నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకుంటున్న రెవెన్యూ అధికారులు
ఆక్రమణలతో అన్యాక్రాంతమవుతున్న చెరువులు
ప్రజాపక్షం/మహబూబాబాద్ : ‘కుందేలు పోయాక పొదను ఊపుతూ కూర్చున్నారు కొందరు’ అన్నట్లుగా ఉంది ప్రభుత్వ అధికారుల తీరు. మహబూబాబాద్ జిల్లాకేంద్రం చుట్టూ వం దల ఎకరాలలో పురాతన కాలం నాటి చెరువులు విస్తరించి ఉన్నాయి. నిజాం పరిపాలన కాలం నుంచి ఈ చెరువు లు ఈ ప్రాంత ప్రజలకు వ్యవసాయానికి తాగునీటికి ఉపయోగకరంగా కొనసాగుతూ వచ్చాయి. కాలక్రమేణా వ్యవసాయం కోసం శిఖం భూములలో కొంత సాగులోకి తీసుకువచ్చిన రైతులు తదనంతరం చెరువులను మాత్రం కాపాడు తూ వచ్చారు. కానీ పట్టణీకరణ పెరుగుతున్న సమయంలో గత 20 సంవత్సరాలుగా చెరువులపైన రియల్ ఎస్టేట్ కబ్జాదారుల దృష్టి పడి రోజురోజుకూ కుచించుకుపోతున్నాయి. మహబూబాబాద్ పట్టణానికి ఒక వైపు నిజాం చెరువు, మరో వైపు బంధం చెరువు, రాంబ్రది చెరువు, నల్లకుంట, జగన్‌నాయక చెరువు, గుండ్లకుంట చెరువు, నానమ్మకుంట, కంబాల చెరువు ఇలా 11 గొలుసుకట్టు చెరువులు చుట్టూ విస్తరించి ఉన్నాయి. ఈ చెరువులలో ఈ ప్రాంత తాగునీటి అవసరాలు, వ్యవసాయ అవసరాలను వందల సంవత్సరాలుగా తీరుస్తూ వచ్చాయి. ప్రస్తుతం చెరువుల పరిస్థితి చూస్తే ఎంతో కాలం చెరువులు ఉండేటట్లు కనిపించటం లేదు. భవిష్యత్ తరాల కోసం వీటిని ఉపయోగకరంగా ఉంచాలంటే సంబందిత శాఖలు, రెవెన్యూ శాఖలు సంయుక్తంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పలువురు కోరుతున్నారు. ప్రధాన బంధం చెరువు , నిజాం చెరువు, కంబాల చెరువు ఆక్రమణలకు గురయ్యాయి. మహబూబాబాద్ పట్టణం చుట్టూ విస్తరించిన ఈ చెరువులు ఒకదానికొకటి గొలుసుకట్టుగా నిండిన మరో చెరువులోకి నీరు ప్రవహిస్తుంది. ఈ రకంగా భూగర్భ జలాలు కూడా చెరువుల కబ్జావలన అడుగంటిపోయే పరిస్థితి ఏర్పడింది. ప్రధానంగా నిజాం చెరువు పరిసరాలలో వందలాది ఎకరాలు రియల్ ఎస్టేట్ చేతుల్లోకి వెళ్ళి వెంచర్లుగా మారి ఇళ్లు కూడా నిర్మాణాలయ్యాయి. మున్సిపల్ అధికారులు, రెవెన్యూ అధికారులు పర్మిషన్‌లు ఇచ్చిన వారు ఇస్తారు, సంపాదించుకున్న వారు సంపాదించుకుంటారు. సాధారణ బదిలీలలో నూతనంగా వచ్చిన వారు నోటీసులు ఇస్తారు యధావిధిగా ఎంతో కొంత తీసుకుని తెలియనట్లు ఉంటారు. ఇలా సంవత్సరాలుగా చెరువులు ఆక్రమించబడి ఇళ్ళ నిర్మాణాలకు కారణమవుతున్నాయి. గత సంవత్సరం ప్రభుత్వ యంత్రాంగం కదిలి నిజాం చెరువును పరిరక్షించేందుకు యుద్ధ్ద ప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నామని పోలీసు యంత్రాంగంతో చెరువు చుట్టూ ఇరిగేషన్ అధికారులు సూచనలతో చెరువు భూమిని గుర్తించే యంత్రాలతో సరిహద్దులు నిర్ణయించి లోపలికి వచ్చిన ఇండ్ల వారికి నోటీసు ఇవ్వటం జరిగింది. నోటీసులు తీసుకున్న వారు నెత్తినోరు బాదుకుని లక్షలాది రూపాయలు వెచ్చించి భూములను కొనుగోలు చేయటమేకాక ఇళ్ళ నిర్మాణం చేసుకున్నప్పుడు విద్యుత్, మున్సిపల్, అధికారు లు ఈ రకంగా తమకు పర్మిషన్ ఇచ్చారని కోర్టుకు వెళ్ళారు. అయినా కూడా మున్సిపల్ రెవెన్యూ అధికారులు సరిహద్దులు యంత్రాలతో పూర్తి చేశారు. కొద్ది రోజులుగా కబ్జాలను ఆపిన ఆక్రమణదారులు తిరిగి నాలుగు మాసాల అనంతరం మళ్ళీ భూములను చెరువు శిఖంలో చదును చేయ టం ప్రారంభించారు. అధికార యంత్రాంగం ఎన్నికల బిజీలో ఉన్న సమయంలో అదునుగా భావించిన భూకబ్జాదారులు చెరువులపై దృష్టి సారించారు. చెరువులకు ఎఫ్‌టిఎల్ బోర్డులు పెట్టిన కబ్జాదారులు వాటిని పట్టించుకున్నది లేదు. అదే విధంగా క ంబాల చెరువు పరిస్థితి కూడి ఇ దే. గతంలో బంధం చెరువు సమీపంలో ఓ ఇంటిని నిర్మించేందుకు అధికారికి లంచం ముట్టజెప్పే సమయంలో ఎసిబి అధికారులకు చిక్కి అప్పటి మున్సిపల్ కమిషనర్ సస్పెండ్ అయిన విషయం విదితమే. పై విధంగా పట్టణం సమీపంలోని చెరువులలో శిఖం భూములలో మట్టి నింపుతూ యదేచ్ఛగా కబ్జాదారులు ప్రవర్తిస్తున్నా అధికారులు పట్టించుకున్న దాఖలాలు లేవు. సాధారణ బిజీబిజీగా ఉన్న అధికారులు ఆక్రమణల విషయం దృష్టికి వచ్చినా రానట్లుగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు ఎదురవుతున్నాయి.