భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా ప్రజా సేవలు : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
ప్రజాపక్షం/రంగారెడ్డి ప్రతినిధి/ హైదరాబాద్
అత్యాధునిక ఎఐ టెక్నాలజీ ద్వారా కీలక రంగాలలో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలని లక్ష్యంగా ఎంచుకున్నామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. మెరుగైన పాలన, ఆర్థిక పురోగతితో పాటు ప్రజా సేవలను భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దాలని భావిస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటి ప్రరిశ్రమల శాఖ మంత్రి, రంగారెడ్డి జిల్లా ఇంచార్జి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు,స్థానిక ఎమ్మెల్యే ఆరికెపూడి గాంధీ, మైక్రోసాఫ్ట్ సంస్థ ప్రతినిధులతో కలిసి జ్యోతి ప్రజ్వల చేసి మైక్రోసాఫ్ట్ నూతన క్యాంపస్‌ను ప్రారంభించారు. అదే విధంగా టిహబ్‌లో గురువారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్‌బాబు గూగుల్ ప్రతినిధులతో సమావేశమై గూగుల్‌తో అవగాహన ఒప్పందం కుదుర్చున్నారు. కాగా, గచ్చిబౌలిలో మైక్రోసాఫ్ట్ సంస్థ నూతన క్యాంపస్‌ను ప్రారంభించిన అనంతరం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ మైక్రోసాఫ్ట్ విస్తరణతో తెలంగాణలోని యువతకు మరిన్ని ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని చెప్పారు. హైదరాబాద్‌లో ఎఐ సెంటర్ ఏర్పాటుకు సంస్థ ప్రతి నిధులతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుందని చెప్పారు.హైదరాబాద్ జర్నీలో మైక్రోసాఫ్ట్ నూతన క్యాంపస్ ప్రారంభం మరో మైలురాయి అని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో మైక్రోసాఫ్ట్ సంస్థకు సుదీర్ఘ అనుబంధం ఉందన్నారు. భవిష్యత్ అంతా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఎఐ)దే అని సిఎం తెలిపారు. మైక్రోసాఫ్ట్ కృషిలో 500 పాఠశాలల్లో కృత్రిమ మేధస్సును వినియోగిస్తూ బోధన కొనసాగుతోందన్నారు. మైక్రోసాఫ్ట్ సంస్థ భారత్‌కు వచ్చి ఇటీవలే 25 వసంతాలు పూర్తి చేసుకోవడం సంతోషంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు. మైక్రోసాఫ్ట్ హైదరాబాద్ నుంచి గ్లోబల్ ఇన్నోవేషన్,ఇంపాక్ట్ క్రియేట్ చేసిందని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం సహకారంతో మైక్రోసాఫ్ట్ ఎఐ సెంటర్ ఏర్పాటు చేస్తోందని గర్వంగా చెబుతున్నామని ఆయన తెలిపారు.ఈ కేంద్రం ఎఐ నాలెడ్జ్ హబ్ సహా క్లౌడ్ ఆధారిత ఎఐ మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తుందని సిఎం రేవంత్ రెడ్డి తెలిపారు.ఆవిష్కరణల పట్ల మైక్రోసాఫ్ట్ సంస్థ నిబద్ధతకు మా తెలంగాణ రైజింగ్ విజన్‌కు తోడవుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.