శుక్రవారం మొదటి గంట నుండే బస్సెక్కనున్న ఆర్‌టిసి కార్మికులు
తక్షణం రూ. 100 కోట్ల సాయం
బస్సు ఛార్జీలను పెంచుకునే వెసులుబాటు
2వ తేదీ నుంచి కిలోమీటరుకు 20 పైసలు పెంపుదల
మరణించిన వారి కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం
ఇక యూనియన్‌లు వద్దు.. వెల్ఫేర్ కౌన్సిళ్ల ఏర్పాటు
సిఎం కెసిఆర్ ప్రకటన
హైదరాబాద్ : ఆర్‌టిసి కార్మికులకు మానవతా దృక్పథంతో అవకాశం ఇవ్వాలని క్యాబినెట్ నిర్ణయించిందని, అందరు శుక్రవారం ఉదయం మొదటి గంట నుండే సంతోషంగా విధుల్లో చేరొచ్చని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. ఈ మేరకు వెంటనే ఆర్‌టిసి ఎండికి ప్రభుత్వం ఆదేశాలిస్తుందన్నారు. ఆర్‌టిసి ఆర్థిక పరిస్థితి బాగాలేదని, రూ.13 కోట్లు మాత్రమే ఉందని, జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా లేనందనే శుక్రవారం తెల్లారేసరికి ప్రభుత్వం నుండి రూ.వంద కోట్లు ఆర్‌టిసికి ఇస్తామన్నారు. అలాగే వచ్చే సోమవారం నుండి కిలోమీటర్‌కు 20 పైసల చొప్పున చార్జీలు పెంచుకునే వెసులుబాటు కల్పిస్తామని, తద్వారా ఏడాదికి రూ.750కోట్ల అదనపు ఆదాయం సమకూరుతుందన్నారు. సమ్మె సందర్భంగా చనిపోయిన కార్మికుల కుటుంబంలో ఒకరికి ఆర్‌టిసిలోనో లేదా ప్రభుత్వ విభాగాలలోనో ఉద్యోగం ఇస్తామని చెప్పారు. ఆర్‌టిసి కార్మికులు ఇప్పటికైనా రియలైజ్ కావాలని, యూనియన్‌ల మాటలు నమ్మవద్దన్నారు. ప్రగతిభవన్‌లో సిఎం కెసిఆర్ అధ్యక్షతన గురువారం క్యాబినెట్ సమావేశం జరిగింది. మధ్యాహ్నం రెండు గంటలకు ప్రారంభమైన క్యాబినెట్ భేటీ సుమారు ఆరుగంటల పాటు సాగింది. అనంతరం క్యాబినెట్ నిర్ణయాలను స్వయంగా సిఎం కెసిఆర్ మీడియా సమావేశంలో వెల్లడించారు. ఆర్‌టిసి అంశంపై క్యాబినెట్‌లో చర్చించామని, ఎన్నో సంస్థలను కాపాడామని, ఆర్‌టిసి ఉద్యోగులకు కూడా మానవతా దృక్పథంతో ఒక్క అవకాశమిద్దామని మంత్రులు అన్నారని పేర్కొన్నారు. ఆర్‌టిసి అంశానికి ముగింపు పలకాలనుకున్నామని, తాము పొట్ట నింపేటోళ్లమే తప్ప పొట్ట కొట్టేటోళ్లం కాదని, ఆర్‌టిసి కార్మికులు కూడా మా బిడ్డలేనని ఇప్పటికే చెప్పామన్నారు. డూప్లికేట్ మాటలు చెప్పబోమని, అందరూ వెంటనే డ్యూటీలో చేరాలన్నారు. తాను సిఎంగా చెబుతున్నానని, మళ్లీ అలుసుగా తీసుకుంటే మీరే రోడ్డును పడతారని హెచ్చరించారు.
ఆర్‌టిసి ఉద్యోగులకే పర్మిట్లు ఇద్దామనుకున్న
బస్సుల ప్రైవేటు పర్మిట్ల గురించి తాము అనుకున్నది వేరైతే , కొందరు సన్నాసలు చెప్పింది వేరని సిఎం కెసిఆర్ అన్నారు. తామేమి కక్షపూరితంగా తెల్లారేసరికి ప్రైవేటు పర్మిట్లు ఇవ్వాలని భావించటేదని, ఒకవేళ ఇచ్చిన పెట్టుబడిదారులకో, షావుకారులకో ఇవ్వదల్చుకోలేదన్నారు. ఒకవేళ ఇవ్వాలనుకుంటే కొద్ది మంది ఉద్యోగులకు విఆర్‌ఎస్ ఇచ్చి, అలాంటి వాళ్ళను నలుగురైదుగురికి కలిపి బస్సు నడుపుకునేందుకు పర్మిట్ ఇద్దామనుకున్నట్లు వెల్లడించారు. తమ ప్రభుత్వంపై ప్రజలకు రవాణా సదుపాయం కల్పించే బాధ్యత ఉన్నదని, అనవసరంగా ఆందోళనకు గురిచేసేలా పర్మిట్లు ఇవ్వాలనుకోలేదని చెప్పారు.
త్వరలో కార్మికులతో సమావేశం
ఒక పెద్దన్నగా, తెలంగాణ బిడ్డగా ఆర్‌టిసి కార్మికులను కాపాడే బాధ్యత ఉన్నదని సిఎం కెసిఆర్ చెప్పారు. త్వరలోనే ప్రధానిని కలిసేందుకు తాను ఢిల్లీకి వెళ్ళాల్సి ఉన్నదని, బహుశా వచ్చే నెల 3వ తేదీ ఉండొచ్చని, ఈ లోగానే ఆర్‌టిసిని కాపాడుకునేందుకు కార్మికులతో సమావేశమవుతానని చెప్పారు. ప్రగతిభవన్‌లో జరిగే ఈ సమావేశానికి ప్రతి డిపో నుండి ఐదుగురు కార్మికులను పిలుస్తామని, వారికి ముందే ఆర్‌టిసి ఆర్థిక స్థితి, బస్సుల పరిస్థితి, అప్పులు వంటి అంశాలపై క్యాబినెట్‌లో ఇచ్చిన నోట్‌ను తెలుగులో తర్జుమా చేసి అందేలా చేస్తామన్నా రు. అది క్షుణంగా చదువుకొని సమావేశానికి వస్తే సంస్థ ను ఎలా నడుపుకోవాలో అందరు చర్చించి ఉమ్మడి గా నిర్ణయం తీసుకుందామని తెలిపారు.తన మాట వింటే బాగుపడతారని, సింగరేణి కార్మికుల తరహాలో ఆర్‌టిసి కూడా లాభాల్లోకి వచ్చి, ఒక్కో కార్మికునికి రూ.50వేల వరకు బోనస్ వచ్చేలా చేస్తానన్నారు. తాను ఆర్‌టిసి మంత్రిగా ఉన్న రోజుల్లో సంస్థ రూ.13.80 కోట్ల నష్టా ల్లో ఉంటే,రూ.14.50కోట్ల లాభాల్లోకి తీసుకు వచ్చాన ని, అది ఇప్పటికీ చరిత్రలో గోల్డెన్ రికార్డేనన్నారు.
యూనియన్ నేతలను క్షమించబోను
సమ్మెకు తీసుకుపోయి, పది పదిహేను మంది చనిపో యేలా చేసిన యూనియన్ నాయకులను ఎట్టిపరిస్థితుల్లో తాను క్షమించదల్చుకోలేదని సిఎం కెసిఆర్ అన్నారు. ఆర్‌టిసిని బాగుచేసుకునేందుకు ప్రగతిభవన్‌లో ఏర్పా టు చేసే సమావేశానికి కూడా వాళ్ళను రానివ్వబోమ న్నారు.యూనియన్‌ల మాటలు నమ్మి ఆర్‌టిసి కార్మికు లు పెడదోవ పట్టారని, లేని టెన్షన్ తెచ్చు కున్నారని, అసంబద్ధ డిమాండ్‌లతో అనాలోచిత సమ్మెచేశారని అన్నారు. ఈ అవస్థకు, బాధకు, లేనిపోని ప్రయాసకు యూనియన్ నేతలే బాధ్యులని విమర్శించారు.వాళ్ళు ఇష్టమొచ్చినట్లు మాట్లాడారని, ఒకరు ఎమర్జెన్సీ వస్తుం దని అన్నారని, చిల్లర మాటలను తాము పట్టించుకోలే దనాన్నారు. సంస్థ వేరు అనే విధంగా యూనియన్‌లు కార్మికుల్లో భావనను సృష్టించాయని, తాను చెప్పినట్లు విని క్రమశిక్షణతో ఉంటే సింగరేణిలా తయారు చేస్తాననన్నారు. అయితే యూనియన్ బదులుగా వర్కర్స్ వెల్ఫేర్ కౌన్సిల్‌ను ఏర్పాటు చేసి సీనియర్ మంత్రిని ఇన్‌ఛార్జ్‌గా పెడతామన్నారు. కౌన్సిల్‌లో డిపోకు ఇద్దరు చొప్పున కార్మికులను సభ్యులుగా చేర్చుకుంటామని, ప్రతి నెల నిర్ణీత తేదీలో ఈ కౌన్సిల్ సమావేశమవుతుం దని, యాజమాన్యం నుండి వేధింపులు, సంస్థకు సంబం ధించిన అంశాలపై ఇందులో చర్చించి పరిష్కరి స్తామని చెప్పారు. యూనియన్‌ల ఉన్మాదంలో పడి బతుకులు పాడు చేసుకోవద్దని అన్నారు. అద్భుతమైన ఆర్‌టిసిని నడుపుదామని, మంచి జర గాలనే కొరుకుంటామే తప్ప, మీరు బాధపడాలని కోరుకోమన్నారు. సమ్మె సమయం లో తాత్కాలిక విధులు నిర్వర్తించిన వారికి ధన్యవాదాల ని, వారిని భవిష్యత్తులో ఏదోలా చూసుకుంటామని హామీ ఇచ్చారు.
పార్టీలు రాజకీయం చేస్తే, చీఫ్ జస్టిస్ పట్టించుకున్నారు
ఆర్‌టిసి కార్మికులకు బాధ్యత లేని ప్రతిపక్షాలు లేని పోనివి చెప్పారని, వాళ్ళకు ఆశలు కల్పించి, భరోసా ఇచ్చారని, బజారున పడేట్టు చేశారని సిఎం కెసిఆర్ ఆరో పించారు. జరగరానిది జరిగితే సారీ టాటా అని పోయా రని, వాళ్ళు ఆర్చేటోళ్ళు, తీర్చేటోళ్ళు కాదన్నారు. వారి కారణంగా రెండు నెలల జీతాలు పోయాయని, ఉద్యోగా లు ఉంటాయో లేదో అని తెలియని పరిస్థితి ఏర్పడిం దన్నారు. సమ్మె చట్ట ప్రకారం చట్ట వ్యతిరేక మైనదేనని, దీనిపై లేబర్ కోర్డుకు రెఫర్ చేయాలని హైకోర్టు చెప్పిం దని, ఒకవేళ తామలా చేస్తే ఏమవుతుందో ఆలో చించాలన్నారు.కాంగ్రెస్, బిజెపి ప్రభుత్వాలు ఉన్న చోట్ల ఎక్కడైనా ఆర్‌టిసిని ప్రభుత్వంలో విలీనం చేశారా? అని ప్రశ్నించారు.నిజంగా కార్మికుల పట్ల చిత్తశుద్ధితో ఆలో చించిన వ్యక్తి హైకోర్టు ఛీఫ్ జస్టిస్ మాత్ర మేనని, ఇటీవల రాజ్‌భవన్‌లో కలిసినప్పుడు కూడా పాపం కార్మి కులు అని, వాళ్ళను ఆదుకోవాలని సూచించారని తెలిపారు.
కేంద్రమే రూ.21వేల కోట్లు ఇవ్వాలి : ఇక బిజెపి వాళ్ళది విచిత్రవాదన అని, ఇక్కడ నలుగురు ఎంపిలు, ఒక కేంద్ర మంత్రి ఉన్నారని, రూట్ల ప్రైవేటీకరణ బిల్లుపై వారే ఓటేశారని సిఎం కెసిఆర్ అన్నారు. అక్కడ ఓటేసి, ఇక్కడ డమ్కీలు కొడుతున్నారని,ఢిల్లీకి తీసుకుపోతమని, అపాయింట్‌మెంట్ ఇస్తమని అంటున్నారని చెప్పారు. ఆర్‌టిసిలో కేంద్రానికి 30 శాతం వాటా ఉన్నదంటు న్నారని, ఎప్పుడో 1950ల పది రూపాయలు ఇచ్చారని, ఉమ్మడి రాష్ట్రంలో, ఇప్పుడు ఒక్క పైసా ఇవ్వలేదన్నారు. నష్టాల్లో ఉంది మీ వాటా ఇవ్వమంటే ఢిల్లీలో ఎల్లయ్య ఏమి చేస్తడని, లెక్కలు తీస్తే కేంద్రం ఇప్పటి వరకు రూ.22 వేల కోట్లు ఇవ్వాలని తేలుతుందని, ఐదు పైసల న్నా ఇస్తారా? అని ప్రశ్నించారు. శుష్క వాగ్దానాలు, శూన్య హస్తాలు,చలిమంటలు కాల్చుకున్నారని, కార్మి కుల బతుకులతో ఆడుకున్నారని ఇన్ని రాజకీయాలా? అని ప్రశ్నించారు.
విధుల్లో చేరొచ్చు
RELATED ARTICLES