కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకించకపోతే చరిత్రహీనులుగా మిగిలిపోతారు
ముఖ్యమంత్రి జగన్ తక్షణం అఖిలపక్షంతో ఢిల్లీ వెళ్లి కేంద్రంపై ఒత్తిడి తేవాలి
విజయవాడలో ఎఐటియుసి రౌండ్‌టేబుల్ సమావేశంలో వక్తల డిమాండ్
రేపటి నుంచి రాష్ర్ట వ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు
ప్రజాపక్షం / విజయవాడవిశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించాలనే కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని విజయవాడలో ఎఐటియుసి శనివారం ఉదయం నిర్వహించిన అఖిలపక్ష, ప్రజా సంఘాల రౌండ్ టేండ్ సమావేశం తీవ్రంగా ఖండించింది. ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి తక్షణం స్పందించి అఖిలపక్షంతో ఢిల్లీ వెళ్లి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని సమావేశం డిమాండ్ చేసింది. ఆంధ్ర్రప్రదేశ్‌లోని 13 జిల్లాల్లో సోమవారం నుంచి అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, విద్యార్థి, యువజన సంఘాలను కలుపుకుని రౌండ్‌టేబుల్ సమావేశాలు, నిరసన ప్రదర్శనలు, ర్యాలీలు నిర్వహించాలని సమావేశం తీర్మానించింది. ‘విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కాపాడుకుందాం. ప్రైవేటీకరణను అడ్డుకుందాం..’ అనే అంశంపై విజయవాడ హనుమాన్‌పేట దాసరి భవన్‌లో ఎఐటియుసి రాష్ర్ట సమితి ఆధ్వర్యంలో ఈ రౌండ్ టేండ్ సమావేశం జరిగింది. కాంగ్రెస్, టిడిపి, సిపిఐ, సిపిఎం, ఇతర వామపక్షాలు, వివిధ ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్న ఈ సమావేశానికి ఎఐటియుసి రాష్ర్ట ప్రధాన కార్యదర్శి జి.ఓ బులేసు అధ్యక్షత వహించారు. “ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని 23 జిల్లాల ప్రజలు ‘విశాఖ ఉక్కు… ఆంధ్రుల హక్కు’ అని ముక్తకంఠంతో నినదిస్తూపెద్ద ఎత్తున ఉద్యమించారు. 32 మంది ప్రాణత్యాగాలు చేశారు. కర్మాగార నిర్మాణంకోసం వేలాది మంది రైతులు 26వేల ఎకరాల పంట పొలాలను త్యాగం చేశారు. ఆ ఫలితంగానే విశాఖ ఉక్కు కర్మాగారం ఏర్పడింది. విశాఖ ఉక్కు పరిశ్రమ కేవలం ఒక ఉత్పత్తి సంస్థ మాత్రమే కాదు. ఆంధ్రుల ఆత్మాభిమాన ప్రతీక. దీనిని అర్థం చేసుకుని కేంద్ర ప్రభుత్వం వెంటనే వెనక్కి తగ్గాలి. ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి. అన్ని రాజకీయ పార్టీల నాయకులు కూడా విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణను వ్యతిరేకించాలి. లేకపోతే చరిత్రహీనులుగా మిగిలిపోతారు…” అని సమావేశంలో పలువురు వక్తలు ఉద్ఘాటించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ర్ట సిపిఐ కార్యదర్శి కె.రామకృష్ణ సమావేశానికి ముఖ్య వక్తగా హాజరై మాట్లాడుతూ , ప్రభుత్వరంగ సంస్థల్లోని పెట్టుబడుల ఉపసంహరణ విధానం అమలు చేసేందుకు నరేంద్ర మోడీ సర్కారు కరోనా విపత్కర కాలాన్ని తెలివిగా వాడుకుంటోందని ఆగ్రహం వ్యక్తంచేశారు. విశాఖ ఉక్కు కర్మాగార ప్రైవేటీకరణకు కేంద్రం మూడు, నాలుగేళ్ళుగా ప్రయత్నాలు చేస్తోందన్నారు. ఒడిశాలో ప్రజలు తిరస్కరించిన పోస్కో కంపెనీకి విశాఖ ఉక్కు పరిశ్రమ భూముల కేటాయింపు, క్యాపిటల్ మైన్స్ కేటాయించకపోవడం, నష్టాల భర్తీకి ఆర్థిక చేయూత అందించకపోవడం లాంటి చర్యలన్నీ కేంద్రం ప్రయత్నాల్లో భాగమేనని విమర్శించారు. విశాఖ ఉక్కు కర్మాగార ప్రైవేటీకరణను రాష్ట్రంలో బిజెపి వ్యతిరేకించడం శుభపరిణామని చెబుతూ, బిజెపి ఎంపి సుజనా చౌదరి వైఖరిపై మండిపడ్డారు. వైసీపీ ఎంపి విజయసాయిరెడ్డి అవసరమైతే రాజీనామా చేసి కేంద్రంపై ఒత్తిడి తేవాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి వెంటనే కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడాలని, అఖిలపక్ష బృందంతో ఢిల్లీ వెళ్లి ఒత్తిడి తేవాలని కోరారు. బిజెపి రాష్ర్ట అధ్యక్షుడు సోము వీర్రాజు ఈ నెల 14న ఢిల్లీ వెళ్లి తమ పార్టీ పెద్దలను కలిసి విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను నిలిపివేయాలని కోరుతామని చెప్పడాన్ని స్వాగతిస్తున్నామని, అయితే, ఆయన వెంట అన్ని పార్టీల నేతలను కూడా తీసుకువెళ్లి ఒత్తిడి పెంచాలని పేర్కొన్నారు. ఆంధ్రుల సెంటిమెంట్ అయిన విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకించనివారు చరిత్రహీనులుగా మిగిలిపోతారని హెచ్చరిస్తూ, అన్ని పార్టీలు, ప్రజా సంఘాలను కలుపుకొని కార్మిక సంఘాలు కేంద్రం వెనక్కి తగ్గే వరకు పోరాటం కొనసాగించాలని సూచించారు.
విశాఖపట్నం, ఉత్తరాంధ్రలపై నిజమైన ప్రేమ ఉంటే వెంటనే ఎంపీ విజయసాయిరెడ్డి రాజీనామా చేసి కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకించాలని విజయవాడ ఎంపీ కేశినేని శ్రీనివాస్(నాని) డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదా, విభజన హామీలు సాధించలేకపోయిన జగన్‌మోహన్‌రెడ్డి, కనీసం విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరణనైనా అడ్డుకోవాలన్నారు.
విజయవాడలో పెద్ద ఎత్తున ఆనాడు జరిగిన ఉద్యమాన్ని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ జల్లి విల్సన్ గుర్తుచేశారు. విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని, ప్రైవేటీకరిస్తే ఎస్‌సి, ఎస్‌టి, బిసిలు తీవ్రంగా నష్టపోతారని, ఉద్యోగ అవకాశాల్లో రిజర్వేషన్లు ఉండవని అన్నారు. విశాఖ ఉక్కు కర్మాగార ప్రైవేటీకరణ ఉత్తరాంధ్ర అభివృద్ధికి మరణశాసనమని సిపిఎం రాష్ర్ట కార్యదర్శివర్గ సభ్యుడు వై.వెంకటేశ్వరరావు ఆందోళన వ్యక్తంచేశారు.
కర్మాగారం ప్రైవేటీకరణ దుర్మార్గమని ఎఐటియుసి ఆంధ్రప్రదేశ్ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి జి.ఓబులేసు అన్నారు. కేవలం ప్రభుత్వ వ్యవస్థాగత నిర్ణయాలు, లోపాలవల్ల వచ్చిన నష్టాల్ని సాకుగా చూపించి ప్రైవేటీకరణకు సిద్ధమవడం సిగ్గుచేటన్నారు. కర్మాగారానికి క్యాపిటల్ మైన్స్ కేటాయించకపోవడం వల్లే నష్టాలు వస్తున్నాయని విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి ఆదినారాయణ అన్నారు. నష్టాల సాకుతో ఇప్పటికే పలుమార్లు ప్రైవేటీకరణకు యత్నించారని, 35 ఏళ్లుగా కార్మికులు పోరాడుతూ కర్మాగారాన్ని కాపాడుకుంటున్నారని అన్నారు.
అన్ని జిల్లాల్లో ఏకోన్ముఖంగా ఉద్యమించి కేంద్రంపై ఒత్తిడి తేవాలని ప్రముఖ సామాజికవేత్త టి.లక్ష్మీనారాయణ అన్నారు. మేధావుల ఫోరం కన్వీనర్ చలసాని శ్రీనివాస్, కాంగ్రెస్ నాయకులు సుంకర పద్మశ్రీ, నరహరిశెట్టి నరసింహారావు, ఎపి మహిళా సమాఖ్య ప్రధాన కార్యదర్శి పెన్మెత్స దుర్గాభవానీ, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ నాయకుడు మోహన్, ఐఎఫ్‌టీయూ నాయకుడు పోలారి, హిందూ మహాసభ నాయకుడు గోపాలకృష్ణ, పారిశ్రామికవేత్త కామేశ్వరరావు, లోక్‌సత్తా నాయకురాలు నార్ల మాలతి, విజయవాడ ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు నిమ్మరాజు చలపతిరావు, ఎఐఎస్‌ఎఫ్ నాయకుడు సాయికుమార్ మాట్లాడుతూ విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కలిసికట్టు పోరాటం సాగించాలని కోరారు. ఎఐటియుసి రాష్ర్ట అధ్యక్షుడు రావులపల్లి రవీంద్రనాథ్ వందన సమర్పణ చేశారు. ఏఐకేఎస్ ఉపాధ్యక్షుడు రావుల వెంకయ్య, ఎఐటియుసి రాష్ర్ట గౌరవాధ్యక్షుడు చలసాని వెంకట రామారావు, ఉపప్రధానకార్యదర్శి ఎస్.వెంకటసుబ్బయ్య, సిపిఐ కృష్ణా జిల్లా కార్యదర్శి అక్కినేని వనజ, సహాయ కార్యదర్శి నార్ల వెంకటేశ్వరరావు సహా పలు ప్రజాసంఘాల నాయకులు మాట్లాడారు. ప్రజానాట్య మండలి రాష్ర్ట ప్రధాన కార్యదర్శి పి.చంద్రానాయక్, సీనియర్ నాయకుడు ఆర్.పిచ్చయ్య అభ్యుదయ గీతాలు ఆలపించారు.
‘విశాఖ’ ప్రైవేటీకరణను అడ్డుకుందాం
RELATED ARTICLES