HomeNewsBreaking Newsవివాదాస్పద ‘మత మార్పిడి’ బిల్లుకు కర్నాటక అసెంబ్లీ ఆమోదం

వివాదాస్పద ‘మత మార్పిడి’ బిల్లుకు కర్నాటక అసెంబ్లీ ఆమోదం

బెలగావి (కర్నాటక) : వివాదాస్పదమైన మత మార్పిడుల నిరోధక బిల్లును కర్నాటక శాసన సభ గురువారం ఆమోదించింది. దీనిని ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మయి రాజ్యాంగబద్ధమైన, చట్టబద్ధమైన బిల్లుగా అభివర్ణించగా, విపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. మతాలపై జరుగుతున్న దాడిగా పేర్కొన్నాయి. ‘కర్ణాటక ప్రొటెక్షన్‌ ఆఫ్‌ రైట్‌ టు ఫ్రీడమ్‌ ఆఫ్‌ రిలీజియన్‌, 2021’ పేరుతో మంగళవారం ప్రవేశపెట్టిన ఈ బిల్లును కాంగ్రెస్‌ వ్యతిరేకించింది. ఇది ప్రజా వ్యతిరేకమైన చర్యగా పేర్కొంది. అమానవీయం, రాజ్యాంగ వ్యతిరేకమంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ బిల్లును ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేసింది. బలవంతపు మత మార్పిడుల నుంచి విముక్తిని ప్రసాదించడమే ధ్యేయమని బొమ్మయి సర్కారు ఎదురుదాడికి దిగింది. అకారణంగా బిల్లుపై విమర్శలు కురిపిస్తున్నారంటూ మండిపడింది. ఈ బిల్లు మతస్వేచ్ఛకు రక్షణ కల్పించడంతోపాటు తప్పుడు ప్రాతినిధ్యం, బలవంతం, మితిమీరిన ప్రభావం, బలవంతం, ప్రలోభపెట్టడం లేదా ఏదైనా మోసపూరిత మార్గాల ద్వారా ఒక మతం నుండి మరొక మతంలోకి చట్టవిరుద్ధంగా మారడాన్ని నిషేధిస్తుంది. ఎవరైనా బలవంతపు మత మార్పిడులకు పాల్పడితే, రూ.25,000 జరిమానాతో మూడు నుంచి ఐదేళ్ల వరకు జైలుశిక్ష విధించే అవకాశం ఉంది. అదే విధంగా మైనర్లు, మహిళలు, ఎస్సీలు, ఎస్టీలకు సంబంధించిన నిబంధనలను ఉల్లంఘిస్తే మూడేళ్ల నుంచి పదేళ్ల వరకూ జైలు శిక్షపడే అవకాశం ఉంటుంది. అతేగాక, యాభైవేల జరిమానా విధించవచ్చు. అదేవిధంగా మతం మారిని వారికి ఐదు లక్షల వరకూ పరిహారం చెల్లించాలని కూడా ఈ కొత్త చట్టం స్పష్టం చేస్తున్నది. సామూహిక మతమార్పిడి కేసులకు సంబంధించి 3- నుంచి 10 సంవత్సరాల జైలు శిక్ష విధించవచ్చు. వివాహానికి ముందు లేదా తర్వాత తాను మతాన్ని మార్చుకోవడమేగాక, జీవిత భాగస్వామిని కూడా అదే విధంగా మతం మార్చుకోవాలని బలవంతం చేయడాన్ని శిక్షార్హమైన నేరంగా పేర్కొంది. ఫ్యామిలీ కోర్టులో ఇలాంటి కేసులను విచారణ వస్తాయి. నేరానికి పాల్పడిన వారిని నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌తో అరెస్టు చేస్తారు కాబట్టి, కోర్టులు బెయిల్‌ పిటిషన్లపై తక్షణ నిర్ణయాలను ప్రకటించే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఇలావుంటే, ప్రస్తుతం ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న సిద్ధ రామయ్య హయాంలోనే ఈ బిల్లుకు రూపకల్పన జరిగిందని అధికార బిజెపి ఆరోపించింది. తొలుత ఈ వాదనను తిరస్కరించిన సిద్ధరామయ్య ఆతర్వాత స్పీకర్‌ కార్యాలయంలో రికార్డులను పరిశీలించి, తాను సిఎంగా ముసాయిదా బిల్లును కేబినెట్‌ ముందు ఉంచాలని మాత్రమే కోరినట్టు చెప్పారు. ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని వివరించారు. ఈ బిల్లు వెనుక ఆర్‌ఎస్‌ఎస్‌ హస్తం ఉందని ఆయన ఆరోపించారు. దీనిపై ముఖ్యమంత్రి బొమ్మయి స్పందిస్తూ, మత మార్పడులను ఆర్‌ఎస్‌ఎస్‌ వ్యతిరేకిస్తుందని, ఇందులో కొత్త ఏమీ లేదని వ్యాఖ్యానించారు. ఇది బహిరంగ రహస్యమేనని వ్యాఖ్యానించారు. 2016లో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఈ బిల్లును ఎందుకు ప్రారంభించిందని ఆయన నిలదీశారు. ఇది చట్టానికిగానీ, రాజ్యాంగానికిగానీ వ్యతిరేకం కాదని అన్నారు. ఇలావుంటే, తీవ్రమైన గందగోళం మధ్యే శాసన సభ ఈ బిల్లును ఆమోదించగా, శాసన మండలి ఆమోదించాల్సి ఉంది.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments