార్డు సృష్టించింది. ఇటు పురుషులు అటు మహిళల క్రికెట్‌లో ఎవ్వరూ సాధించలేని ఫీట్‌ను ఆమె సాధించింది. ఐసీసీ నిర్వహించే మెగా టోర్నీలలో హీలీ చేసిర అర్థశతకం రికార్డులకెక్కింది. మహిళల టీట్వంటీ ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా భారత్‌ల మధ్య జరిగిన ఫైనల్లో హీలీ అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీ చేశారు. ఇదీ ఐసీసీ నిర్వహించిన మెగా ఈవెంట్స్‌ల చరిత్రలోనే ఓ సరికొత్త రికార్డు. హీలీ 50 పరుగులను కేవలం 30 బంతుల్లోనే చేసింది. అంతకుముందు ఈ రికార్డు భారత్‌కు చెందిన హార్ధిక్ పాండ్య పేరిట ఉండేది. 2017లో జరిగిన ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా పాకిస్తాన్ భారత్‌ల మధ్య జరిగిన ఫైనల్స్‌లో హార్ధిక్ పాండ్య 32 బంతుల్లో 50 పరుగులు చేశాడు. ఇప్పుడు ఆ రికార్డును చెరిపివేసింది హీలీ. హార్థిక్ పాండ్య కంటే రెండు బంతులు తక్కువగా ఆడి 50 పరుగులు పూర్తి చేసింది. ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో 39 బంతుల్లో 75 పరుగులు చేసి హీలీ పెవీలియన్ బాట పట్టింది. మ్యాచ్ 12వ ఓవర్లో రాధా యాదవ్ హీలీ వికెట్ తీసింది.
భారత్ మూడోసారి..
ప్రపంచకప్ గెలవాలనేది ప్రతీ ఒక్కరి కల. ఆ కల సాకారమయ్యే రోజు వచ్చినట్టు వచ్చి దూరమైతే ఆ బాధ వర్ణాతీతం. ఇప్పుడే అదే వ్యథను భారత అమ్మాయిలు అనుభవిస్తున్నారు. ఒకసారి కాదు.. గత నాలుగేళ్లలో మూడు సార్లు చేజార్చుకొని కన్నీటి పర్యంతమయ్యారు.. 2017 వన్డే ప్రపంచకప్ ఫైనల్.. 2018 టీ20 సెమీఫైనల్.. 2020 టీ20 ప్రపంచకప్ ఫైనల్.. వేదిక మారినా.. ప్రత్యర్థి ఏదైనా.. ఫలితం మాత్రం అదే..!! ఇప్పుడదే బాధను తట్టుకోలేకపోయింది యువ ప్లేయర్ షెఫాలీ వర్మ. తొలిసారి ప్రపంచకప్ ఆడిన ఈ 16 ఏళ్ల సంచలనం అద్భుతమైన బ్యాటింగ్‌తో ప్రపంచ నెంబర్ వన్ ర్యాంకు సొంతం చేసుకుంది. అసలు భారత్ ఇక్కడి వరకు వచ్చిందంటే షెఫాలి సంచలన బ్యాటింగే కారణం.
తనవల్లే ఓడిందని..
ఇక ఆస్ట్రేలియా భారీ స్కోర్ చేయడంలో టీమిండియా ఫిల్డింగ్ వైఫల్యం ఓ కారణం. తొలి ఓవర్‌లో అలిసా హీలీ ఇచ్చిన సునాయస క్యాచ్‌ను షెఫాలీ జారవిడిచింది. అప్పుడు ఆమె వ్యక్తిగత స్కోర్ 8 పరుగులు మాత్రమే. ఈ అవకాశంతో రెచ్చిపోయిన అలిసా.. ఏకంగా 39 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్సర్లతో 75 పరుగులతో వీరవిహారం చేసింది. మరో ఓపెనర్ బెత్ మునీతో కలిసి తొలి వికెట్‌కు 115 పరుగుల విధ్వంసకర భాగస్వామ్యాన్ని అందించింది. అనంతరం 185 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ జట్టు ఆదిలోనే వికెట్ కోల్పోయింది. కేవలం 3 బంతుల్లో రెండు పరుగులే చేసి షెఫాలీ విఫలమైంది. అటు ఫీల్డింగ్, ఇటు బ్యాటింగ్‌లో విఫలమవడం.. ఫలితంగా భారత్ ఓడటంతో ఈ 16 ఏళ్ల యువ సంచలనం బాధను ఆపుకోలేకపోయింది. తనవల్లే మ్యాచ్ ఓడిపోయిందని, తాను క్యాచ్ పట్టి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని సహచరులతో చెబుతూ కన్నీటి పర్యంతమైంది. అయితే సారథి హర్మన్‌ప్రీత్ కౌర్, సహచర క్రికెటర్లు ఆమెను ఓదార్చే ప్రయత్నం చేసినప్పటికీ షెఫాలీ వెక్కివెక్కి ఏడ్చింది. సమష్టి వైఫల్యమని, నీవు ఆడటం వల్లనే మనం ఇక్కడ వరకు వచ్చామని ఓదార్చిన ఆమె తన బాధను దిగమింగకపోయింది.