రాజీనామా చేసిన టిడిపి ఎంఎల్‌ఎ శ్రీనివాసరావు
విశాఖపట్నం: విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటీకరించడాన్ని నిరసిస్తూ ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజీనామా చేసి, ఆందోళనా పథాన్ని చేపట్టారు. తన లెటర్ ప్యాడ్‌పై రాసిన లేఖను ఆయన స్పీకర్ తమ్మినేని సీతారామ్‌కు పంపారు. అయితే, ఇది స్పీకర్ ఫార్మాట్‌లో లేదని అంటున్నారు. కాగా, శనివారం మధ్యాహ్నం రాజీనామా లేఖను పంపిన తర్వాత ఆయన విలేఖులతో మాట్లాడుతూ విశాఖ స్టీల్ ప్లాంట్‌ను కోల్పోవడం అంటే శరీరం నుంచి తలను తీసేసినట్టుగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎందరో ప్రాణత్యాగం చేసి స్టీల్‌ప్లాంట్‌ను సాధించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటుపరం చేయడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడంపై నిరసనగా, పార్టీలతో సంబంధం లేకుండా విశాఖ ప్రజాప్రతినిధులంతా రాజీనామా చేయాలని పిలుపునిచ్చారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా, ఏ పార్టీతోనూ సంబంధం లేని జెఎసిని ఏర్పాటు చేయనున్నట్టు గంటా ప్రకటించారు. ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే, రాజకీయాలకు అతీతంగా ప్రజాఉద్యమం వస్తుందని ఆయన జోస్యం చెప్పారు. రాజీనామాలతో ఒత్తిడి పెంచడం కూడా ఉద్యమంలో ఒక భాగమవుతుందని వ్యాఖ్యానించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. ఎన్నో ఏళ్లు పోరాటాలు చేసి సాధించుకున్న దీనిని ఇప్పుడు ప్రైవేటుపరం చేయాలని నిర్ణయించడం దారుణమని అంటున్నాయి. నష్టాలు వస్తున్నాయన్న సాకుతో స్టీల్ ప్లాంట్‌ను ప్రయివేట్ సంస్థలకు దారాధత్తం చేయడానికి కేంద్రం సిద్ధమయ్యిందని దుయ్యబడుతున్నాయి. ఇలావుంటే, నీతి ఆయోగ్ సూచన మేరకే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని తీసుకున్నట్టు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ అన్నారు. భారీ నష్టాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను మాత్రమే విక్రయిస్తామని హైదరాబాద్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ ఠాకూర్ చెప్పారు. ఈ ప్రకటన విశాఖ స్టీల్ ప్లాంట్‌పై కేంద్రం స్థిరమైన నిర్ణయాన్ని తీసుకుందనే విషయాన్ని స్పష్టం చేస్తున్నది.
విశాఖ స్టీల్‌పై ‘గంటా’పథం
RELATED ARTICLES