కీలక అంశాలపై చర్చకు అనుమతించకుండా మొండి వైఖరి
ముగింపు దశకు చేరుకున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాలు
న్యూఢిల్లీ : ప్రతిపక్ష పార్టీలను ప్రధాని నరేంద్ర మోడీ ఏకం చేశారా? ఆ పార్టీల నేతలంతా కలసికట్టుగా ఉండేందుకు ప్రధానే కారణమయ్యారా? పార్లమెంటు వర్షాకాల సమావేశాల తీరును చూస్తుంటే ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం చెప్పాల్సి ఉంటుంది. పెగాసస్ స్పైవేర్‌తో ప్రముఖల ఫోన్ల ట్యాపింగ్, నిఘా, ధరల పెరుగుదల, ప్రభుత్వం కొత్తగా తెచ్చిన మూడు సాగు చట్టాల రద్దు తదితర అంశాలపై చర్చకు విపక్షాలన్నీ మూకుమ్మడిగా పట్టుబడుతునే ఉన్నాయి. గత నెల 19న ప్రారంభమైన ఈ సెషన్స్‌లో ఇప్పటికే మూడు వారాల సెషన్స్ కేవలం ఎనిమిది బిల్లుల ఆమోదానికి తప్ప ఎందుకూ ఉపయోగపడలేదు. నిర్మాణాత్మకమైన చర్చలు జరగలేదు. వ్యక్తుల సమాచార గోప్యత నుంచి దేశ రహస్యాల వరకూ ప్రతి అంశంలోనూ నిఘా వ్యవహారం ప్రతికూల ఫలితాలకు కారణమవుతున్నదనేది వాస్తవం. రాజకీయ నాయకుల నుంచి న్యాయమూర్తుల వరకూ, సామాజిక కార్యకర్తల నుంచి జర్నలిస్టుల వరకూ దేశంలో మూడు వందలకుపైగా ప్రముఖుల ఫోన్లు ట్యాపింగ్‌కు గురైనట్టు అంతర్జాతీయ మీడియాలో వచ్చిన కథనాలు ప్రకంపనలు సృష్టిస్తున్న విషయం తెలిసిందే. అందుకే పెగాసస్ వ్యవహారంపై చర్చ జరిపి, వాస్తవాలను వెల్లడించాలన్నది ప్రతిపక్ష పార్టీల డిమాండ్. అయితే, మోడీ సర్కారు మాత్రం చర్చకు వెనుకంజ వేస్తున్నది. అసలు ఈ సాఫ్ట్‌వేర్ కొనుగోలు విషయంలో ఇజ్రాయిల్‌కు చెందిన ఈ సాఫ్ట్‌వేర్‌తో ఒప్పందం కుదిరిందా? లేదా? అని సిపిఐ రాజ్యసభ సభ్యుడు బినయ్ విశ్వంతోపాటు పలువురు ప్రతిపక్ష నాయకులు కేంద్రాన్ని ప్రశ్నించారు. ఒక ప్రకటన చేయాలని కోరారు. కానీ, మోడీ సర్కారు మొండి వైఖరి కారణంగా చర్చ జరగలేదు. విపక్ష సభ్యుల నిరసనలు, ప్లకార్లుల ప్రదర్శనలు, నినాదాలతో అటు లోక్‌సభ,ఇటు రాజ్యసభ హోరెత్తిపోగా, సభా కార్యకలాపాలు దాదాపుగా జరగలేదు. కేంద్ర ప్రభుత్వ తీరుపై వామపక్షాలతోపాటు కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, బిఎస్‌పి, శిరోమణి అకాలీదళ్, ఎన్‌సిపి, సమాజ్‌వాది పార్టీ తదితర 14 ప్రతిపక్ష పార్టీలు అసంతృప్తి వ్యక్తం చేశాయి. పెగాసస్, రైతు సమస్యలు, పెట్రో ధరల పెరుగుదల వంటి అంశాలపై ఏకతాటిపై నిలిచాయి. పెగాసస్‌పై ఒక ప్రకటన చేయడానికి కూడా సుముఖత వ్యక్తం చేయని ప్రధాని మోడీ పరోక్షంగా విపక్షాల ఐక్యతకు సహకరించారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. బిల్లులను ప్రవేశపెట్టడం, ఆమోద ముద్ర వేయించుకోవడమే ధ్యేయంగా కేంద్ర సర్కారు వ్యూహంగా కనిపిస్తున్నది. అయితే, ఆ చర్యతో ప్రతిష్టను కోల్పోతున్నది. మరోవైపు ప్రతిపక్ష పార్టీల నేతలు పలుమార్లు సమావేశమయ్యారు. ఉభయ సభల్లో అనుసరించాల్సిన అంశాలపై చర్చించుకున్నారు. పరస్పర సహకారానికి అంగీకరించారు. ఇదంతా ప్రభుత్వ మొండి వైఖరి తెచ్చిన సఖ్యతగా చెప్పుకోవచ్చు. సభా కార్యకలాపాలను అడ్డుకుంటూ, తమ డిమాండ్లను వినిపించడం ద్వారా ప్రజా సమస్యలపై తాము చేస్తున్న పోరాటాలను ప్రతిపక్షాలు సమర్థంగా దేశం దృష్టికి తీసుకెళ్లాయి. పెగాసస్, రైతు సమస్యలు, ధరల పెరుగుదల వంటి కీలక అంశాలపై చర్చకు మోడీ సర్కారు ఎందుకు అంగీకరించడం లేదన్న ప్రశ్న ఇప్పుడు ప్రజల ముందుకు వెళ్లింది. ఈ విషయంలో విపక్షాలు విజయం సాధించాయి. జరిగిన నష్టాన్ని ఆలస్యంగా గుర్తించారో ఏమోగానీ ప్రధాని మోడీ మంగళవారం నుంచి మూడు రోజుల పాటుమంత్రివర్గ సమ్మేళనాలను నిర్వహించాలని నిర్ణయించారు. అధికారంలో ఉండే మిగతా మూడేళ్ల కాలంలో చేపట్టాల్సిన పనులతోపాటు, వచ్చే ఏడాది ఏడు రాష్ట్రాల అసెంబ్లీలకు జరగబోయే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలను గురించి కూడా మంత్రివర్గ సహచరులతో మోడీ చర్చించనున్నారు. వీటిలో గోవా, మణిపూర ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల్లో బిజెపి అధికారంలో ఉంది. పంజాబ్‌లో మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగుతున్నది. కాగా, పంజాబ్‌లో పాగా వేయడంతోపాటు, మిగతా ఆరు రాష్ట్రాల్లో అధికారాన్ని నిలబెట్టుకోవడం కూడా మోడీ ముందున్న ప్రధాన సవాలు. దీనిని ఆయన ఏ విధంగా ఎదుర్కొంటారో చూడాలి. ఈలోగా, పార్లమెంటు సమావేశాల్లో విపక్ష పార్టీల డిమాండ్లను ఆమోదించకుండా, చర్చకు సిద్ధపడకుండా ఇప్పటి వరకూ పోగొట్టుకున్న ప్రతిష్టను నిలబెట్టుకునే ప్రయత్నం జరగాలి. మొత్తం మీద మూడు వారాల సమావేశాల్లో విపక్షాలదే పైచేయి అయింది. ఇక మిగిలిన చివరి వారపు సెషన్స్‌లో మోడీ సర్కారు ఎలాంటి ఎత్తుగడను అనుసరిస్తుందో చూడాలి.
విపక్షాలను ఏకంచేసిన మోడీ!
RELATED ARTICLES