ఎల్జీ పాలిమర్స్‌లో స్టైరీన్ గ్యాస్ లీకేజ్
11 మంది మృతి
1000 మంది అస్వస్థత
పలువురి పరిస్థితి విషమం
మృతుల కుటుంబాలకు రూ. కోటి పరిహారం
ఘటనపై దర్యాప్తునకు ఎపి సిఎం జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశం
ప్రజాపక్షం/విశాఖపట్నం: విశాఖ నగరాన్ని మహా విషాదం కుదిపేసింది. వేపగుంటలో ఎల్జీ పాలిమర్స్ నుంచి లీకైన స్టైరీన్ వాయువు మృత్యు ఘంట మోగించింది. నగరాన్ని కమ్మేసిన ప్రమాదకరమైన విషవాయువు 11 మందిని పొట్టనపెట్టుకోగా వెయ్యి మందికిపైగా ప్రజలు ఆసుపత్రుల్లో చికిత్సపొందుతున్నారు. అనూహ్యమైన ఈ పరిణామానికి విశాఖపట్నం అవాక్కయింది. నగరంలో ఆర్. ఆర్ వెంకటాపురంలోని ఎల్జీ పాలిమర్స్ కంపెనీ నుంచి గురువారం తెల్లవారు జామున 3 గంట ల సమయంలో స్టైరీన్ విషవాయువు లీకైంది. అందరూ గాఢనిద్రలో ఉన్న సమయంలో ఒక్కసారిగా ఈ ఉపద్రం ముంచుకొచ్చింది. నిద్రలేచే లోపే ఎవరు ఎక్కడ ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో కూడా తెలియని హృదయవిదారక పరిస్థితి నెలకొన్నది. ఇళ్లలో ఉన్నవారు ఉన్నఫళంగా కుప్పకూలిపోగా, తెల్లవారిన తర్వాత వాకింగ్‌కు వచ్చిన వారు ఎక్కడికకడే పడిపోయారు. హాలీవుడ్ సినిమాలో ఏలియన్లు ప్రయోగించిన విషవాయువు తరహా దృశ్యాన్ని విశాఖ తలపించింది. ఆ వాయువు పీల్చిన జనం రోడ్లపైకి వచ్చి ఉక్కిరిబిక్కిరై స్పృహ తప్పి పడిపోయిన దృశ్యాలు తీవ్ర ఆందోళనకు గురిచేశా యి. ఇప్పటి వరకు 11 మంది మృత్యువాతపడినట్లు ఎపి ప్రభుత్వం నిర్ధారించగా, వందలాది మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.కెజిహెచ్ శవాగారంలో 10 మృతదేహాలున్నట్లు అధికారులు తెలిపారు. సహాయక చర్యలు చేపట్టిన ఎన్‌డిఆర్‌ఎఫ్ భారీ మృత్యువలయాన్ని తప్పించింది. విష వాయువు పీల్చిన జనం విశాఖలోని కేజీహెచ్, ఇతర ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వీరిలో చిన్నారులు, మహిళలు, వృద్ధులే అధికంగా ఉన్నారు. మరోవైపు, ఎపి ముఖ్యమంత్రి వైఎస్.జగన్ మోహన్ రెడ్డి విశాఖ చేరుకుని కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న బాధితుల్ని పరామర్శించారు. అర్ధరాత్రి 2 గంటల నుంచి 2.30గంటల సమయంలో సాంకేతిక లోపంతో ట్యాంకు నుంచి ఆవిరి, పొగ రూపంలో ఈ విషవాయువు కమ్ముకొచ్చినట్లుగా అంచనా వేశారు. ఈ క్రమంలో కంపెనీలోని స్మోక్ డిటెక్టర్లు నుంచి వచ్చిన సంకేతంతో అక్కడి సిబ్బంది అప్రమత్తమయ్యారు. గ్యాస్‌ను నియంత్రించేందుకు వెళ్లారు. అప్పటికే దట్టంగా పొగలు కమ్ముకోవడంతో వారు చేతులెత్తేశారు. దీంతో 101కి ఫోన్ చేసి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది.. గ్యాస్ లీకేజీని నియంత్రించేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టినప్పటికీ, వాయువు గాల్లో ఆ ప్రాంతం మొత్తం వ్యాపించింది. పొగ ఎక్కడి నుంచి వస్తున్నదో అర్ధంకాక జనం తల్లడిల్లిపోయారు. గోపాలపట్నం పరిసర ప్రాంత ప్రజలు ఉక్కిరిబిక్కిరయ్యారు. చివరకు ఏదో విపత్తు సంభవిస్తున్నదని అనుమానం అందరిలోనూ ఒక్కసారిగా గుప్పుమంది. దీంతో ప్రజలు తలుపులకు తాళాలు వేసి తమ వాహనాల్లో దూరప్రాంతాలకు బయలుదేరారు. కొందరైతే నగరం విడిచి వెళ్లారు. ఇంకొందరు వాయువు ప్రభావం లేని ప్రాంతాల వద్ద ఆగిపోయారు. అధిక ప్రభావం గోపాలపట్నం పరిసర గ్రామాల్లోనే కన్పించింది. ఎల్జీ పాలిమర్స్ కంపెనీ నుంచి లీకైన స్టైరీన్ విషవాయువు ప్రభావం ఐదు గ్రామాలపై అధికంగా ఉంది. గోపాలపట్నం సమీపంలోని వెంకటాపురం, పద్మనాభనగర్, కంపరపాలెం, కొత్తపాలెం, వెంకటాద్రి నగర్‌లలో మొత్తం 10 వేల కుటుంబాలు ఉంటాయి. వీరిలో దాదాపు 2వేల మందికి పైగా ఇళ్లల్లోనే ఉండిపోవడంతో ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్టీఆర్‌ఎఫ్, సీఐఎస్‌ఎఫ్ దళాలు రంగంలోకి దిగి వారిని కాపాడేందుకు ప్రయత్నించాయి. ఉదయం 5గంటల నుంచి ఇళ్లల్లో అచేతనంగా పడి ఉన్నవారిని తలుపులు బద్దలుకొట్టి మరీ బయటకు తీసుకొచ్చి ఆస్పత్రులకు తరలించారు. అంబులెన్స్‌లతో పాటు కార్లు, బైక్‌లపై క్షతగాత్రులను ఇతర ప్రాంతాలకు చేరవేశారు. ఈ ఘటనలో ఇప్పటివరకు 11మంది ప్రాణాలు కోల్పోయారు. వారి వివరాలు ఇలా ఉన్నాయి. కుందన్ శ్రేయ (6); ఎన్. గ్రీష్మ (9), చంద్రమౌళి (19); గంగాధర్; నారాయణమ్మ (35); అప్పలనరసమ్మ (45);గంగరాజు (48); మేకా కృష్ణమూర్తి (73); రత్నాల గంగాధర్ (64), మరో ఇద్దరి పేర్లు తెలియాల్సివుంది. ఘటన జరిగిన తర్వాత సహాయక సిబ్బంది, రక్షణ దళాలు ముందుగా ఇళ్లల్లో ఉన్నవారందరినీ ఖాళీ చేశారని సీపీ ఆర్కే మీనా వెల్లడించారు. ఇళ్లల్లో చిక్కుకుపోయి న సురక్షిత ప్రాంతాలకు వారిని తరలిస్తున్నామన్నారు. దీని తీవ్రతకు ఎంతమంది ప్రభావితమయ్యారనేది మాత్రం ఇంకా స్పష్టత రాలేదని చెప్పారు. పరిస్థితి మాత్రం అదుపులోనే ఉందన్నారు. గ్యాస్ లీకైన ఘటనలో బాధితులకు సింహాచలం దేవస్థానం అండగా నిలబడింది. ఆయా ప్రాంతాల నుంచి తరలి వచ్చిన వందలాది మంది బాధితులకు ఈవో వెంకటేశ్వరరావు స్వయంగా సౌకర్యాలు కల్పిస్తున్నారు. వసతితో పాటు అల్పాహారం అందించారు. మధ్యాహ్నం వీరందరికీ భోజనం ఏర్పాటు చేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు బాధితులు సురక్షితంగా ఉన్న ప్రాంతాలకు వెళ్లాలని ఆయన సూచించారు. సింహాచలం వచ్చేవారికి దేవస్థానం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. గ్యాస్ లీకైన ఘటనతో ముందే అప్రమత్తమైన పలు గ్రామాలకు చెందిన వారు నగరంలోని వేపగుంట, పెందుర్తి తదితర ప్రాంతాల వైపు పరుగులు పెట్టారు. అక్కడే రోడ్లపై సేదతీరుతున్నారు. తమ కుటుంబ సభ్యులు ఎక్కడ ఉన్నారో తెలియక దిక్కుతోచని పరిస్థితుల్లో విలపిస్తూ నరకయాతన పడ్డారు.