కుప్పకూలిన ఉక్రెయిన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్ 737 విమానం
176 మంది సజీవదహనం
టెహ్రాన్: పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం నెలకొన్న వేళ ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. ఉక్రెయిన్ అంతర్జాతీయ ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్ 737 విమానం 176 మంది ప్రయాణికులు, సిబ్బందితో వెళ్తుండగా కుప్పకూలింది. బుధవారం టెహ్రాన్ నుంచి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో విమానంలో ఉన్న వారంతా సజీవదహనమైనట్లు ఇరాన్ అధికారులు పేర్కొన్నారు. ఉక్రెయిన్ రాజధాని కీవ్‌కు వెళ్లేందుకు టెహ్రాన్‌లోని ఇమామ్ ఖొమైనీ అంతర్జాతీయ విమానాశ్ర యం నుంచి బోయింగ్ 737 విమానం బయలుదేరగా ప్రమాదం వాటిల్లినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. విమానాశ్రయానికి వాయువ్యదిశగా దాదాపు 45 కిలోమీటర్ల దూరంలో ఉన్న షాహరియార్‌లోని ఖలాజ్ అబద్ వ్యవసాయ భూమిలోకుప్పకూలినట్లు పేర్కొంది. ప్రమాదంలో మృతి చెందిన 176 మందిలో 9 మంది విమాన సిబ్బంది కాగా, మిగతా వారంతా ప్రయాణికులని టెహ్రాన్ ప్రొవిన్స్ డిప్యూటీ గవర్నర్ మహ్మద్ టగ్ఙీజదెహ్ వ్యాఖ్యానించారు. మృతుల్లో 71 మంది పురుషులు, 81 మంది మహిళలు, 15 మంది చిన్నారులు ఉన్నారన్నారు. ఘటానాస్థలి వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయన్నారు. దాదాపు 500 వైద్య బృందాలు మృతదేహాలను ఒక చోటుచోటుకు చేరుస్తున్నాయని ఆయన తెలిపారు. మృతి వారిలో 82 మంది ఇరాన్‌వారు కాగా, 63 మంది కెనడాకు చెందిన వారిని అత్యవసర సేవల అధికార ప్రతినిధి మొజ్తాబ ఖలేది చెప్పారు. కేవలం ఇద్దరు ప్రయాణికులు, 9 మంది సిబ్బంది మాత్రమే ఉక్రెయిన్‌కు చెందిన వారని ఉక్రెయిన్ జాతీయ భద్రతా మండలి తెలిపింది. కాగా, ప్రమాదంలో విమానంలో ఉన్నవారంతా మృత్యువాత పడినట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు ఒలోద్యమ్యర్ జెలెన్ స్కీ ధ్రువీకరించారు. ఈ మేరకు ఆయన ఫేస్‌బుక్‌లో పోస్టు చేశారు. స్థానిక కాలమానం ప్రకారం బుధవారం తెల్లవారుజామున విమాన ప్రమాదం చోటుచేసుకుంది. ఎయిర్ పోర్టు నుంచి బయల్దేరిన కొద్ది క్షణాల్లోనే దానికి రాడార్‌తో సంబంధాలు తెగిపోయినట్లు స్థానిక మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఆ వెంటనే విమానం కూలిపోయింది. సాంకేతిక లోపం వల్లే ప్రమాదం జరిగినట్లు ఇరాన్ మీడియా చెబుతోంది. విమానం కూలిపోయిన దృశ్యాలను కొందరు నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్టు చేశారు. గాల్లో ఉండగానే విమానానికి నిప్పంటుకున్నట్లు వీడియో ఫుటేజీ ద్వారా తెలుస్తోంది. ఘటనలో విమానం పూర్తిగా కాలిపోయినట్లు స్థానిక మీడియా తెలిపింది. ఉదయం ఆరు గంటల తరువాత (0230 జిఎంటి) షాహరియార్‌లో ప్రయాణికులు విమానం కూలిపోయినట్లు తమకు సమాచారం అందిందని సహాయక, గాలిపు యూనిట్ హెడ్ షాహిన్ ఫాతి చెప్పారు. వెంటనే ఘటనాస్థలికి అన్ని కార్యనిర్వాహక బృందాలను పంపామన్నారు. కాగా.. ఇరాక్‌లోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ క్షిపణి దాడులు చేసిన కొద్ది గంటలకే ఈ విమాన ప్రమాదం జరగడం గమనార్హం. ఈ నేపథ్యంలో ఈ విమానాన్ని ఇరాన్ గగనతల రక్షణ వ్యవస్థ ప్రమాదవశాత్తూ కూల్చి ఉండొచ్చనే అనుమానాలు తలెత్తుతున్నాయి. అయితే ఈ విషయాన్ని అధికారికంగా ఎవరూ ధ్రువీకరించలేదు.