కాంగ్రెస్ వ్యవస్థాపక దినోత్సవసభలో ఖర్గే విమర్శల దాడి
న్యూఢిల్లీ : దేశ మౌలిక లక్షణాలపై తరచు దాడులు జరుగుతున్నాయని కాంగ్రెస్‌పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విమర్శించారు. కాంగ్రెస్‌పార్టీ 138వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎఐసిసి కేంద్ర కార్యాలయం ఢిల్లీలో బుధవారం ఆయన పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. పార్టీ విశ్రాంత అధ్యక్షురాలు సోనియాగాంధీ, పార్టీ నాయకుడు రాహుల్‌గాంధీ, ఇతన సీనియర్ నాయకులు ఈ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ, దేశ మౌలిక రాజ్యాంగ లక్షణాలపై తరచు దాడులు జరుగుతూ ఉండటంవల్ల సమాజం విద్వేషం కారణంగా విభజనకుగురవుతోందని తీవ్ర ఆందోళన వ్యక్త చేశారు. దేశంలో ప్రజలు ధరల పెరుగుదల, నిరుద్యోగం వంటి అనేక సమస్యలతో సతమతమవుతున్నారని, కానీ ప్రభుత్వం మాత్రం ఆ సమస్యలు పట్టించుకోవడంలేదని విమర్శించారు. కాంగ్రెస్ కారణంగానే దేశం ఇప్పటివరకూ అభివృద్ధి బాటలో కొనసాగిందని ఆయన అన్నారు. దేశంలో ప్రతిఒక్కరినీ కాంగ్రెస్‌పార్టీ అభివృద్ధిలో సమ్మిళితం చేస్తూ వచ్చిందని అన్నారు. భారత్ ఒక విజయవంతమైన బలమైన ప్రజాస్వామ్య దేశంగా అవతరించడమే కాకుండా రానున్న దశాబ్దాలలో ఆర్థిక,అణుశక్తి,వ్యూహాత్మక రంగాలలో ఒక సూపర్ పవర్‌గా ఆవిర్భవిస్తుందని అన్నారు. ప్రపంచంలో వ్యవసాయం, విద్య, వైద్యం, ఐటి, సేవా రంగాలలో కూడా అగ్రదేశంగా భారత్ రూపుదిద్దుకోగలదని అన్నారు. “ఈ అభివృద్ధి అంతా కేవలం ఒక్కరోజులోనో ఒక్క ఏడాదిలోనో జరగలేదు, ప్రజాస్వామ్యంపై కాంగ్రెస్‌పార్టీకి ఉన్న విశ్వాసం, విశ్వసనీయతవల్ల మాత్రమే సాధ్యమైంది, రాజ్యాంగంపై సంపూర్ణ విశ్వాసంతో ప్రతిఒక్కరినీ సమ్మిళితం చేయాలనే సిద్ధాంత దృకపథంవల్ల సాధ్యపడింది అని ఆయన అన్నారు. సత్యం, అహింస, పోరాటాలు అనే మార్గాలను అనుసరించడం ద్వారానే పార్టీ ప్రతి సందర్భంలోనూ ప్రజల ప్రయోనాలు కాపాడుతూ వచ్చిందని ఖర్గే అన్నారు. గతకాలపు స్వాతంత్య్రోద్యమ వీడియోలను, చిత్రాలను ఈ సందర్భంగా రాహుల్‌గాంధీ షేర్ చేశారు. ట్వీట్లు చేశారు. ఖర్గే కూడా వీడియోలు షేర్ చేస్తూ జాతీయ కాంగ్రెస్ సేవలు
ప్రస్తుతించారు. దేశ రాజకీయాల్లో సమాన అవకాశాలు, సమాన ఆర్థిక, సామాజిక అవకాశాలు,హక్కులు రాజ్యాంగం ప్రకారం అందరికీ దక్కాలని ఆయన అన్నారు. కాంగ్రెస్ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. కాంగ్రెస్ సేవా దళ్ కూడా ఈ సందర్భంగా శతవార్షికోత్సవంలోకి ప్రవేశించిందని ఆయన అన్నారు. మహాత్మాగాంధీ వాక్యాలను ఆయన గుర్తు చేసుకున్నారు. కాంగ్రెస్‌పార్టీ ధైర్యసాహసాలవల్ల దేశంలో పేదలు పేదరికం నుండి బయటపడి పురోగమిస్తున్నారని ఖర్గే అన్నారు. అనంతరం ఖర్గే ముంబయి వెళ్ళి అక్కడ కాంగ్రెస్ వ్యవస్థాపక దినోత్సవసభలో పాల్గొన్నారు. 1885లో కాంగ్రెస్‌పార్టీ ముబయిలో ఆవిర్భవించింది. అలెన్ అక్టేవియన్ హ్యూమ్ పార్టీ స్థాపకులలో ప్రథములు. భారత్ జోడో యాత్ర ప్రాధాన్యాన్ని ఖర్గే వివరించారు. ప్రజలందరూ ఈ యాత్రలో పాల్గొనాలని పిలుపు ఇచ్చారు.