అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశం
ప్రజాపక్షం/హైదరాబాద్; ప్రైవేటు ఆపరేటర్లకు బస్ రూట్ల అనుమతిపై విధివిధానాలను ఖరారు చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇందు కోసం ఇతర రాష్ట్రాలలో అమలులో ఉన్న ప్రైవేటు స్టేజి క్యారేజీ బస్సుల ఆపరేటర్ల విధానాలను అధ్యయనం చేయాలని సిఎం అధికారులకు సూచించారు. బస్ రూట్ల ప్రైవేటీకరణ విషయంలో న్యాయపరమైన చిక్కులు రాకుండా చూడాలని సిఎం అధికారులను ఆదేశించారు. ఆర్‌టిసి సంబంధించిన అంశాలపై గురువారం హైకోర్టులో విచారణ అనంతరం అధికారికంగా నిర్ణయం తీసుకోవాలని సిఎం కెసిఆర్ భావిస్తున్నట్లు సమాచారం. ఆర్‌టిసి సమ్మె, హైకోర్టు విచారణ తదితర అంశాలపై సిఎం కెసిఆర్ బుధవారం ప్రగతిభవన్‌లో సుధీర్ఘంగా సుమారు 8 గంటలపాటు సమీక్ష నిర్వహించారు. రవాణ శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌శర్మ, అడ్వకేట్ జనరల్ బి.ఎస్.ప్రసాద్, రవాణ శాఖ, ఆర్‌టిసి ఉన్నతాధికారులు సమావేశంలో పాల్గొన్నారు. అధికారుల నుంచి తెలిసిన సమాచారం ప్రకారం గురువారం హైకోర్టులో విచారణ, కార్మికులు విధుల్లో చేరేందుకు విధించిన గడువు ముగిసిన నేపథ్యంలో ప్రభుత్వపరంగా ఎలాంటి చర్యలు అవలంబించాలనే అంశాలపై అధికారులతో ముఖ్యమంత్రి చర్చించారు. ఆర్‌టిసి సమ్మెపై గురువారం హైకోర్టులో విచారణ అనంతరం తదుపరి చర్యలను చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. ఆర్‌టిసి సమ్మె, ఆర్థిక అంశాలపై బుధవారంనాడు కోర్టులో కౌంటర్ దాఖలు చేసిన ప్రభుత్వం కోర్టు నిర్ణయం కోసం వేచిచూడాలని సిఎం అధికారులకు సూచించారు. ఇప్పటికే 5100 ప్రైవేటు బస్సులకు రూట్ పిర్మిట్లను ఇస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. గడువులోపు కార్మికులు విధుల్లో చేరకపోతే మిగితా రూట్లను కూడా ప్రైవేటీకరిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ అంశాలపై ముఖ్యమంత్రి సమావేశంలో అధికారులతో చర్చలు జరిపారు. కొత్తగా ఎన్ని రూట్లలో ప్రైవేటు బస్సులను అనుమతించవచ్చని సిఎం కెసిఆర్ సమావేశంలో ఆరా తీశారని సమాచారం. కార్మికుల సమ్మె నేపథ్యంలో ప్రత్యామ్నాయ రవాణా ఏర్పాట్ల వివరాలను సిఎం కెసిఆర్ రవాణా, ఆర్‌టిసి అధికారులను అడిగి తెలుసుకున్నారు. సమ్మె విషయంలో ప్రభుత్వం, అధికారులు వెనక్కు తగ్గాల్సిన అవసరం లేదని, ఇప్పటికే అన్ని విధాలుగా ఆర్‌టిసిని ఆదుకున్నామని సిఎం సమావేశంలో పేర్కొన్నట్లు తెలిసింది. కార్మిక సంఘాల నేతలు చేసే బ్లాక్‌మెయిల్ ప్రకటనలకు అధికారులు భయపడవద్దని, వారు ఎలాంటి ఉద్యమాలు చేసినా చట్టపరంగా ఎదుర్కొవాలని సిఎం అధికారులకు సూచించారు. ఆర్‌టిసిపై ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలకు అవసరమైన పూర్తి సమాచారంతో రవాణ శాఖ, ఆర్‌టిసి అధికారులు సిద్దంగా ఉండాలని సిఎం కెసిఆర్ సమావేశంలో ఆదేశించినట్లు సమాచారం.