వివిధ రాష్ట్రాలకు ప్రకటించిన కేంద్రం
ఆంధ్రప్రదేశ్‌కు రూ. 900 కోట్లు
తమిళనాడు, కేరళకు నిల్
న్యూఢిల్లీ: ప్రకృతి విపత్తులను ఎదుర్కొనే అనేక రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు జాతీయ విపత్తు నిర్వహణ నిధులను మంజూరు చేయాలని కేంద్రం నిర్ణయించింది. కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ సింగ్ అధ్యక్షతన మంగళవారం జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో మొత్తం రూ.7,214.03 కోట్ల అదనపు నిధుల మంజూరుకు ఆమోదం తెలిపారు. ఇందులో వరదలు, కొండ చరియలు విరిగిపడడం లాంటి విపత్తులకు సంబంధించి హిమాచల్ ప్రదేశ్‌కు రూ.317.44 కోట్లు, ఉత్తర్‌ప్రదేశ్‌కు రూ.191.73 కోట్లు, కరవుతో అల్లాడుతున్న కర్ణాటకకు రూ.949.49 కోట్లు, మహారాష్ట్రకు రూ.4714.28 కోట్లు, గుజరాత్‌కు రూ.127.6 కోట్లు, కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరికి తుపాను సాయంగా రూ.13.09 కోట్లు అందించనున్నారు. గత సంవత్సరం వరుస తుపానుల తాకిడికి అతలాకుతలమైన ఆంధ్రప్రదేశ్‌కు రూ.900.4 కోట్లు కేటాయించారు. కానీ గత ఏడాది తీవ్ర వరదలతో నష్టపోయిన తమిళనాడు, కేరళకు మాత్రం ప్రస్తుతానికి ఎటువంటి కేటాయింపులు లేకపోవడం గమనార్హం. రాష్ట్రాన్ని కేంద్రం విస్మరిస్తోందంటూ తమిళనాడులో మోడీ మధురై పర్యటన సందర్భంగా నిరసనలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. ఈ సమావేశంలో కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, రాధామోహన్ సింగ్, పలు శాఖలకు చెందిన ఉన్నతాధికారులు, నీతి ఆయోగ్ సభ్యులు పాల్గొన్నారు.