వ్యవస్థలపై విశ్వాస సంక్షోభం నెలకొంది
త్వరలో హైకోర్టు జడ్జీల ఖాళీలు భర్తీ
న్యాయవ్యవస్థపై నమ్మకాన్ని పరిరక్షించాలి
సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ
ఘనంగా తెలంగాణ హైకోర్టు శత వార్షికోత్సవ సభ
హాజరైన ముగ్గురు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు
ప్రజాపక్షం/ హైదరాబాద్: వ్యవస్థ మీద పెత్తనం, ఆధిపత్యం కోసం కొందరు వ్యక్తులు చేస్తున్న పోరాటాన్ని న్యాయ వ్యవస్థ తిప్పికొట్టాల్సిన అవసరం ఉన్నదని సుప్రీంకోర్టు న్యామూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ అన్నారు. విమర్శలకు న్యా యవ్యవస్థ భయపడదని, అధైర్యపడబోదని స్పష్టం చేశారు. ‘తెలంగాణ హైకోర్టు భవన వందేళ్ళ వార్షికోత్సవాలు’ శనివా రం హైకోర్టు ప్రాంగణంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో గతంలో హైకోర్టులో పని చేసి ప్రస్తు తం సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా ఉన్న జస్టిస్ ఎన్.వి.రమణ, జస్టిస్ లావు నాగేశ్వరరావు, జస్టిస్ ఆర్.సుభాష్‌రెడ్డిలు హాజరయ్యారు. తొలుత హైకోర్టు తాత్కాలిక ఛీఫ్ జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్ స్వాగతోపన్యాసం చేశారు. ఈ సందర్భం గా జస్టిస్ ఎన్.వి.రమణ ప్రసంగిస్తూ వ్య వస్థ మీద వ్యక్తిగతమైన ఆధిపత్యం కోసం కొందరు చేసే ప్రయత్నాలను గతంలో చూశామని, ఇకముందు కూడా చూడబోతున్నామని, వాటిని తిప్పికొట్టాల్సిన అవసరం ఉందన్నారు. కొంతకాలం క్రితం రాజకీయ నాయకుల మీద ప్రజలు, పత్రికలు తీవ్రమైన విమర్శలు చేసేవారని, ఇవాళ న్యాయవ్యవస్థపై చేస్తున్నారని అనే కమంది మిత్రులు తనతో ప్రైవేటు సంభాషణల్లో అంటుంటారని వివరించారు. విమర్శలకు న్యాయవ్యవస్థ భయపడాల్సిన పనేమి లేదని, భారతదేశంలో స్వేచ్ఛాయుత వాతావరణంలో ప్రజలకు న్యాయాన్ని అందించాల్సిన బాధ్యత ఉన్న న్యాయవ్యవస్థ విమర్శలను ఎదుర్కొనడంలో అధైర్యపడే పరిస్థితి లేదని చెప్పారు. న్యాయవ్యవస్థ గతంలో అనేక ఆటుపోట్లు, సంక్షోభాలు ఎదుర్కొన్నదని, సంక్షోభాలు ఎదుర్కొన్న ప్రతిసారి సమర్ధవంతంగా విజయం సాధించామన్నారు. అందుకే న్యాయవ్యవస్థ మీద ఉన్న అభిమానంతోనే కోట్లాది మంది, కోట్ల కేసులు మన ముందకు వస్తున్నాయన్నారు. న్యాయవ్యవస్థ స్వతంత్రాన్ని పరిరక్షించుకొని, ద్విగుణీకృత ఉత్సాహంతో న్యాయవ్యవస్థను ఉన్నత స్థాయిలో నిలబెట్టాల్సిన బాధ్యత అందరిపైన ఉన్నదన్నారు. ఇటీవల మానవ వ్యవస్థలపై విశ్వాసం అనే సంక్షోభం ముందకు వచ్చింది, ఇది అన్ని వ్యవస్థలకు సవాలు లాంటిదని జస్టిస్ రమణ అన్నారు. ప్రజల ఆమోదయోగ్యతపై వ్యవస్థ మనుగడ ఆధారపడి ఉన్నదని, వ్యవస్థలు ప్రజల విశ్వాసాన్ని సాధించడంలో విఫలమైతే అది తన ప్రాధాన్యతను కోల్పోయి చర్రిత పుటల్లోనే మిగిలిపోతుందన్నారు. పౌర హక్కులను పరిరక్షిస్తుందనే ఉద్దేశ్యంతో ప్రజలు న్యాయవ్యవస్థపై విశ్వాసం ఉంచారన్నారు. స్వాతంత్రం వచ్చిన నాటి నుండి ప్రజాస్వామ్య బలోపేతంలో, పౌర హక్కులు కాపాడడంలో రాజ్యాంగ పరిమితులకు లోబడి న్యాయవ్యవస్థ తమ వంతు పాత్ర పోషిస్తున్నదన్నారు. స్వాతంత్రోద్యమంలో ప్రాణాలు, ఆస్తులు పణంగా పెట్టి పోరాడిన గాంధీ,నెహ్రూ వంటి జాతీయ నాయకులకు వారసులమని న్యాయవాదులు గర్వంగా చెప్పుకుంటామని, అయితే స్వాతంత్రం వచ్చాక మన స్థానం వెనక్కి పోయిందని జస్టిస్ రమణ చెప్పారు. కేవలం కేసుల విషయంలోనే కాకుండా తమ కుటుంబ సమస్యల పరిష్కారం కోసం న్యాయవాదుల నుండి కక్షిదారులు మార్గదర్శనం కోరుకుంటారని, అయితే దురదృష్టవశాత్తు న్యాయవాదులు వృత్తికే పరిమితమయ్యారని, సంపాదన యంత్రాలు(ఎర్నింగ్ మిషన్స్)గా మారిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. సమాజంలో న్యాయవాదులు తమ పాత్ర నిర్వహించకపోతే ఆ స్థానాన్ని అనేక శక్తులు భర్తీ చేస్తున్నాయని, దాని వల్ల తీవ్రమైన పరిణామాలు ఎదురవుతాయని హెచ్చరించారు.